Let's talk: editor@tmv.in
చెన్నైలోని ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు

చెన్నైలోని ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు

Shaik Mohammad Shaffee
18 అక్టోబర్, 2025

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు ఆందోళన రేకెత్తిస్తున్న తరుణంలో తాజాగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ నివాసమే లక్ష్యంగా బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. శుక్రవారం చెన్నైలోని మైలాపూర్‌లో ఉన్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసంలో బాంబు అమర్చినట్లు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సంస్థలు, పోలీసులు రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఉపరాష్ట్రపతి నివాసానికి చేరుకుని విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ సోదాల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ లభ్యం కాలేదు. దీంతో ఈ బెదిరింపు నకిలీదని అధికారులు నిర్ధారించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఈ మెయిల్‌ పంపినవారిని గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

తమిళనాడులో వరుస బెదిరింపులు

తమిళనాడులో గత కొద్ది రోజులుగా ప్రముఖుల ఇళ్లు, ప్రధాన కార్యాలయాలకు వరుసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, టీవీకే చీఫ్‌ విజయ్, నటి త్రిష, నయనతార వంటి ప్రముఖుల నివాసాలతో పాటు బీజేపీ ప్రధాన కార్యాలయం, డీజీపీ ఆఫీసు, రాజ్‌భవన్‌లకు కూడా బెదిరింపులు వచ్చాయి.

అంతేకాక ఇటీవల ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా స్టూడియోతో పాటు చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ వంటి విదేశీ కార్యాలయాలకు, కొయంబత్తూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, త్రిచీ శ్రీరంగం ఆలయం, కలెక్టర్ కార్యాలయం, జిల్లా కోర్టులకు కూడా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు అందాయి. అయితే ఈ బెదిరింపులన్నీ తనిఖీల్లో నకిలీవిగా తేలాయి. ఈ తరహా బెదిరింపు కాల్స్, మెయిల్స్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు.

నిందితులను ఎందుకు గుర్తించడం లేదు?

భారతదేశంలో నకిలీ బాంబు బెదిరింపులు ఎక్కువగా ఈ-మెయిల్స్/అంతర్జాతీయ కాల్స్ ద్వారా వస్తున్నాయి. ఈ బెదిరింపులు తరచుగా విదేశీ సర్వర్ల ద్వారా పంపిస్తుండటం వలన, ఐపీ అడ్రస్‌ను గుర్తించడం, నిందితులను త్వరగా పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. చాలా సందర్భాల్లో ఇవి కేవలం ఆకతాయిల పనులు, పరీక్షలకు భయపడిన విద్యార్థులు చేసే చర్యలు కావడంతో ట్రాక్ చేయడం కష్టమవుతోంది.

అయినప్పటికీ, కొన్ని కేసులలో పోలీసులు నిందితులను గుర్తించారు. తాజాగా ఢిల్లీలో పరీక్ష ఎగ్గొట్టేందుకు ఓ విద్యార్థి ఏకంగా పాఠశాలలో బాంబు ఉందంటూ బెదిరింపు మెయిల్ పంపగా, పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ బెదిరింపులకు పాల్పడింది ఆ పాఠశాలలోనే చదువుతున్న విద్యార్థి అని తేల్చారు. పరీక్షలకు భయపడి తాను ఇలా చేశానని విచారణలో విద్యార్థి అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని మందలించి ఇంటికి పంపించారు. అలాగే పలు విమానాలకు, ఎయిర్ పోర్టులకు బెదిరింపులకు పాల్పడిన వారికి కూడా పోలీసులు గుర్తించారు.

చెన్నైలోని ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబు బెదిరింపు - Tholi Paluku