
చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తా: మంత్రి వివేక్
కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో నూరు శాతం రాయితీపై ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నామని చెప్పారు.చేపలు ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారమని,వాటి వినియోగం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పేర్కొన్నారు.
గొల్లవాగు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టును తన తండ్రి కాక వెంకటస్వామి కట్టించారని మంత్రి గుర్తు చేసుకున్నారు. రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, జూబ్లీహిల్స్‌లో మత్స్యకారులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి, పార్టీకి ఓట్లు వేశారని పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని హామీ ఇస్తూ, చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.అలాగే, భీమారంలో మత్స్యకారుల సొసైటీ కోసం భవనాన్ని నిర్మించడం జరిగిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా మత్స్యకారులు మంత్రి దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. ఫిష్ మార్కెట్ ఏర్పాటు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, చెరువుల్లో చెట్లు తొలగించడం, పూడికతీత పనులు చేపట్టాలని కోరారు.వారి వినతులపై మంత్రి సానుకూలంగా స్పందించారు. “మత్స్యకారుల సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని. ప్రభుత్వం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది,” అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
