
చెన్నైలో ఘనంగా జూనియర్ హాకీ వరల్డ్‌కప్ ట్రోఫీ ఆవిష్కరణ
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బుధవారం చెన్నై సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎఫ్‌ఐహెచ్ హాకీ మెన్స్ జూనియర్ వరల్డ్‌కప్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, యువజన సంక్షేమం, క్రీడా అభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందం (ఐఏఎస్), అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అతుల్య మిశ్రా (ఐఏఎస్), తమిళనాడు క్రీడా అభివృద్ధి అథారిటీ (ఎస్‌డీఏటీ) సభ్య కార్యదర్శి, సీఈఓ జె. మేఘనాథ రెడ్డి (ఐఏఎస్) హాజరయ్యారు.
హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ, కార్యదర్శి భోలా నాథ్ సింగ్, కోశాధికారి, తమిళనాడు హాకీ యూనిట్ అధ్యక్షుడు శేఖర్ జె. మనోహరన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2025 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురైలో జరగనున్న ఈ టోర్నీలో మొదటిసారిగా 24 జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య దేశం భారత్ 2001, 2016లో రెండు సార్లు టైటిల్ గెలిచి, హోమ్ మైదానంలో మూడోసారి ట్రోఫీ అందుకోవాలని ఆశిస్తోంది. పూల్ బీలో ఒమన్, చిలీ, స్విట్జర్లాండ్‌తో ఉన్న భారత్ నవంబర్ 28న చెన్నై మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో చిలీతో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఈ సందర్భంగా హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ తిర్కీ మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి గారు జూనియర్ వరల్డ్‌కప్ ట్రోఫీని ఆవిష్కరించడం గర్వకారణం. తమిళనాడు ఎప్పుడూ భారత హాకీకి బలమైన మద్దతు ఇస్తోంది. చెన్నై, మధురైలో ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ నిర్వహించడం సంతోషం. ప్రపంచస్థాయి సౌకర్యాలు, క్రీడాభిమానం కలిసి ఈ ఎడిషన్‌ను జ్ఞాపకాల్లో నిలిపేలా చేస్తాయి. తమిళనాడు ప్రభుత్వం, ఎస్‌డీఏటీకి హాకీ ఇండియా తరపున కృతజ్ఞతలు’ అని అన్నారు.
హాకీ ఇండియా కార్యదర్శి భోలా నాథ్ సింగ్ మాట్లాడుతూ, ‘ఎఫ్‌ఐహెచ్ జూనియర్ వరల్డ్‌కప్ ప్రపంచ హాకీ భవిష్యత్తును సూచిస్తుంది. భారత్‌లో నిర్వహించడం మా యువ ఆటగాళ్లకు అపూర్వ అవకాశం. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, అభిమానుల ఉత్సాహం, తమిళనాడు ప్రభుత్వం, ఎస్‌డీఏటీ మద్దతుతో ఈ టోర్నీ కొత్త ప్రమాణాలు స్థాపిస్తుందని, దేశవ్యాప్తంగా కొత్త తరం హాకీ ఆటగాళ్లను ప్రేరేపిస్తుందని నమ్మకం’ అని తెలిపారు.
