Let's talk: editor@tmv.in
చెన్నై ఓపెన్ విజేత ఫెరీరా సిల్వా

చెన్నై ఓపెన్ విజేత ఫెరీరా సిల్వా

Shaik Mohammad Shaffee
16 ఫిబ్రవరి, 2026

నగరంలోని నుంగంబాక్కం ఎస్‌డీఏటీ టెన్నిస్ స్టేడియం వేదికగా జరిగిన చెన్నై ఓపెన్ ఏటీపీ ఛాలెంజర్ పురుషుల అంతర్జాతీయ టెన్నిస్ ఛాంపియన్‌షిప్-2026లో పోర్చుగల్ ఆటగాడు ఫ్రెడరికో ఫెరీరా సిల్వా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్‌లో ఆరో సీడ్ ఫెరీరా సిల్వా.. రెండో సీడ్, అర్జెంటీనాకు చెందిన ఫెడెరికో అగస్టిన్ గోమెజ్‌పై ఉత్కంఠభరిత విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచాడు. సుమారు రెండు గంటల 58 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరులో సిల్వా 6-4, 6-7(10), 6-4తో విజయం సాధించి, తన కెరీర్‌లోనే మొట్టమొదటి ఏటీపీ ఛాలెంజర్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరు

తొలి సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు ఒకరి సర్వీసును మరొకరు బ్రేక్ చేస్తూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే తొమ్మిదో గేమ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన ఎడమచేతి వాటం ఆటగాడు ఫెరీరా సిల్వా, ప్రత్యర్థి సర్వీసును బ్రేక్ చేసి 6-4తో సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్‌లోనూ అదే జోరు కొనసాగగా, మ్యాచ్ టైబ్రేకర్ వరకు వెళ్లింది. టైబ్రేకర్‌లో ప్రపంచ 196వ ర్యాంకర్ గోమెజ్ అసాధారణ పోరాటాన్ని కనబరిచాడు. సిల్వాకు లభించిన నాలుగు మ్యాచ్ పాయింట్లను అడ్డుకున్న గోమెజ్, చివరకు 12-10తో టైబ్రేకర్ గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు చేర్చాడు.

ఏడో మ్యాచ్ పాయింట్‌తో విజయం ఖరారు

మూడో సెట్‌లో ఫెరీరా సిల్వా ప్రారంభం నుంచే దూకుడు ప్రదర్శించి 5-2తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ సమయంలో అగస్టిన్ గోమెజ్ 13 ఏస్‌లతో విరుచుకుపడుతూ స్కోరును 5-4కు తగ్గించి గట్టి పోటీనిచ్చాడు. అయితే, ఒత్తిడిని అధిగమించిన సిల్వా.. తన ఏడో మ్యాచ్ పాయింట్ వద్ద విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టైటిల్‌తో సిల్వాకు 50 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు, సుమారు రూ. 8,64,500 (9,500 డాలర్లు) నగదు బహుమతి లభించింది. రన్నరప్ గోమెజ్‌కు 25 పాయింట్లు, సుమారు రూ. 5,00,500 (5,500 డాలర్లు) అందాయి.

డబుల్స్‌లో భారత్‌కు దక్కిన గౌరవం

శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్‌లో భారత క్రీడాకారుడు నికి కలియండ పూనాచా తన భాగస్వామి పురుచ్య ఇసారో (థాయ్‌లాండ్)తో కలిసి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. టాప్ సీడ్స్‌గా బరిలోకి దిగిన ఈ జోడి 6-4, 6-4తో బ్రిటన్ ఆటగాడు జే క్లార్క్, భారత ప్లేయర్ ముకుంద్ శశికుమార్‌లపై వరుస సెట్లలో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయంతో చెన్నై ఓపెన్‌లో భారతీయ ఆటగాడికి కూడా టైటిల్ దక్కడం విశేషం.

డబ్ల్యూటీటీ చెన్నై: రన్నరప్ జోడీగా హర్మీత్-యశస్విని

చెన్నై వేదికగా జరిగిన డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత జోడీ హర్మీత్ దేశాయ్, యశస్విని ఘోర్పడే రన్నరప్‌గా నిలిచారు. ఆదివారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఈ జోడీ 0-3 (9-11, 2-11, 8-11) తేడాతో రొమేనియాకు చెందిన ఎడ్వర్డ్ ఇయోనెస్కు, బెర్నాడెట్ సోక్స్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఓడిపోయినప్పటికీ, ఈ టోర్నీ చరిత్రలో భారత జోడీకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. ఇక పురుషుల సింగిల్స్‌లో లూబోమిర్ జంకారిక్ (చెక్ రిపబ్లిక్), థిబాల్ట్ పోరెట్ (ఫ్రాన్స్) ఫైనల్‌కు చేరగా, మహిళల సింగిల్స్ టైటిల్ కోసం జపాన్ క్రీడాకారిణులు సట్సుకి ఓడో, మియు హిరానో తలపడనున్నారు. పరాజయంతోనైనా భారత ద్వయం సరికొత్త చరిత్ర సృష్టించింది.