
చెన్నైలో బీజేపీ కొత్త మీడియా కేంద్రం ప్రారంభించిన పీయూష్ గోయల్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతుండటంతో భారతీయ జనతా పార్టీ తన ప్రచార పర్వాన్ని మరింత వేగవంతం చేసింది. శనివారం చెన్నైలో పార్టీ నూతనంగా ఏర్పాటు చేసిన 'మీడియా సెంటర్'ను కేంద్ర మంత్రి తమిళనాడు ఎన్నికల ఇన్-ఛార్జ్ పీయూష్ గోయల్ ఘనంగా ప్రారంభించారు. ఈ కేంద్రం పార్టీకి మీడియా ప్రతినిధులకు మధ్య ఒక బలమైన వారధిగా పనిచేస్తుందని, డిజిటల్ యుగంలో ప్రజలకు వేగంగా సమాచారాన్ని చేరవేయడానికి ఇది దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, హై-స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీతో రూపొందించిన ఈ కేంద్రం ద్వారా మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించుకోవడానికి కంటెంట్‌ను తక్షణమే అప్‌లోడ్ చేయడానికి సదుపాయాలు కల్పించారు. కేవలం ఎన్నికల సమయానికే పరిమితం కాకుండా భవిష్యత్తులోనూ ఇది ఒక శాశ్వత సమాచార వేదికగా కొనసాగుతుందని గోయల్ స్పష్టం చేశారు. ప్రచార అంశాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందని ఆయన పేర్కొన్నారు.
కాగా ఇటీవల కోయంబత్తూరు నార్త్ నియోజకవర్గంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మళ్లీ దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత తరహా సుపరిపాలన రావాలంటే ఎన్డీయే కూటమి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలోనే కొలువుదీరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో కమల్ హాసన్ వంటి దిగ్గజాలను ఓడించిన వనతి శ్రీనివాసన్‌ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
డీఎంకేపై విమర్శలు
ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కుటుంబ పాలనపై పీయూష్ గోయల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉదయనిధి స్టాలిన్, కనిమొళి వంటి వారు పార్టీని గుప్పిట్లో పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సెంటిల్ బాలాజీ వంటి నేతలకు డీఎంకే రక్షణగా నిలుస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ అభివృద్ధి నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించకుండా ప్రాజెక్టులను అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.
త్రిముఖ పోటీతో వేడెక్కిన రాజకీయం
తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రధానంగా డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నప్పటికీ నటుడు విజయ్ తన సొంత పార్టీ 'టీవీకే' తో రంగంలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది.
