Let's talk: editor@tmv.in
చేనేత కళాకారులకు ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

చేనేత కళాకారులకు ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర స్థాయి అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Gaddamidi Naveen
21 ఫిబ్రవరి, 2026

తెలంగాణ ప్రభుత్వం చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో 2026 జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఆగస్టు 7) పురస్కరించుకుని, రాష్ట్రంలోని ప్రతిభావంతులైన చేనేత కళాకారులకు, డిజైనర్లకు ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర స్థాయి అవార్డులు - 2026’ అందజేయనుంది. ఈ మేరకు చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజ రామయ్యర్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ పురస్కారాలకు అర్హత ప్రమాణాల ప్రకారం, చేనేత వృత్తిలో కనీసం 10 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. చేనేత రంగంలో నూతన డిజైన్ల రూపకల్పనలో కనీసం 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు దరఖాస్తు చేసుకోవచ్చు.డిజైనింగ్ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయబడతాయి.

ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను సంబంధిత జిల్లా కేంద్రంలోని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులకు సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 31, 2026 ఆఖరు గడువు. పూర్తి వివరాల కోసం, ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ handtex.telangana.gov.in ను సందర్శించవచ్చు. తెలంగాణ చేనేత రంగానికి గుర్తింపు తెచ్చిన అద్భుతమైన నైపుణ్యం కలిగిన కళాకారులను గౌరవించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఈ అవార్డులు చేనేత కార్మికుల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని అధికారులు భావిస్తున్నారు.