
చైన్నైలో డీఎంకేను ఢీ కొట్టేదేవరు?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెన్నై జిల్లాలో కూటముల మధ్య ప్రధాన పోరు స్పష్టమవుతోంది. ప్రతిపక్షం ఏఐఏడీఎంకే తనకు మెజారిటీ నియోజకవర్గాలను కేటాయించుకోవడంతో, మొత్తం 16 స్థానాల్లో 13 చోట్ల అధికార పార్టీ డీఎంకేతో నేరుగా తలపడనుంది. పార్టీ అధినేత ఎడప్పాడి కే.పళనిస్వామి చెన్నైలో డీఎంకే బలమైన కోటగా భావించే ప్రాంతాల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించారు. దీంతో పోటీ మరింత రసవత్తరంగా మారనుంది. ప్రభుత్వాన్ని ఢీ కొట్టేలా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని వ్యూహాలను రచిస్తున్నారు.
ఏఐఏడీఎంకే టికెట్‌పై బీఎస్పీ నాయకుడి భార్య పోటీ
మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చారు. మాజీ మంత్రులు బి. వలర్మతి, గోకుల ఇందిరలను వరుసగా థౌజండ్ లైట్స్, అన్నానగర్ నియోజకవర్గాల్లో నిలబెట్టగా, వారు డీఎంకే ఎమ్మెల్యేలు ఎన్. ఎజిలన్, ఎన్. చిత్రరాసుతో పోటీ పడనున్నారు. హత్యకు గురైన బీఎస్పీ నాయకుడు ఆర్మ్‌స్ట్రాంగ్ భార్య పోర్కోడి, రిజర్వ్ నియోజకవర్గమైన తిరు-వి-కా నగర్ నుంచి పోటీ చేస్తూ డీఎంకే అభ్యర్థి కె.ఎస్. రవిచంద్రన్‌ను ఎదుర్కొంటున్నారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూర్‌లో పి. సంతానకృష్ణన్‌ను, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ పోటీ చేస్తున్న చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గంలో ఆధిరాజారాంను ఏఐఏడీఎంకే రంగంలోకి దించింది. అగ్రనేత డి. జయకుమార్‌తో పాటు కేపీ కందన్, రాయపురం మనో, విరుగై వి.ఎన్. రవి వంటి సీనియర్ నేతలు కూడా ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. చెన్నైలో 13 స్థానాల్లో పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే, మిగిలిన మైలాపూర్, సైదాపేట్, పెరంబూర్ స్థానాలను తన మిత్రపక్షాలైన బీజేపీ, ఎఎంఎంకే, పీఎంకేలకు కేటాయించింది.
మరోవైపు డీఎంకే తమ ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలామందిని మళ్లీ బరిలోకి దించింది. జాన్ ఎబెనేజర్ (ఆర్‌కే నగర్), శేఖర్ ఆర్.డి (పెరంబూర్), ఏవీఎం ప్రభాకర రాజా (విరుగంబాక్కం)లతో పాటు మంత్రులు పీకే శేఖర్ బాబు (హార్బర్), మా సుబ్రమణియన్ (సైదాపేట్) మళ్లీ పోటీ చేస్తున్నారు.
ఇక ఎన్నికల పోరు ద్వైపాక్షికంగా మాత్రమే కాకుండా బహుముఖంగా మారే అవకాశముంది. సీమన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ కట్చి కూడా పోటీలో ఉండగా, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే రంగంలోకి రావడంతో చెన్నైలో పోరు చతుర్ముఖంగా మారే పరిస్థితి నెలకొంది. 2021 ఎన్నికల్లో గెలిచిన 16లో 15 స్థానాల్లో డీఎంకే మళ్లీ పోటీ చేస్తుండగా, ఈసారి కొత్త అభ్యర్థులకు కూడా అవకాశం ఇచ్చింది. దీంతో చెన్నైలో ఈసారి ఎన్నికల పోటీ మరింత ఉత్కంఠగా మారనుంది.
