
చెరువుల్లోకి నేరుగా వరద నీరు: హైడ్రా, సీఎంసీ కమిషనర్ల సంయుక్త క్షేత్రస్థాయి పరిశీలన
హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ, వరద నీటి నిర్వహణపై హైడ్రా, సీఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాకాలంలో నగరం జలమయం కాకుండా ఉండాలంటే వరద నీరు నేరుగా చెరువుల్లోకి చేరడమే ఏకైక మార్గమని భావిస్తున్న హైడ్రా, ఆ దిశగా కాలువల అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, సీఎంసీ కమిషనర్ సృజన సోమవారం మాధాపూర్ పరిసరాల్లోని సున్నం చెరువు, తమ్మిడికుంట ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు.
వరద నీరు చెరువుల్లోకి నేరుగా చేరేలా ఇన్‌లెట్లు, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా బోరబండ బస్తీ, ఎన్ ఆర్ ఆర్ పురం ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటిని సున్నం చెరువులోకి మళ్లించే విధానంపై అధికారులు చర్చించారు. మురుగు నీటిని ప్రత్యేక పైపుల ద్వారా దారి మళ్లించి, వర్షపు నీరు మాత్రమే చెరువులోకి చేరేలా సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే చెరువులు నిండినప్పుడు అదనపు నీరు సురక్షితంగా వెళ్లేందుకు ఔట్‌లెట్ల ద్వారా కాలువలను విస్తరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. మాధాపూర్-బోరబండ మార్గంలో హైటెన్షన్ వైర్ల కింద ఉన్న రహదారి విస్తరణ అంశాన్ని కూడా అధికారులు పరిశీలించారు.
ఇక తమ్మిడికుంట ప్రాంతంలో భారీ వర్షాల సమయంలో కొండాపూర్, ఐటీ హబ్ నుంచి వచ్చే వరదతో శిల్పారామం, మెటల్ చార్మినార్ పరిసరాలు తరచూ జలమయం అవుతున్న నేపథ్యంలో, ఆ నీటిని నేరుగా తమ్మిడికుంటకు మళ్లించేలా ఇన్‌లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఇన్‌లెట్లను సమర్థంగా వినియోగించడంతో పాటు, అవసరమైతే ఎస్ ఎన్ డీపీ ప్రాజెక్టు ద్వారా కాలువల అభివృద్ధి చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
గత వర్షాకాలంలో చేపట్టిన చెరువు పునరుద్ధరణ పనుల వల్ల కొంతమేర సమస్య తగ్గిందని, ఇప్పుడు కాలువల అనుసంధానం పూర్తయితే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా తమ్మిడికుంట, సున్నం చెరువుల ఆక్రమణల తొలగింపు, విస్తరణ పనులపై కూడా సమగ్రంగా చర్చించారు.
