Let's talk: editor@tmv.in
చొరబాటుదారుల కోసమే ప్రతిపక్షాలు ‘సర్’ ను అడ్డుకుంటున్నాయి: అమిత్ షా

చొరబాటుదారుల కోసమే ప్రతిపక్షాలు ‘సర్’ ను అడ్డుకుంటున్నాయి: అమిత్ షా

Pinjari Chand
11 డిసెంబర్, 2025

ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో జరిగిన చర్చలో జోక్యం చేసుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ‘అక్రమ చొరబాటుదారులను’ ఓటర్ల జాబితాలో ఉంచుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు.“ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఇకపై అవినీతి పద్ధతులతో గెలవలేమని భయపడుతున్నాయి. చొరబాటుదారుల ఓటుతో ప్రధాని, ముఖ్యమంత్రులు నిర్ణయిస్తే దేశ ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందా? అని షా ప్రశ్నించారు. ప్రతిపక్ష సభ్యులు చర్చ మధ్యలోనే వాకౌట్ చేసిన తర్వాత ఎంతసేపు బహిష్కరించినా... చొరబాటుదారులను గుర్తించి, తొలగించి, దేశం నుంచి బహిష్కరించే విధానాన్ని ఎన్డీఏ కొనసాగిస్తుంది అని షా స్పష్టంగా ప్రకటించారు.

కాంగ్రెస్ ఓటమికి కారణం నాయకత్వమే

కాంగ్రెస్ ఓటమికి కారణం ఈవీఎంలు కాదు, ఓటు చోరీ కాదు, వారి నాయకత్వ లోపమే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతోందనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రెస్ మీట్‌లో ఎవరైనా ప్రశ్న అడిగితే ఈసీ బీజేపీ ఏజెంటని ముద్రవేస్తారు. కేసు ఓడితే న్యాయమూర్తిని నిందిస్తారు. ఎన్నికల్లో ఓడితే ఈవీఎంల మీద రుద్దుతారు. ఇప్పుడు ఈవీఎం ఆరోపణ కూడా నిలబడటం లేదు కాబట్టి ‘ఓటు చోరీ’ అంటున్నారు. ఇప్పటికీ బీహార్‌లో ఓడిపోయారు.

నెహ్రూ, ఇందిరా, సోనియాపై ఓటు చోరీ ఆరోపణలు

స్వాతంత్ర్యం తర్వాత సర్దార్ పటేల్‌కు 28 మంది, నెహ్రూకు ఇద్దరే మద్దతు ఉన్నా నెహ్రూ ప్రధాని అయ్యారు. ఇది మొదటి ఓట్ చోరీ అని షా ఆరోపించారు. ఇందిరా గాంధీ ఎన్నికలు రద్దు అయిన తర్వాత తనకు తానుగా మినహాయింపు ఇచ్చుకున్నారు. ఇది రెండోది. సోనియా గాంధీ భారత పౌరసత్వం రాకముందే ఓటర్ అయ్యారన్న వివాదం ఇప్పుడు సివిల్ కోర్టులో ఉంది. ఇది మూడో ఓట్ చోరీ అని షా అన్నారు.

ఎస్ఐఆర్ చరిత్రను గుర్తు చేసిన షా

మొదటి ఎస్ఐఆర్ 1952లో నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగింది. 1957, 1961లోనూ నెహ్రూ హయాంలోనే జరిగాయి. లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరమ్మ, రాజీవ్, నరసింహారావు, వాజపేయి, మన్మోహన్ సింగ్ హయాంలోనూ ఎస్ఐఆర్ జరిగింది. అప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు అభ్యంతరం? అని షా ప్రశ్నించారు.

ఎస్ఐఆర్ లక్ష్యం – చనిపోయినవారి పేర్లు తొలగించడం, 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను చేర్చడం, విదేశీయులను క్రమంగా తొలగించడం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఈవీఎంలు ఓటు దొంగతనాన్ని ఆపాయి. అందుకే వాళ్లు భయపడుతున్నారు. 2014 నుంచి కాంగ్రెస్ ఓడిపోతోంది. ఈవీఎంలను 1989లో రాజీవ్ గాంధీ తీసుకొచ్చారు. 2004, 2009లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎంల మీద ఫిర్యాదు లేదు. 2014 తర్వాతే చెడగొట్టడం మొదలెట్టారు. ఈవీఎంలు ఓటు చోరీని ఆపేశాయి కాబట్టి వాళ్లకు ఇబ్బందిగా ఉంది అని షా దుయ్యబట్టారు. బీజేపీ గెలిచిన దానికంటే ఎక్కువసార్లు ఓడిపోయింది. కానీ ఎప్పుడూ ఎన్నికల సంఘాన్ని నిందించలేదని ఆయన గుర్తు చేశారు. ఓటర్ల జాబితా దోషపూరితమైతే మీరు ఎందుకు ఎన్నికల్లో పోటీ చేశారు? అని ప్రతిపక్షాలను ప్రశ్నించిన అమిత్ షా, చొరబాటుదారుల బచావో యాత్ర తీస్తే బిహార్‌లో 2/3 మెజారిటీతో ఎన్డీఏ గెలిచిందని గుర్తు చేశారు.

నేను నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లకు సమాధానం ఇవ్వండి రాహుల్ గాంధీ

ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో జరిగిన చర్చలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. ‘ఓట్ చోరీ’ ఆరోపణలను కేంద్రంగా చేసుకుని ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. నేను నిర్వహించిన మూడు ప్రెస్ కాన్ఫరెన్సుల మీద మీతో ప్రత్యక్షంగా చర్చ జరపడానికి నేను సిద్ధం. మీరు కూడా సిద్ధమేనా? అని సవాలు విసిరారు. ఆయన ఆరోపణల్లో ప్రధానంగా కర్ణాటక, హర్యానా వంటి రాష్ట్రాల్లో లక్షల్లో నకిలీ ఓటర్లున్నారన్న వాదన ఉంది.

చర్చలో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ అకస్మాత్తుగా జోక్యం చేసుకోవడంతో వాతావరణం మరింత ఉద్రిక్తమైంది. రాహుల్ గాంధీ వరుసగా మూడు ప్రెస్ కాన్ఫరెన్స్‌ల్లో చేసిన ఆరోపణలపై తాను సిద్ధంగా సమాధానాలు కలిగి ఉన్నానని షా పేర్కొన్నారు. పార్లమెంట్ మీ కోరికల ప్రకారం నడవదు. నా ప్రసంగ క్రమాన్ని మీరు నిర్ణయించలేరు. కాస్త శాంతంగా ఉండాలి, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాను అని అన్నారు.

దీనికి రాహుల్ ఇది పూర్తిగా రక్షణాత్మక, భయపడే తీరు. నిజమైన సమాధానం కాదని ఖండించారు. ఆరోపణలు, ప్రత్యరోపణల, సవాళ్లు మొత్తంగా లోక్‌సభలో రోజు మొత్తం ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధమే ప్రధానంగా నిలిచింది.

చొరబాటుదారుల కోసమే ప్రతిపక్షాలు ‘సర్’ ను అడ్డుకుంటున్నాయి: అమిత్ షా - Tholi Paluku