Let's talk: editor@tmv.in
చెస్ ఆట మాత్రమే కాదు.. మెదడుకు వ్యాయామశాల: జయంత్‌ చౌదరి

చెస్ ఆట మాత్రమే కాదు.. మెదడుకు వ్యాయామశాల: జయంత్‌ చౌదరి

Pinjari Chand
21 నవంబర్, 2025

చెస్‌ కేవలం ఆట కాదు… మెదడుకు వ్యాయామశాల అని కేంద్ర యువత, నైపుణ్యాభివృద్ధి,విద్యా శాఖ సహాయ మంత్రి మంత్రి జయంత్‌ చౌదరి అభివర్ణించారు. స్ట్రాటజీ, లాజిక్‌, క్రిటికల్‌ థింకింగ్‌ పెంచే అద్భుత టూల్‌ అయిన చెస్‌ను ఎన్ఈపీ–2020లో భాగంగా పాఠ్యాంశాల్లోకి తీసుకురావడంపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. ఫిడే వరల్డ్‌కప్‌–2025లో క్వార్టర్‌ఫైనల్ టై బ్రేక్‌లో తొలి మూవ్‌ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

“ఏఐసీఎఫ్–ఫిడేలు పాఠశాలల్లో చెస్‌ను తప్పనిసరి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వస్తుండటం సంతోషకరం. ఎన్సీఈఆర్టీ అకాడమిక్‌ రివిజన్‌లోని బోధనలో చెస్‌ అంశాలు, మాడ్యూల్‌లు చేరుస్తాం. ఇది పాలసీ ఇంపెరేటివ్‌ అని మంత్రి స్పష్టం చేశారు. ఫిడే ఇప్పటికే 2026ను ‘ఇయర్‌ ఆఫ్‌ చెస్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌’గా ప్రకటించగా, భారత ప్రభుత్వం తమ వంతుగా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. వచ్చే జనవరిలో కేఐఐటీ యూనివర్సిటీ–ఫిడే–ఏఐసీఎఫ్ మధ్య కుదిరిన ఎంవోయూ ప్రకారం భువనేశ్వర్‌లో సోషియల్‌, ఎడ్యుకేషనల్‌ చెస్‌ కాన్ఫరెన్స్ జరుగనుంది. ఆ వర్క్‌షాప్‌ సమావేశాల్లో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మంత్రిత్వశాఖగా పూర్తి మద్దతు ఇస్తాం అని జయంత్‌ చౌదరి అన్నారు.

ఆనంద్‌ నుంచి గుకేశ్‌ వరకు

చెస్‌ భారతదేశంలో పుట్టిన ఆటేనని, విశ్వనాథన్‌ ఆనంద్‌ వంటి లెజెండ్‌లు, గుకేశ్‌, ఇరిగైసి వంటి కొత్త తరం ఆటగాళ్లు యువతకు ఆదర్శమని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. దేశంలో 33 లక్షల మంది ఇప్పటికే స్పోర్ట్స్‌, ఫిజికల్‌ వెల్‌నెస్‌ రంగాల్లో పనిచేస్తున్నారని, ఇది జీడీపీలో 0.1శాతం కవర్‌ చేస్తుందన్నారు. 2047 నాటికి ఇది ఇరవై రెట్లు పెరిగి 2 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్పోర్ట్స్‌ ఫెడరేషన్లు, సంఘాలు, క్రీడాకారులు అందరికీ బలమైన సహకారం అవసరం. క్రీడలను మన జీవనశైలిలో భాగం చేయాలని చెప్పారు.

ఫిడే వరల్డ్‌కప్‌ వివరాలు

చెస్‌ వరల్డ్‌కప్‌ సెమీ ఫైనల్స్‌ శుక్రవారం తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉజ్బెకిస్తాన్‌ గ్రాండ్ మాస్టర్లు యక్కుబోయేవ్‌, సిండరోవ్‌ తొలి సెమీఫైనల్లో తలపడుతున్నారు. రెండో సెమీలో చైనా గ్రాండ్ మాస్టర్ వె యీ, ఆండ్రే ఎసిపెన్‌కో మధ్య పోరు ఉండనుంది. సెమీ విజేతలకు వెంటనే క్యాండిడేట్స్‌ టోర్నమెంట్‌ టికెట్ ఇస్తారు. ఓడిన ఇద్దరి మధ్య తృతీయ స్థానం ప్లే ఆఫ్‌— చివరి క్యాండిడేట్స్‌ సీట్‌ కోసం పోటీ జరుగుతుంది.

చెస్ ఆట మాత్రమే కాదు.. మెదడుకు వ్యాయామశాల: జయంత్‌ చౌదరి - Tholi Paluku