Let's talk: editor@tmv.in
చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాల భారీ విన్యాసాలు

చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాల భారీ విన్యాసాలు

Shaik Mohammad Shaffee
30 డిసెంబర్, 2025

తైవాన్ అంశంపై అమెరికా, జపాన్ దేశాలతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన తరుణంలో.. చైనా మరోసారి తన సైనిక బలప్రదర్శనకు దిగింది. తైవాన్ జలసంధిలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో సోమవారం 'జస్టిస్ మిషన్ 2025' పేరిట భారీ ఉమ్మడి సైనిక విన్యాసాలను ప్రారంభించింది. చైనా అధికారిక వార్తా సంస్థ 'షిన్‌హువా' కథనం ప్రకారం.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు థియేటర్ కమాండ్ పర్యవేక్షణలో ఈ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఈ విన్యాసాల్లో అత్యాధునిక యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లతో పాటు దీర్ఘశ్రేణి రాకెట్ దళాలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయి.

తైవాన్‌ను ముట్టడించే వ్యూహంలో భాగంగా చైనా నిర్వహిస్తున్న ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం.. శత్రువుల కదిలే భూతల లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యాన్ని పరీక్షించడమే. తైవాన్ స్వయంపాలనతో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నప్పటికీ, అది తమ భూభాగంలో భాగమని వాదిస్తున్న బీజింగ్.. అవసరమైతే బలవంతంగా అయినా తైవాన్‌ను తమలో కలుపుకుంటామని బీజింగ్ హెచ్చరిస్తోంది.

ఈ నేపథ్యంలోనే తైవాన్ చుట్టూ ఉన్న కీలక ఓడరేవులను దిగ్బంధించడం, శత్రు లక్ష్యాలపై దాడులు చేయడం, గగనతలంలో నిరంతర నిఘా వంటి పనులపై చైనా సైన్యం దృష్టి సారించింది. యుద్ధ విమానాలు, బాంబర్లు, డ్రోన్లు, రాకెట్ దళాల సమన్వయంతో తైవాన్‌ను అన్ని వైపుల నుండి ఎలా నిర్బంధించాలో పరీక్షించుకోవడమే ఈ 'జస్టిస్ మిషన్ 2025' ముఖ్య ఉద్దేశమని చైనా సైనిక ప్రతినిధి స్పష్టం చేశారు.

అమెరికా ఆయుధ విక్రయాలే కారణమా?

తైవాన్‌కు రికార్డు స్థాయిలో ఆయుధాలను విక్రయించాలని అమెరికా తీసుకున్న నిర్ణయం చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుమారు 11.1 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల ప్యాకేజీకి ఆమోదం తెలిపారు. ఇందులో శక్తివంతమైన క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ వ్యవస్థలు ఉన్నాయి. అమెరికా చరిత్రలోనే తైవాన్‌కు జరుగుతున్న అతిపెద్ద ఆయుధ విక్రయం ఇదే కానుంది. అయితే, అమెరికా చర్యలు తైవాన్‌ను ఒక 'పేలుడు బాంబు'లా మారుస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ మండిపడింది. తమ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ, చైనా ప్రతిగా 20 అమెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలు విధించింది. అంతేకాకుండా, తమ దేశ భద్రతను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన చర్యలకైనా సిద్ధమని హెచ్చరిస్తూ తైవాన్ సరిహద్దుల్లో భారీ యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది.

జపాన్ ప్రధాని వ్యాఖ్యలపైనా గరం

తైవాన్ విషయంలో జపాన్ చేసిన వ్యాఖ్యలు కూడా చైనా ఆగ్రహానికి కారణమయ్యాయి. జపాన్ ప్రధాని సనాయే టాకైచి నవంబర్ 7న పార్లమెంటులో మాట్లాడుతూ, తైవాన్‌పై దాడి జరిగితే అది జపాన్ భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారుతుందని, అవసరమైతే అమెరికాకు మద్దతుగా జపాన్ రక్షణ దళాలు స్పందించవచ్చని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. జపాన్ తన సైనిక స్థావరాలను తైవాన్‌కు సమీపంలోని ఒకినావా దీవుల్లో బలోపేతం చేస్తోందని, చైనా నౌకలు, విమానాలపై నిఘా కోసం రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోందని ఆరోపించింది. జపాన్ తీరప్రాంతాల్లో క్షిపణులు మోహరించే యోచన కూడా ఉందని చైనా పేర్కొంది.

తైవాన్ స్పందన

మరోవైపు చైనా చేస్తున్న ఈ సైనిక విన్యాసాలను తైవాన్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ఏమాత్రం కారణం లేకుండా తమను భయపెట్టడానికి చేస్తున్న 'రెచ్చగొట్టే చర్య' అని తైవాన్ రక్షణ శాఖ మండిపడింది. చైనా ఇలాంటి పనులు చేయడం వల్ల ఈ ప్రాంతంలో ప్రశాంతత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే చైనా బెదిరింపులకు తాము భయపడబోమని తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకోవడానికి తైవాన్ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని స్పష్టం చేసింది.

గత కొన్ని ఏళ్లుగా తైవాన్ చుట్టూ చైనా తన సైనిక కార్యకలాపాలను విపరీతంగా పెంచేసింది. ముఖ్యంగా 2022లో అప్పటి అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించినప్పటి నుండి చైనా ఆగ్రహం మరింత ఎక్కువైంది. అప్పటి నుంచి చైనా తరచుగా యుద్ధ విమానాలు, నౌకలతో తైవాన్‌ను భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. తైవాన్ విషయంలో చైనా-అమెరికా మధ్య పెరుగుతున్న ఈ గొడవలు ఆసియా ఖండంలో పెద్ద యుద్ధానికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చైనా-తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. డ్రాగన్ దళాల భారీ విన్యాసాలు - Tholi Paluku