
చైనా, పాక్, అఫ్గాన్‌లను వణికించిన భూకంపం
ఆసియా ఖండంలో గురువారం వరుసగా మూడు భూకంపాలు సంభవించాయి. చైనా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ దేశాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4.0 కంటే ఎక్కువ తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనల కారణంగా ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు పెద్దగా ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు.
చైనాలో 4.7 తీవ్రతతో భూకంపం
చైనా వాయువ్య ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లో రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుండి సుమారు 220 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం గానీ, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం గానీ సంభవించినట్లుగా నివేదికలు అందలేదు. అయినప్పటికీ, ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు.
అఫ్గానిస్తాన్‌లో 4.4 తీవ్రతతో కంపించిన భూమి
అఫ్గానిస్తా న్‌లో 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. కాబూల్‌కు తూర్పు దిశలోని 129 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుండి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు తెలిపారు. భవనాలు స్వల్పంగా కంపించగా, ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. గత కొద్ది నెలలుగా ఆఫ్ఘానిస్తాన్‌లో వరుసగా భూకంపాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ప్రాంతంలో తరచూ వచ్చే భూకంపాలు హిందూకుష్ పర్వత శ్రేణులలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్ల సంభవిస్తాయి. ఇటీవలి కాలంలో అఫ్గానిస్తాన్‌లో 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చిన భారీ భూకంపాల కారణంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా సంభవించాయి. ఈ నేపథ్యంలో 4.4 తీవ్రతతో వచ్చిన ఈ ప్రకంపనలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేశాయి. అయితే ఈ స్వల్ప ప్రకంపనల వలన పెద్ద నష్టం జరిగినట్లుగా ప్రాథమిక నివేదికలు వెల్లడించలేదు.
పాకిస్తాన్‌లోనూ భూ ప్రకంపనలు
పాకిస్తాన్‌లోనూ భూమి కంపించింది. గురువారం తెల్లవారుజామున 2: 30 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. పాకిస్తాన్- అఫ్గానిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. దీని లోతు సుమారు 240 కిలోమీటర్ల వద్ద నమోదైంది.
నిపుణుల ప్రకారం, ఈ మూడు భూకంపాలు ఒకే టెక్టానిక్ ప్లేట్ ప్రాంతానికి చెందినవే కావడంతో ఒకదానిపై ఒకటి స్వల్ప ప్రభావం చూపవచ్చని తెలిపారు. భూకంపాల వల్ల గణనీయమైన నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించింది.
