Let's talk: editor@tmv.in
చెన్నై ఓపెన్: సుమిత్ నగల్ పోరాటం ముగిసె

చెన్నై ఓపెన్: సుమిత్ నగల్ పోరాటం ముగిసె

Shaik Mohammad Shaffee
13 ఫిబ్రవరి, 2026

స్థానిక ఎస్‌డీఏటీ స్టేడియంలో జరుగుతున్న చెన్నై ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు, మాజీ ఛాంపియన్ సుమిత్ నగల్ పోరాటం ముగిసింది. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో నగల్ 6-4, 6-7, 3-6తో రష్యాకు చెందిన పీటర్ బార్ బిర్యుకోవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. సుమారు రెండు గంటల ఆరు నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో ఆరంభంలో ఆధిపత్యం కనబరిచిన నగల్, కీలక సమయంలో పట్టు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.

ఆరంభంలో జోరు.. ఆపై తడబాటు

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 305వ స్థానంలో ఉన్న లెఫ్ట్ హ్యాండర్ బిర్యుకోవ్‌పై నగల్ మొదటి సెట్‌ను 6-4తో గెలుచుకుని శుభారంభం చేశాడు. రెండో సెట్‌లోనూ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు మూడు అవకాశాలు (బ్రేక్ పాయింట్స్) లభించినప్పటికీ, వాటిని నగల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దీంతో రెండో సెట్ టై బ్రేక్ వరకు వెళ్ళింది. టై బ్రేర్‌లో రష్యా ఆటగాడు పైచేయి సాధించడంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో సెట్‌కు దారితీసింది. మూడో సెట్‌లో ఒక దశలో 0-3తో వెనుకబడిన నగల్, పట్టుదలతో ఆడి స్కోరును 3-3తో సమం చేశాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో బిర్యుకోవ్ మళ్ళీ నగల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.

భారత క్వాలిఫైయర్ సిద్ధార్థ్ రావత్ ఓటమి

మరో సింగిల్స్ మ్యాచ్‌లో భారత క్వాలిఫైయర్ సిద్ధార్థ్ రావత్ పోరాటం కూడా ముగిసింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 715వ స్థానంలో ఉన్న సిద్ధార్థ్‌పై పోలాండ్‌కు చెందిన మక్స్ కాస్నికోవ్‌స్కీ 6-2, 6-3తో నేరుగా సెట్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. మరోవైపు, రోజులో జరిగిన సుదీర్ఘ పోరులో నాలుగో సీడ్ ఇలియా సిమాకిన్ 4-6, 7-5, 7-6 (1)తో ఆస్ట్రేలియాకు చెందిన ఫిలిప్ సెకులిక్‌పై విజయం సాధించాడు. ఈయన తదుపరి రౌండ్‌లో నగల్‌ను ఓడించిన బిర్యుకోవ్‌తో తలపడనున్నాడు.

డబుల్స్‌లో భారత జంటల జోరు

సింగిల్స్‌లో నిరాశ ఎదురైనప్పటికీ, డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. టాప్ సీడ్ నికి కలియండ పూనాచా (భారత్)-ప్రుచ్య ఇసారో (థాయ్‌లాండ్) జోడి 6-4, 6-1తో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వయం లోహితాక్ష బద్రీనాథ్-అభినవ్ సంజీవ్‌లపై విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. వీరు తదుపరి మ్యాచ్‌లో మరో భారత జంట ఎస్.డి. ప్రజ్వల్ దేవ్-నితిన్ సిన్హాతో తలపడనున్నారు. మూడో సీడ్ ప్రజ్వల్ దేవ్ జంట 4-6, 6-2, 10-8తో ఇషాక్ ఇక్బాల్-మనీష్ సురేష్ కుమార్‌లపై విజయం సాధించి సెమీస్ చేరింది. అయితే, రెండో సీడ్ సిద్ధాంత్ బంతియా-సాకేత్ మైనేని జంట 5-7, 4-6తో శశికుమార్ ముకుంద్ - జే క్లార్క్ (బ్రిటన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.