
చైల్డ్‌కేర్ సెంటర్‌పై సైబర్ దాడి!
లండన్‌లోని కిడో ఇంటర్నేషనల్ ఓ చిన్న పిల్లల సంరక్షణ కేంద్రంపై సైబర్ దాడి జరగడం కలకలం రేపింది. ఇందులో నిందితులు 8,000 మంది పిల్లల పేర్లు, ఫోటోలు, ఇంటి చిరునామాలు, కుటుంబ సంప్రదింపు వివరాలు దొంగిలించారు. రేడియంట్ అనే గ్యాంగ్ ఈ దాడికి బాధ్యత వహిస్తూ డార్క్ వెబ్‌లో ఆ డేటాను ప్రచురించింది. 10 మంది పిల్లల వివరాలు ఇప్పటికే లీక్ చేశారు. మరో 30 మంది పిల్లలు, 100 మంది ఉద్యోగుల వివరాలు విడుదల చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దీనికి ప్రతిగా నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ దాడికి గురైన సంస్థ డబ్బు డిమాండ్లపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఈ ఘటన కిడో ఇంటర్నేషనల్ అనే చిన్న పిల్లల సంరక్షణ కేంద్రంలో చోటు చేసుకుంది. లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు ఇప్పటి వరకు ఈ దాడికి సంబంధించి ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. హ్యాకర్లు ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ ద్వారా మాట్లాడుతూ కిడో నెట్‌వర్క్‌లో వారాల తరబడి ఉన్నట్లు చెప్పారు. తాము రష్యాకు చెందిన వాళ్లమని కూడా చెప్పారు. కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపలేదు. ఇది రాన్సమ్‌వేర్ తరహా దాడిగా పోలీసులు తేల్చారు. బ్రిటన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్‌కు చెందిన జోనాథన్ ఎల్లిసన్ మాట్లాడుతూ పిల్లలను చూసుకునే సంస్థలపై దాడి చేయడం దారుణమన్నారు. ఈ సంవత్సరం బ్రిటన్‌లో మరో రాన్సమ్‌వేర్ దాడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జాగ్వార్ ల్యాండ్ రోవర్ సప్లయర్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని ప్రకటించింది. సైబర్ దాడి వల్ల ఫ్యాక్టరీలు మూసివేసి అక్టోబర్ వరకు మార్చారు. దానికి ముందు కాలిన్స్ ఏరోస్పేస్పై దాడి వల్ల లండన్ హీత్‌రో విమానాశ్రయంలో చెక్ ఇన్, బోర్డింగ్ విధుల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. యూరప్‌లో విమాన ప్రయాణికులకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. దీంతో భారీ ఎత్తున ఆర్థిక నష్టం కూడా జరిగింది. ఏప్రిల్‌లో మార్క్స్ అండ్ స్పెన్సర్ పై స్కాటర్డ్ స్పైడర్ గ్యాంగ్ దాడి చేసి ఆన్‌లైన్ ఆర్డర్లు వారాల పాటు నిలిపివేసింది. దీంతో కంపెనీకి 2025-26లో 300 మిలియన్ పౌండ్లు నష్టం వస్తున్నట్లు అంచనా వేసింది.
ఈ ఏడాది 133 కంపెనీలపై దాడులు
లండన్ కిడో కేంద్రంపై సైబర్ దాడి పిల్లలు, వారి కుటుంబాల గోప్యతకు ముప్పుగా మారనుంది. హ్యాకర్లు పిల్లల పేర్లు, చిరునామాలు, ఫోటోలు లీక్ చేస్తుంటే, పిల్లలు, కుటుంబాలు నేరుగా వేధింపులకు గురయ్యే ప్రమాదాలున్నాయి. లండన్‌లో రేడియంట్ గ్యాంగ్ సైబర్ దాడి చేయడం ఇదే మొదటిసారిగా తెలుస్తోంది. కానీ హ్యాకర్లు చెప్పినట్లు రష్యాతో సంబంధముంటే ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతుంది. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఆ కోణంలో కూడా దర్యాప్త చేస్తున్నారు. 2025లో బ్రిటన్‌లో రాన్సమ్‌వేర్ దాడులు గణనీయంగా పెరిగాయి. సుమారు 133 కంపెనీలపై ఈ దాడులు జరిగాయి. ఇందులో 75 శాతానికి పైగా కంపెనీల్లో 200 మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. మార్క్స్ అండ్ స్పెన్సర్, కో ఆపరేటివ్, హ్యార్డ్స్ వంటి రిటైలర్లు, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి.
సాంకేతిక భద్రతకు ప్రాధాన్యత తప్పనిసరి
రాన్సమ్‌వేర్ అనేది ఒక రకమైన సైబర్ దాడి. ఇందులో సైబర్ నేరస్తులు ముందుగా కంప్యూటర్ సిస్టమ్‌లోని డేటాను లాక్ చేస్తారు. ఈ డేటాను తిరిగి అన్‌లాక్ చేయడానికి లేదా విడుదల చేయడానికి బదులుగా హ్యాకర్లు బాధితుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తారు. ఈ దాడులు వ్యక్తులు, కంపెనీలు, సంస్థల ఫైళ్లు, డేటాబేస్‌లను లక్ష్యంగా చేసుకొని చేస్తున్నారు. సైబర్ దాడి అనంతరం మళ్లీ ఆయా సంస్థలు యాక్సెస్ చేయలేని విధంగా మార్చేస్తాయి. రాన్సమ్‌వేర్ దాడులు ఆర్థిక నష్టంతో పాటు సమాచార గోప్యతకు భంగం కలిగిస్తాయి. ఆయా సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. ప్రస్తుత కాలంలో ఇది సైబర్ సెక్యూరిటీలో పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో సంస్థలు సాంకేతికంగా కట్టుదిట్టమైన భద్రత కలిగి ఉండాలి. ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టిసారించి సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
