

చెపాక్‌లో పంజాబ్ పంజా.. చెన్నైకి వరుసగా రెండో ఓటమి
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగిస్తోంది. చెపాక్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించింది. చెన్నై నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి, వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50; 29 బంతుల్లో) సమయోచిత ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించాడు.
లక్ష్య ఛేదనలో పంజాబ్ జోరు
210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఓపెనర్ ప్రియన్ష్ ఆర్య (39; 11 బంతుల్లో) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ కేవలం 4.2 ఓవర్లలోనే స్కోరును 61 పరుగులకు చేర్చాడు. హెన్రీ వేసిన ఓవర్లో 4, 6, 4తో విరుచుకుపడి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. మరో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (43) కూడా ధాటిగా ఆడటంతో పంజాబ్ ఇన్నింగ్స్ పట్టాలెక్కింది.
మురిపించిన కెప్టెన్ ఇన్నింగ్స్
మధ్య ఓవర్లలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లాస్, మాస్ షాట్లతో అలరించాడు. తొలుత నెమ్మదిగా ఆడినా, కుదురుకున్నాక చెన్నై బౌలర్లపై ప్రతాపం చూపాడు. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ బౌలింగ్‌లో కొట్టిన ‘ఇన్‌సైడ్ అవుట్’ సిక్సర్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. కూపర్ కానెల్లీ (36) సహకారంతో స్కోరు బోర్డును పరిగెత్తించిన అయ్యర్, 26 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. చివరిలో నెహాల్ వధేరాతో కలిసి 59 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు.
మాత్రే మెరుపులు.. చెన్నై భారీ స్కోరు
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. యువ సంచలనం ఆయుష్ మాత్రే (73; 43 బంతుల్లో, 29 బంతుల్లో హాఫ్ సెంచరీ) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ శాంసన్ త్వరగానే అవుటైనా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (28)తో కలిసి మాత్రే రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. స్టోయినిస్ వేసిన ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన మాత్రే, జాన్సెన్ బౌలింగ్‌లోనూ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
చాహల్ మాయాజాలం
వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన గూగ్లీలతో చెన్నై బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మాత్రే ఇచ్చిన రెండు క్యాచ్‌లను ఫీల్డర్లు జారవిడిచినా, చివరికి వైశాఖ్ బౌలింగ్‌లో చాహల్‌కే క్యాచ్ ఇచ్చి మాత్రే వెనుదిరిగాడు. మధ్య ఓవర్లలో గైక్వాడ్‌ను చాహల్ అవుట్ చేయడంతో చెన్నై స్కోరు వేగం తగ్గింది. అయితే ఆఖర్లో శివమ్ దూబే (45; 27 బంతుల్లో), సర్ఫరాజ్ ఖాన్ (32; 12 బంతుల్లో) మెరుపులు మెరిపించడంతో చెన్నై 200 మార్కును దాటగలిగింది. కానీ, పంజాబ్ బ్యాటర్ల ధాటికి ఈ స్కోరు సరిపోలేదు.
