
చేనేతకు గౌరవం, నేతన్నలకు ఉపాధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సీతక్క
చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించడం, నేతన్నలకు నిరంతర ఉపాధి అవకాశాలు కల్పించడం, చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అందుబాటులోకి తీసుకురావడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. వ్యవసాయం, చేనేత రంగాలు తమ ప్రభుత్వానికి రెండు కళ్ల వంటివని ఆమె పేర్కొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన చేనేత వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. వివిధ జిల్లాలకు చెందిన నేతన్నలు రూపొందించిన చీరలు, వస్త్రాలను పరిశీలించిన మంత్రి.. వారి కళానైపుణ్యాన్ని అభినందించారు. స్వయంగా మగ్గం నేసి చేనేత కార్మికుల పనితీరును తెలుసుకున్నారు.
కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులకు, ముఖ్యంగా తెలంగాణ నేతన్నలు, నేతమ్మలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయం తర్వాత అత్యంత కష్టపడే వర్గాల్లో నేతన్నలు ముందుంటారని అన్నారు. ఒక చేనేత చీర వెనుక కేవలం నూలుపోగులు మాత్రమే ఉండవని, ఓ కుటుంబం ఆశలు, నేతన్నల శ్రమ, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం దాగి ఉంటుందని పేర్కొన్నారు.
మనిషి వస్త్రాన్ని తయారు చేయడం, ధరించడం ప్రారంభించినప్పుడే నాగరిక సమాజానికి పునాది పడిందని సీతక్క అన్నారు. నేతన్నల చేతుల్లో రూపుదిద్దుకునే ప్రతి నూలుపోగు మన సంస్కృతి, నాగరికతకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. చేనేత అనేది కేవలం వృత్తి మాత్రమే కాదని, అది భారతీయ సంప్రదాయాలకు చిరునామా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దూడెం వెంకటరమణ, మాజీ ఎంపీ గుండు సుధారాణి, ప్రజాప్రతినిధులు, అధికారులు, చేనేత కళాకారులు పాల్గొన్నారు.
