Let's talk: editor@tmv.in
చైనా గేమింగ్ యాప్ రూ.400 కోట్లమోసంపై ఈడీ తాజా ఛార్జిషీట్

చైనా గేమింగ్ యాప్ రూ.400 కోట్లమోసంపై ఈడీ తాజా ఛార్జిషీట్

Dantu Vijaya Lakshmi Prasanna
20 డిసెంబర్, 2025

కోవిడ్ మహమ్మారి సమయంలో కార్యకలాపాలు నిర్వహించిన చైనా గేమింగ్ యాప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. దీనికి సంబంధించిన ప్రధాన అంశాలను ఈడీ తెలిపింది.

ఈ యాప్ పేరు ఫీవిన్ ,ఈ యాప్ ద్వారా మొత్తం మోసం విలువ సుమారు రూ.400 కోట్లు. దీనిలో తాజా నిందితులుగా ఉత్కర్ష్ ఆర్య, సుజిత్ కుమార్ ఝా, ఝాకు చెందిన 12 కంపెనీలు. ప్రధానఆరోపణ, చైనా జాతీయుల సహకారంతో ఈ యాప్‌ను నిర్వహిస్తూ, భారతీయుల నుండి అక్రమంగా డబ్బు వసూలు చేయడం.

కేసు వివరాలు:

2020లో కోవిడ్ సమయంలో ప్రారంభమైన ఈ యాప్, జూన్ 2023 వరకు కొనసాగింది. "సులభంగా డబ్బు సంపాదించవచ్చు" అనే ఆశ చూపిస్తూ యూట్యూబ్, ఫేస్‌బుక్ ద్వారా ప్రచారం చేశారు. ఇందులో మైన్‌స్వీపర్, కలర్ ప్రెడిక్షన్ వంటి అదృష్టంపై ఆధారపడే సాధారణ గేమ్‌లను ఉంచారు. ఈడీ దర్యాప్తు ప్రకారం, భారతీయ గేమర్స్ నుండి వసూలు చేసిన సుమారు రూ.400 కోట్ల నిధులను బినాన్స్ వంటి క్రిప్టో ఎక్స్ఛేంజీల ద్వారా చైనా జాతీయుల వాలెట్లకు మళ్లించారు. ఈ లావాదేవీల కోసం టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కమ్యూనికేట్ చేసేవారు. దీనిలో బాగంగా నిందితుడు సుజిత్ కుమార్ ఝాకు చెందిన 12 కంపెనీలను ఈ నేరపూరిత సొమ్మును దాచడానికి ఉపయోగించినట్లు ఈడీ గుర్తించింది. ఈ అక్రమ ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా చూపించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారు.

ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 2024లో కోల్‌కతా కోర్టులో మొదటి ఛార్జిషీట్ దాఖలైంది. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేయగా, రూ.26 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. తాజాగా డిసెంబర్ 8న కోల్‌కతా కోర్టులో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశారు.

కోల్‌కతాలోని కాసిపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.