
చైతన్యానందకు పటియాలా హౌస్ కోర్టులో ఎదురుదెబ్బ
మహిళా వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న చైతన్యానంద సరస్వతికి ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కోరిన సీజ్ మెమోలు (సీజ్ చేసిన వస్తువుల జాబితా) ప్రతులు ఇవ్వాలన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. చార్జ్‌షీట్ దాఖలు కాకముందు సీజ్ మెమోలు ఇవ్వకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. అయితే, సరస్వతికి మందులు, కళ్లజోడు, పుస్తకాలు, ఆహారం వంటి అవసరాలను అందించేందుకు కోర్టు అనుమతించింది.
కేసు నేపథ్యం
చైతన్యానంద సరస్వతి ప్రస్తుతం వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన వేధింపుల కేసులో న్యాయ నిర్బంధంలో ఉన్నారు. విచారణ సందర్భంగా ఆయన తరపున న్యాయవాది సీజ్ మెమోలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. న్యాయ మేజిస్ట్రేట్ అనిమేష్ కుమార్ ఈ అభ్యర్థనను తిరస్కరిస్తూ చట్ట ప్రకారం, చార్జ్‌షీట్ దాఖలు అయ్యే ముందు సీజ్ పత్రాలు ఇవ్వడం కోర్ట్ నిబంధలు ప్రకారం అనుమతించబోమని స్పష్టం చేసారు.
జైలులో సన్యాసి దుస్తులపై వివాదం
ఇక మరోవైపు, చైతన్యానంద సరస్వతి జైలులో ఉన్నప్పుడు సన్యాసి దుస్తులు ధరించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై కోర్టు జైలు మాన్యువల్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని జైలు అధికారులకు ఆదేశించింది. అయితే ఢిల్లీ పోలీసులు ఆయన అభ్యర్థనకు వ్యతిరేకంగా వాదిస్తూ, చైతన్యానంద సరస్వతి “నిజమైన సన్యాసి కాదని”, ఆయనకు ఆ దుస్తులు ధరించేందుకు అనుమతిస్తే జైలులో శాంతి భద్రత సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు.
సరస్వతి తరపున న్యాయవాది మనీష్ గాంధీ పోలీసుల వ్యాఖ్యలను ప్రతిఘటిస్తూ తన క్లయింట్ అసలు పేరు పార్థసారథి అని, ఆయన సన్యాస దీక్ష పూర్తిచేసిన అనంతరం ఆయన పేరు చైతన్యానంద సరస్వతిగా మారిందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆయనకు సంబంధించిన మఠం లేదా పీఠం ఎవరూ ఆయన ఆధ్యాత్మిక హోదాను తిరస్కరించలేదని పేర్కొన్నారు. అంతేకాక, జైలు మాన్యువల్‌లో అండర్‌ట్రయల్ ఖైదీల దుస్తులపై ఎటువంటి నిషేధం లేదని వాదించారు.
మరోవైపు పోలీసుల సమాధాన పత్రంలో నిందితుడు ధార్మిక దుస్తులు ధరించడానికి అర్హుడు కాదని చేసిన వ్యాఖ్యపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ న్యాయ వ్యవస్థ గానీ, పోలీసులు గానీ ఎవరూ వ్యక్తుల ధార్మిక అర్హతలపై వ్యాఖ్యానించే హక్కు లేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే సమాధానాలు పూర్తిగా జైలు మాన్యువల్ నిబంధనల ప్రకారం మాత్రమే ఉండాలని ఆదేశించింది.
సీజ్ మెమోలు అంశంపై చర్చ
సీజ్ మెమోలు అంశంపై రక్షణ తరఫు న్యాయవాది వాదిస్తూ, భారతీయ నాగరిక సురక్షా సంహితప్రకారం సీజ్ మెమోలు ఇవ్వడంపై ఎటువంటి నిషేధం లేదని అయితే , సీజ్ చేసిన పత్రాలు ఇవ్వడానికి అనుమతిస్తే వాటిని ఇతర కేసుల్లో తప్పుగా వినియోగించే అవకాశం ఉండవచ్చు, తద్ద్వారా ప్రధాన కేసుకు సంబంధించి కొత్త సమస్యలు తలెత్తవచ్చు అని ఆయన తెలిపారు. కానీ ప్రభుత్వ అభియోజకుడు మాత్రం చార్జ్‌షీట్ దాఖలు కాకముందు సీజ్ మెమోలు ఇవ్వరాదనే మార్గదర్శకాలు ఉన్నాయని వాదించారు.
ఇదిలాఉండగా ఇంతకుముందు అక్టోబర్ 3న పటియాలా హౌస్ కోర్టు చైతన్యానంద సరస్వతిని అక్టోబర్ 17 వరకు న్యాయ నిర్బంధంలో కొనసాగించాలని ఆదేశించింది. ఈ కేసులో కోర్టు తీర్పులు వరుసగా వెలువడుతుండటంతో చైతన్యానంద సరస్వతి కేసు కొత్త మలుపులు తిరుగుతోంది.
కాగా గతంలో ఆసారాం బాపూ, రాంరహీమ్ సింగ్ వంటి ఆధ్యాత్మిక హోదా కలిగిన వ్యక్తులపై కేసులు నమోదైనప్పుడు కూడా ఇలాంటి మతపరమైన దుస్తులు, ఆచారాలపై వివాదాలు తలెత్తాయి.అయితే న్యాయ నిపుణులు చెబుతున్నట్లు కోర్టు ధార్మిక హోదాను కాకుండా చట్టపరమైన ప్రమాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
