Let's talk: editor@tmv.in
చైనాతో వ్యవహారాల్లో బీజేపీ ద్వంద వైఖరి: కాంగ్రెస్

చైనాతో వ్యవహారాల్లో బీజేపీ ద్వంద వైఖరి: కాంగ్రెస్

Pinjari Chand
14 జనవరి, 2026

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) ప్రతినిధుల బృందం బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై కాంగ్రెస్ పార్టీ బుధవారం తీవ్రంగా విరుచుకుపడింది. చైనాతో వ్యవహారాల్లో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపిస్తూ, ఇటువంటి సమావేశాల్లో చైనా సరిహద్దు దౌర్జన్యాల అంశాన్ని లేవనెత్తారా? అని ప్రశ్నించింది. కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా మాట్లాడుతూ, చైనా విధానంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత, సంపూర్ణ పారదర్శకత చూపాలని డిమాండ్ చేశారు. సీపీసీ–బీజేపీ/ఆర్ఎస్ఎస్ నేతల మధ్య జరిగిన అన్ని రహస్య సమావేశాల అజెండా, ఫలితాలు, సమావేశాల మినిట్స్‌ను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన అన్నారు. సీపీసీ అంతర్జాతీయ విభాగం ఉప మంత్రి సన్ హైయాన్ నేతృత్వంలోని చైనా ప్రతినిధుల బృందం మంగళవారం బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన నేపథ్యంలో కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సమావేశంలో బీజేపీ తరఫున ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ నేతృత్వంలోని బృందం పాల్గొంది. రెండు పార్టీల మధ్య పరస్పర సంబంధాలను మెరుగుపరచుకునే అంశంపై చర్చ జరిగిందని బీజేపీ విదేశాంగ విభాగం ఇన్‌చార్జ్ విజయ్ చౌతైవాలే ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అదే సమయంలో సీపీసీ ప్రతినిధులు సోమవారం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలేను కలవడంపై కూడా పవన్ ఖేరా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

దేశ విధానాలను ప్రభావితం చేసే స్థాయిలో ఆర్ఎస్ఎస్

నాన్-స్టేట్ యాక్టర్లు ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయడం సరికాదు. ఆర్ఎస్ఎస్ అనేది నమోదు కాని సంస్థ. అలాంటి సంస్థలు దేశ విధానాలను ప్రభావితం చేసే స్థాయిలో సమావేశాలు నిర్వహించడం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. వాళ్లు ఏ అంశాలపై మాట్లాడారు? సంస్కృతిపైనా? అది బీజేపీ/ఆర్ఎస్ఎస్ సమాధానం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఇతర దేశాల రాజకీయ పార్టీలతో చర్చలు జరపడం తప్పేమీ కాదని, కానీ బీజేపీ ద్వంద్వ వైఖరిపైనే తమకు అభ్యంతరమని కాంగ్రెస్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ చైనాతో ఎంవోయూ చేసిందని ఏళ్ల తరబడి బీజేపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు తామే చైనా కమ్యూనిస్టు పార్టీతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత దేశం మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఖేరా ఆరోపించారు.

ఇలాంటి సమావేశాల్లో బీజేపీ చైనా దౌర్జన్యాల అంశాన్ని ప్రస్తావించిందా? అని ప్రశ్నించిన ఖేరా, 2020కి ముందు లద్దాఖ్ సరిహద్దుల్లో యథాస్థితిని పునరుద్ధరించాలన్న అంశం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంట చైనా చేపడుతున్న మిలిటరీ నిర్మాణాలు, భారత్–చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య అసమతుల్యత, భారత మార్కెట్లలో చైనా వస్తువుల వరద, అరుదైన ఖనిజాలు, ప్రత్యేక ఎరువుల సరఫరాపై చైనా విధించిన ఆంక్షలు, అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన భారత పౌరుల అరెస్టుల వంటి అంశాలు చర్చకు వచ్చాయా? అని నిలదీశారు.

పాకిస్థాన్ విషయంపై చైనాతో మాట్లాడారా?

పాకిస్థాన్‌కు చైనా అందిస్తున్న సైనిక సహకారంపై బీజేపీ ఎప్పుడైనా చైనాను ప్రశ్నించిందా? అని కూడా ఆయన అడిగారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా ఆయుధాలు, టెక్నాలజీ, యుద్ధ విమానాలు అందించింది. దీనిని భారత ఉప సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కూడా అంగీకరించారు. అయినప్పటికీ మోడీ ప్రభుత్వం చైనా కంపెనీలపై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆలోచిస్తోందని ఖేరా విమర్శించారు.

గల్వాన్ లోయలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారని గుర్తుచేసిన ఖేరా మోడీ ప్రభుత్వం చైనాకు క్లీన్ చిట్ ఇచ్చి, వారి విస్తరణ వాదాన్ని ప్రోత్సహించిందని ఆరోపించారు. పాకిస్థాన్‌తో యుద్ధం ఆపడానికి తామే జోక్యం చేసుకున్నామని చైనా విదేశాంగ మంత్రి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనం పాటిస్తున్నారని కూడా ఆయన విమర్శించారు. సిలిగురి కారిడార్ (చికెన్ నెక్) వైపు చైనా చొరబాటుకు ప్రయత్నిస్తోందని, శాక్స్‌గామ్ లోయను చైనా తమ భూభాగమని చెప్పుకుంటున్నప్పటికీ, మోడీ ప్రభుత్వం నిద్రలో ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ‘లాల్ ఆంఖ్’ అంటున్న బీజేపీ, వాస్తవంలో చైనా కమ్యూనిస్టు పార్టీకి ‘లాల్ సలామ్’ చేస్తోంది. దేశ భౌగోళిక సమగ్రత, సార్వభౌమత్వం కేంద్ర ప్రభుత్వంలో తీవ్రంగా దెబ్బతిన్నాయని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. 2008 నుంచి ఇప్పటివరకు బీజేపీ–సీపీసీ మధ్య కనీసం 12 సమావేశాలు జరిగినట్లు ఆయన తెలిపారు.

రహస్య ఎంవోయూ లేదు: కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ

చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) ప్రతినిధుల బృందం బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీజేపీ మంగళవారం ఘాటుగా ప్రతిస్పందించింది. న్యూఢిల్లీ–బీజింగ్ మధ్య సంబంధాలు ‘మెరుగుపడిన’ నేపథ్యంలో తాము బహిరంగంగానే, అధికారికంగా సమావేశం నిర్వహించామని, కాంగ్రెస్‌లా రహస్యంగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోలేదని బీజేపీ స్పష్టం చేసింది.