Let's talk: editor@tmv.in
చైనానే మా ప్రధాన మిత్ర దేశం

చైనానే మా ప్రధాన మిత్ర దేశం

Venkatesh Balusula
28 సెప్టెంబర్, 2025

అమెరికాతో త‌మ సంబంధాలు తాత్కాలిక‌మేన‌ని, చైనానే త‌మ ప్ర‌ధాన మిత్ర దేశ‌మ‌ని పాకిస్తాన్ ర‌క్ష‌ణ మంత్రి ఖ‌వాజా ఆసిఫ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసీమ్ మునీర్‌లు వైట్ హౌస్‌లో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీ అనంత‌రం ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. అమెరికాతో త‌మ‌ సంబంధాలు తాత్కాలికమేన‌ని, చైనాతో పాక్‌ బంధం దృఢమైంద‌ని పేర్కొన్నారు. అమెరికాతో ద‌గ్గ‌ర‌వుతున్నా చైనా ఆందోళన చెందద‌ని స్ప‌ష్టం చేశారు.

చైనా నుంచే ఆయుధాలు, విమానాలు

ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆసిఫ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పాక్, చైనా సంబంధాలు 1950ల చివరి నుంచి బలంగా ఉన్నాయ‌న్నారు. కానీ అమెరికాతో ఇప్పుడిప్పుడే స‌త్సంబంధాలు ఏర్ప‌డుతున్న‌ట్లు చెప్పారు. ఖ‌నిజ ఒప్పందాలు, క్రిప్టో ఒప్పందాలు వంటి అంశాలతో ట్రంప్‌తో సన్నిహితంగా మెలుగుతున్నా చైనాతో త‌మ బంధానికి ఎలాంటి ఢోకా లేద‌న్నారు. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డేటా ప్రకారం గత నాలుగేళ్లలో పాక్ 80 శాతం ఆయుధాలు చైనా నుంచి తీసుకుంది. పాక్ భవిష్యత్తు ఎవరితో అనే ప్రశ్నకు ఆసిఫ్ స్పందిస్తూ చైనానే మాకు నమ్మకమైన మిత్రుడు అని స‌మాధాన‌మిచ్చారు. చైనా నుంచి విమానాలు, జలాంతర్గాములు, ఇతర ఆయుధాలు వస్తున్నాయ‌న్నారు. ఇరు దేశాల‌ రక్షణ సహకారం మరింత బలపడుతోంద‌ని తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు జీవితం, అమెరికాతో సంబంధాలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి.

అమెరికాతో త‌మ‌ సంబంధాలు లావాదేవీల ఆధారంగా సాగుతున్నాయ‌ని ఆసిఫ్ చెప్పారు. ట్రంప్ గురువారం షెహబాజ్ షరీఫ్, అసీమ్ మునీర్‌లను వాషింగ్టన్ ఓవల్ ఆఫీసులో కలిశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, స్టేట్ సెక్రటరీ మార్కో రూబియో కూడా ఈ స‌మావేశానికి హాజరయ్యారు. శుక్రవారం ఐరాస సాధార‌ణ స‌మావేశంలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ట్రంప్‌ను ప్రశంసించారు. ట్రంప్‌ను శాంతి దూత అని, నోబెల్ శాంతి బహుమతికి అర్హుడంటూ వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్‌, పాక్‌ మధ్య కాల్పుల విరమణకు ట్రంప్ సహకరించారని చెప్పారు. అయితే భార‌త్‌ దానిని తిరస్కరిస్తూ రెండు దేశాల డీజీఎంఓల మధ్యే ఒప్పందం జరిగిందని పేర్కొంది. సౌదీ-పాక్ రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీపై దాడి జరిగితే పాక్ రక్షణలో భాగమవుతుంది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య రక్షణ బంధాన్ని బలోపేతం చేసింది. షెహబాజ్ షరీఫ్ సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానంపై రియాద్‌ సందర్శించి ఒప్పందం కుదుర్చుకున్నారు.

అమెరికాతో ఆర్థిక ప్రయోజనాలు చూసుకుంటూనే చైనాను ప్రధాన మిత్రుడిగా కాపాడుకోవాలని పాకిస్తాన్‌ భావిస్తోంది. ఇది తాత్కాలికంగా పాక్‌కు ప్ర‌యోజ‌నాలు క‌లిగించినా, ధీర్ఘ కాలంలో స‌మ‌స్య‌లు తెచ్చి పెట్టే అవ‌కాశం ఉంది. పాకిస్తాన్‌లో ఉన్న‌ భూగర్భ సంపదను ఉపయోగించి అమెరికాను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వంటి కీలక ఖనిజాలు అమెరికాకు అత్యంత కీల‌కంగా మారాయి. ఇవి ఎలక్ట్రానిక్స్, రక్షణ, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో వినియోగిస్తారు. అమెరికాకు రేర్ ఎర్త్ లిమెంట్స్ అవ‌స‌ర‌మ‌ని, చైనా త‌క్ష‌ణ‌మే వాటిని ఎగుమ‌తి చేయాల‌ని , లేదంటే రెండు వంద‌ల శాతం సుంకాలు మోపుతాన‌ని ట్రంప్ బ‌హిరంగంగా హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. అలాగే క్రిప్టో రంగంలో పాక్, ట్రంప్ మధ్య సన్నిహిత బంధం ఏర్పడింది. ట్రంప్ కుటుంబం భారీగా పెట్టుబ‌డుటు పెట్టిన‌ క్రిప్టో ప్రాజెక్టులు పాక్ సైన్యం, ప్రభుత్వంతో సంబంధం క‌లిగి ఉన్నాయి. అమెరికాతో ఎంత మంచి సంబంధాలు కొన‌సాగుతున్నా పాక్ చైనాను వ‌దులుకునే అవ‌కాశం లేదు. ఎందుకంటే అమెరికా సంబంధాలు అనిశ్చితమైనవి. ట్రంప్ వైఖ‌రి ఎప్పుడు, ఏ విధంగా మారుతుందో చెప్ప‌లేం. అలాగే చైనా పొరుగు దేశం కావటం వల్ల భౌగోళిక ప్రయోజనాలున్నాయి. ఈ నేప‌థ్యంలో పాక్ తన రక్షణ, ఆర్థిక ప్రయోజనాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ వ్యూహాత్మ‌క‌మైన‌ విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది.

చైనానే మా ప్రధాన మిత్ర దేశం - Tholi Paluku