Let's talk: editor@tmv.in
చేనేత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:మంత్రి కొలుసు పార్థసారథి

చేనేత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:మంత్రి కొలుసు పార్థసారథి

Panthagani Anusha
27 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలో చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు నేతన్నల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. కేవలం పథకాల అమలుకే పరిమితం కాకుండా చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంచి ఆ రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శన విక్రయ శాలలను గురువారం ఆయన సందర్శించారు

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నేతన్నల చిరకాల కోరికైన ఉచిత విద్యుత్ సరఫరాపై కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న చేనేత సహకార సంఘాల బకాయిలను ఇప్పటికే విడతల వారీగా విడుదల చేశామని తద్వారా సంఘాలను ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఆధునిక డిజైన్లతో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా శిక్షణ ఇవ్వడమే కాకుండా నేతన్నలకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన చేశారు.

శాసనసభ్యులు ప్రజాప్రతినిధులతో కలిసి స్టాళ్లను కలియతిరిగిన మంత్రి ఉత్పత్తుల నాణ్యతను తనిఖీ చేయడమే కాకుండా విక్రయాల తీరుపై ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఎగ్జిబిషన్లు, స్టాళ్లు ఏర్పాటు చేయడం ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.