Let's talk: editor@tmv.in
చైనాకు చుక్కలే

చైనాకు చుక్కలే

FL - TRND
28 సెప్టెంబర్, 2025

సముద్ర గాలి ఊదుతుంది, అలలు రాగం పడతాయి.. కనిపించని దూరంలో ఒక కొత్త నగరం ఆకారం దాల్చుతోంది. ఇది సాధారణ కథ కాదు, ఇది భారత సముద్ర స్వప్నం. గ్రేట్ నికోబార్ దీవిలో భారత ప్రభుత్వం మొదలుపెట్టిన ఈ అతిపెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు దేశంలోనే కాదు ప్రపంచ నౌకాయాన పటంలో కూడా చర్చగా నిలిచింది. ఈ కథ కూడా చైనా చుట్టూనే తిరుగుతోంది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ రూపం దాల్చడం అనేది చైనాకు నిజమైన షాక్.

గ్రేట్ నికోబార్ దీవుల్లో భారత్ ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్ట్‌లో ఒక పెద్ద ఓడరేవు, కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యుత్ తయారు చేసే కేంద్రాలు, ఇళ్లు, పట్టణాలు, పర్యాటకానికి కావాల్సిన ప్రదేశాలు ఉంటాయి. ఓడరేవు అంటే కేవలం ఓడలు ఆగి సరుకులు దిగే స్థలం మాత్రమే కాదు. ఇది భారత వాణిజ్యానికి ఒక కొత్త మార్గం అవుతుంది. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి నౌకలు వస్తాయి. విమానాశ్రయం వలన నికోబార్ దీవులు నేరుగా ప్రపంచంతో కలుస్తాయి. అంటే ఎవరైనా ఇక్కడికి విమానం ఎక్కి రావచ్చు, ఇక్కడి ప్రజలు బయటకు వెళ్లవచ్చు. ఇంకా విద్యుత్, నీరు, రహదారులు, ఇంటర్నెట్ లాంటివి కలిసినప్పుడు ఆ దీవుల్లో పనులు పెరుగుతాయి. వ్యాపారం పెరుగుతుంది. పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఇక్కడ ఉద్యోగాలు కూడా పెరుగుతాయి.

ఇక గ్రేట్ నికోబార్ దగ్గరే మలక్కా జలసంధి ఉంది. ఇది ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్యకు వెళ్లే నౌకల రద్దీ దారి. చమురు నుంచి ఎలక్ట్రానిక్స్ వరకూ లక్షల టన్నుల సరుకు ఇక్కడ నుంచే ప్రయాణిస్తుంది. చైనాకి ఈ మార్గం ప్రాణవాయువు లాంటిది. ఇక్కడే భారత్ తన ముద్ర బలంగా వేయబోతుంది. నిజానికి చైనా అనేక దేశాల్లో పోర్టులు నిర్మించేందుకు సహకరించింది. ఇండియన్ ఓషన్‌లో తనకు బలం రావాలని చైనా చాలా సంవత్సరాలుగా ప్రయత్నిస్తోంది. దానికి పాకిస్తాన్‌లో ఒక పోర్ట్, శ్రీలంకలో ఒక పోర్ట్, మయన్మార్‌లో ఒక పోర్ట్.. ఇలా వివిధ దేశాల్లో నిలయాలు కట్టుకుంది. ఇవన్నీ కలిపి ఒక గొలుసు మాదిరిగా ఉంటాయి. దాన్నే స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ అంటారు. అంటే, చైనా ఇండియన్ ఓషన్‌లో చుట్టూ తన పట్టు పెంచుకుంటుంది. కానీ ఇప్పుడు భారత్ గ్రేట్ నికోబార్ దీవిలో ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టింది. అక్కడ ఒక బలమైన పోర్ట్, ఎయిర్‌పోర్ట్, సైనికంగా కూడా ఉపయోగపడే సదుపాయాలు వస్తున్నాయి. అంటే చైనా వేసిన ఆ గొలుసు మధ్యలో భారత్ ఒక గట్టి ముద్ర వేసినట్టే. ఇలా జరిగితే, సముద్రంలో ఏ నౌక వెళ్తోందో, ఎవరు ఏం చేస్తున్నారు అన్నది భారత్ సులభంగా గమనించగలదు. అవసరం అయితే త్వరగా స్పందించగలదు. ఇదే చైనాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే, తన మార్గాలు ఇప్పుడు భారత్ కంట్లో పడుతున్నాయి.

పోర్ట్ పెద్దదిగా తయారైతే, విలువైన సరుకులు నేరుగా ఇక్కడ దిగుతాయి. ఇంతవరకు సింగపూర్, కొలంబోకి వెళ్ళే నౌకలు ఇప్పుడు ఇక్కడికి వస్తాయి. దీంతో భారత తీరానికి దగ్గరగా సరుకు నిల్వ అవుతుంది. చైనాకు చెందిన నౌకలు కూడా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలి. లేదంటే భారత్ స్థానం పెరుగుతుంది, చైనా బలం తగ్గుతుంది. ఇదే మొదటి షాక్. మరోవైపు కొత్త ఎయిర్‌పోర్ట్ కారణంగా సరుకులు త్వరగా వస్తాయి. సముద్ర మార్గం, గగన మార్గం కలిస్తే సమయం కూడా తగ్గుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. లాజిస్టిక్స్ కంపెనీలు, మరమ్మత్తు కేంద్రాలు ఏర్పడతాయి. ఈ సదుపాయాలు ఐలాండ్‌ను ఒక కొత్త సముద్ర నగరంగా మార్చేస్తాయి. ఈ శబ్దాన్ని చైనా కూడా తప్పక వినాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ 72వేల కోట్ల ప్రాజెక్ట్ ఇండో-పసిఫిక్ వ్యూహంలో భారత్ స్థానాన్ని పెంచుతుంది. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కలిసి పని చేసేలా చేస్తోంది. ఈ బలం ఓవరాల్‌గా కనిపించినప్పుడు చైనాకు భారీ షాక్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా..!

చైనాకు చుక్కలే - Tholi Paluku