
చేపల ఉత్పత్తిపై మోడీ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధం: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లో చేపల ఉత్పత్తి తక్కువగా ఉందన్న ప్రధాని వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించడమేనని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని అగర్‌పారాలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్‌లో చేపల ఉత్పత్తి లేదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం సరైంది కాదన్నారు. గతంలో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలు దిగుమతి చేసుకునేదని, అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని తెలిపారు. బీహార్‌లో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉందని ప్రధాని చెప్పారని, కానీ అక్కడ ప్రజలకు చేపలు తినేందుకు అనుమతి లేదని మమతా ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేపలు, గుడ్లు, మాంసం విక్రయాలపై ఆంక్షలు ఉంటున్నాయని కూడా ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు ఓటర్ల జాబితా సవరణ (సర్) పేరుతో 90 లక్షలకుపైగా పేర్లను తొలగించారని మమతా ఆరోపించారు. ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకే ఇలా చేస్తున్నారని అన్నారు. ఈ పేర్లను మళ్లీ జాబితాలో చేర్చేందుకు కోర్టును ఆశ్రయిస్తామని ఆమె తెలిపారు.
బెంగాల్ ప్రజల హక్కులు, గుర్తింపును కాపాడుకోవడానికే ఈ ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ సభలకు ప్రజలను తీసుకునిరావడానికి ఒక్కొక్కరికి రూ.500 చెల్లిస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. అలాగే రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించేలా డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తున్నారని అన్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఆమె పరోక్షంగా విమర్శలు చేస్తూ, విచారణ సంస్థలను ఉపయోగించి ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల హక్కులను రక్షించేందుకు రాజకీయంగానే కాక చట్టపరంగానూ పోరాటం కొనసాగిస్తామని మమతా స్పష్టం చేశారు.
మోడీ ప్రసంగానికి టీఎంసీ ‘7 అంశాల వాస్తవ పరిశీలన’
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వం ‘ఏడు అంశాల వాస్తవ పరిశీలన’ను విడుదల చేసింది. రాజ్యసభలో టీఎంసీ నాయకుడు డెరెక్ ఓబ్రియాన్ గురువారం సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ప్రధాని ప్రసంగంలోని ఏడు ముఖ్యమైన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వాటిపై వివరణ ఇచ్చారు. హాల్దియాలో జరిగిన సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ, ప్రతి ప్రసంగం తర్వాత ఆయన చేసిన వాదనలకు సమాధానం ఇవ్వడం చాలా సులభమైపోయిందని ఒబ్రియన్ వ్యాఖ్యానించారు.
• భారతదేశంలో ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక పేదలు ఉన్నారని, ప్రతి ఐదుగురిలో నలుగురు రోజుకు రూ.171 కన్నా తక్కువ ఆదాయం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.
• రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని చేసిన విమర్శలకు ప్రతిగా, గత 15 సంవత్సరాల్లో పశ్చిమ బెంగాల్ ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగిందని ఒబ్రియన్ తెలిపారు. రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) ఐదింతలు పెరిగిందని, ఎగుమతులు కూడా పెరిగాయని చెప్పారు.
• రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని ప్రధాని చేసిన ఆరోపణను ఖండిస్తూ, 2011లో 1.37 లక్షలుగా ఉన్న నమోదు చేసిన కంపెనీల సంఖ్య 2025 నాటికి 2.50 లక్షలకు పెరిగిందని వివరించారు. ఇది 83 శాతం వృద్ధి అని పేర్కొన్నారు.
• దేశంలో అభివృద్ధి జరుగుతోందన్న వాదనపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం ఇప్పటికీ 21 కోట్ల మంది పేదరికంలో జీవిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌కు ఇవ్వాల్సిన సుమారు రూ.2 లక్షల కోట్ల నిధులను నిలిపివేసిందని ఆరోపించారు.
• యువతకు అవకాశాలు కల్పించలేదన్న ఆరోపణలపై స్పందిస్తూ, రాష్ట్రంలో నిరుద్యోగం 40 శాతం తగ్గిందని, రెండు కోట్లకు పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయని ఒబ్రియన్ చెప్పారు.
• మహిళల భద్రతపై విమర్శలకు ప్రతిగా, కోల్‌కత్తా వరుసగా నాలుగేళ్లు అత్యంత భద్రమైన నగరంగా గుర్తింపు పొందిందని కేంద్ర హోంశాఖ గణాంకాలను ఉదహరించారు.
ఇక హాల్దియాలో జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, బీజేపీ అధికారంలోకి వస్తే పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని భయానక వాతావరణం నుంచి బయటకు తీసుకువస్తామని కూడా ఆయన పేర్కొన్నారు.
