Let's talk: editor@tmv.in
చొరబాట్లకు మమత అండగా నిలుస్తోంది: నితిన్ నబీన్

చొరబాట్లకు మమత అండగా నిలుస్తోంది: నితిన్ నబీన్

Pinjari Chand
29 జనవరి, 2026

పశ్చిమ బెంగాల్‌లో అక్రమ చొరబాట్లకు ప్రోత్సాహం ఇస్తూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో ప్రజలను వేధిస్తూ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెడుతోందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌కు వచ్చిన నబీన్, దుర్గాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార మార్పు అనివార్యమని వ్యాఖ్యానించారు. టీఎంసీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర జనాభా స్వరూపాన్ని మార్చి బెంగాల్‌ను బంగ్లాదేశ్‌గా మార్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఇది దేశ భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతోందని హెచ్చరించారు. అక్రమ చొరబాటుదారులు, నకిలీ ఓటర్లను తొలగించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటుంటే, టీఎంసీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేసే ప్రచారం, తప్పుడు సమాచారంతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు. ఎన్నికల సంఘం ప్రజలను వేధిస్తోందన్న టీఎంసీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

ప్రజలను బెదిరిస్తోంది ఎన్నికల సంఘం కాదు. టీఎంసీ చేతిలో పావుల్లా మారిన జిల్లా కలెక్టర్లు, ఎస్‌డీవోలు, బీడీవోలే ఈ వేధింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తాత్కాలిక ప్రభుత్వానికి లోబడి పనిచేస్తే అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్ర చరిత్రను ప్రస్తావించిన నబీన్, జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ కారణంగానే బెంగాల్ నేటి రూపంలో ఉందని చెప్పారు. తూర్పు పాకిస్తాన్‌లో విలీనం చేసే ప్రయత్నాలకు ఆయన అడ్డుకట్ట వేశారని గుర్తు చేశారు. అలాంటి శక్తులే నేటికీ పనిచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. బెంగాల్ మట్టికి చెందని వారు ఇక్కడ హక్కులు కోరలేరు. ఎంత త్యాగమైనా బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. బెంగాల్‌ను బంగ్లాదేశ్‌లో కలిపే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

సీఎం ఢిల్లీలో ఆర్తనాదాలు చేస్తున్నారు

ఎస్‌ఐఆర్ అంశాన్ని రాబోయే అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెడుతూ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ‘ఆర్తనాదాలు’ చేస్తోందని నబీన్ వ్యాఖ్యానించారు. టీఎంసీ పాలనను జంగిల్ రాజ్ గా అభివర్ణించిన ఆయన, రాష్ట్రంలో పరిపాలనకు బదులు అవినీతి, అరాచకమే నడుస్తోందని ఆరోపించారు. ఫ్యాక్టరీలు మూతపడ్డాయి… అవినీతి కంపెనీలు తెరుచుకున్నాయంటూ ఎద్దేవా చేశారు. నియామక కుంభకోణాల్లో పలువురు మంత్రులు జైలులో ఉన్నారని, మరికొందరు బెయిల్‌పై బయట ఉన్నారని గుర్తుచేశారు. నేరాలకు పాల్పడినవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఒకప్పుడు పారిశ్రామిక కేంద్రంగా పేరొందిన దుర్గాపూర్ పరిస్థితిపై కూడా విమర్శలు చేశారు. బీహార్, జార్ఖండ్ నుంచి కార్మికులు, విద్యార్థులు వచ్చే స్థాయిలో ఉన్న దుర్గాపూర్… టీఎంసీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని అన్నారు. సింగూర్ ఉద్యమ సమయంలో మమతా బెనర్జీ ఇచ్చిన పారిశ్రామికీకరణ హామీలు పదిహేనేళ్లైనా నెరవేరలేదని చెప్పారు. యువత ఉపాధి కోసం రాష్ట్రం విడిచి వెళ్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలపై నేరాలు పెరిగాయి

మహిళలపై నేరాల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. దుర్గాపూర్‌లో జరిగిన అత్యాచార ఘటనను ప్రస్తావిస్తూ, నిందితులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాత్రి 7 గంటల తర్వాత మహిళలు బయట ఎందుకు ఉన్నారని సీఎం ప్రశ్నించడం ప్రభుత్వ మనస్తత్వాన్ని చూపుతోందని విమర్శించారు. మహిళల భద్రత బాధ్యతను బీజేపీ కార్యకర్తలు స్వయంగా తీసుకుంటారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ ఏర్పడితే, బెంగాల్‌కు స్వర్ణయుగం వస్తుందని చెప్పారు. మమతా బెనర్జీ కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు.