Let's talk: editor@tmv.in
చేవెళ్ల రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం

చేవెళ్ల రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం

Gaddamidi Naveen
20 నవంబర్, 2025

రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మిర్జగూడ గ్రామం సమీపంలో ఈ నెల 3 సోమవారం ఉదయం సుమారుగా 6:30 నుంచి 7:30 మధ్య సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాండూర్ నియోజకవర్గానికి చెందిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది.ఈ ప్రమాదంలో గాయపడిన 10 మంది క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

ఈ మేరకు,ఆర్థిక సాయాన్ని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూర్ ఎమ్మార్వో కార్యాలయంలో బాధితులకు వ్యక్తిగతంగా చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన విధానాన్ని వివరించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని, వైద్య చికిత్స ఖర్చుల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ప్రమాదం మళ్లీ జరగకుండా ఉండేందుకు రవాణా శాఖతో కలిసి సమగ్ర సమీక్ష చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఆయ‌న‌ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు,బాధితుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.