
చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం: రూ. 1.68 కోట్ల విలువైన స్టాక్ సీజ్
హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిషేధిత చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించడంతో పాటు పక్షులు, మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న చైనీస్ మాంజా వినియోగాన్ని పూర్తిగా అరికట్టే లక్ష్యంతో హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు కేవలం నాలుగు రోజుల్లోనే పోలీసులు భారీగా నిషేధిత మాంజాను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాలంలో మొత్తం రూ. 43 లక్షల విలువైన 2,150 బాబిన్ల చైనీస్ మాంజాను సీజ్ చేశారు. ఈ అక్రమ వ్యాపారానికి సంబంధించి 29 కేసులు నమోదు చేసి, 57 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇదే కాకుండా, గత నెల రోజుల వ్యవధిలో నగరవ్యాప్తంగా నమోదైన గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మొత్తం 132 కేసులు నమోదు కాగా, వాటిలో రూ. 1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్ల నిషేధిత మాంజాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులలో ఇప్పటివరకు మొత్తం 200 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. చైనీస్ మాంజా అక్రమ విక్రయం, నిల్వ, రవాణా, అలాగే వినియోగంపై పోలీసులు ఎలాంటి రాజీ పడడం లేదని స్పష్టం చేశారు.
చైనా మాంజా వల్ల ప్రతి ఏడాది అనేక పక్షులు గాయపడటం లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుండగా, ద్విచక్ర వాహనదారులు, చిన్నారులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణ భద్రత, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ఈ మాంజాను పూర్తిగా నిషేధించింది.
నిషేధిత మాంజాను విక్రయించినా లేదా కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని, జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సురక్షితమైన, అనుమతించిన దారాలనే ఉపయోగించాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. పండుగను ఆనందంగా, బాధ్యతాయుతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
