Let's talk: editor@tmv.in
చెదిరిపోతున్న కెనడా కలలు

చెదిరిపోతున్న కెనడా కలలు

Shaik Mohammad Shaffee
5 నవంబర్, 2025

కెనడాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. గత దశాబ్ద కాలంగా విదేశీ విద్యకు ప్రధాన గమ్యస్థానంగా ఉన్న కెనడా, ఇప్పుడు భారతీయ విద్యార్థుల దరఖాస్తులను పెద్ద ఎత్తున తిరస్కరిస్తోంది. 2025 ఆగస్టు నెలలో భారతీయ విద్యార్థులు చేసుకున్న స్టడీ పర్మిట్ దరఖాస్తుల్లో ఏకంగా 74 శాతం తిరస్కరణకు గురయ్యాయి. ప్రతి నలుగురు దరఖాస్తుదారుల్లో ముగ్గురి వీసాలు రద్దయ్యాయి.

కెనడా ఇమ్మిగ్రేషన్ విభాగం గణాంకాల ప్రకారం, భారతీయ విద్యార్థుల వీసా తిరస్కరణ రేటు 2023 ఆగస్టులో 32 శాతంగా ఉండగా, 2025 ఆగస్టు నాటికి అది 74 శాతానికి చేరుకుంది. దీనికి విరుద్ధంగా, ఇదే సమయంలో చైనా విద్యార్థుల వీసా తిరస్కరణ రేటు కేవలం 24 శాతం ఉండగా, మిగతా దేశాల సగటు రేటు 40 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. ఈ కఠిన నిర్ణయాల ప్రభావం దరఖాస్తుల సంఖ్యపైనా స్పష్టంగా కనిపిస్తోంది. 2023 ఆగస్టులో 20,900 మంది భారతీయ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 2025 ఆగస్టు నాటికి ఆ సంఖ్య కేవలం 4,515కు పడిపోయింది.

కఠిన నిర్ణయాలకు ప్రధాన కారణాలు

కెనడా ప్రభుత్వం అంతర్జాతీయ విద్యార్థి వీసా కార్యక్రమాన్ని కఠినతరం చేయడానికి, తాత్కాలిక వలసదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రధాన కారణం దేశంలో పెరిగిన విదేశీ విద్యార్థుల సంఖ్య. ఈ కారణంగా దేశంలో గృహ వసతి కొరత, మౌలిక సదుపాయాల సమస్యలు తలెత్తాయి. దీంతో పాటు వీసా దరఖాస్తుల్లో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. 2023లో దాదాపు 1,550 నకిలీ అడ్మిషన్ లెటర్లు గుర్తించబడ్డాయి, వీటిలో అత్యధిక శాతం భారత్ నుంచే ఉన్నట్లు ఇమ్మిగ్రేషన్ విభాగం పేర్కొంది. పటిష్టమైన వెరిఫికేషన్ వ్యవస్థ ద్వారా గత ఏడాది 14,000కు పైగా అనుమానాస్పద పత్రాలు పట్టుబడినట్లు వెల్లడించారు.

విద్యార్థులు తమ ఖర్చుల కోసం చూపించాల్సిన ఆర్థిక నిల్వల నిబంధనలనూ కఠినతరం చేశారు. ఇకపై కేవలం "బ్యాంక్ స్టేట్‌మెంట్లు" చూపిస్తే సరిపోదు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అధిక స్థానిక ఖర్చులను విద్యార్థులు భరించగలరా అనే విషయంలో కెనడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కెనడా-భారత్ మధ్య గతంలో నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా ఈ పరిణామాలకు ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం వీసా తిరస్కరణ రేటు పెరిగిన విషయాన్ని అంగీకరించినప్పటికీ, “విద్యార్థి అనుమతుల మంజూరు కెనడా ప్రభుత్వ నిర్ణయం” అని పేర్కొంది. “ప్రపంచంలో అత్యుత్తమ నాణ్యత గల విద్యార్థులు భారతదేశం నుంచే వస్తారు. కెనడా విద్యాసంస్థలు గతంలో ఈ విద్యార్థుల ప్రతిభ, విద్యా ప్రావీణ్యం వల్ల ఎంతో లాభపడ్డాయి” అని కూడా పేర్కొంది.

కెనడా విదేశాంగ మంత్రి అనిత ఆనంద్ మాట్లాడుతూ, ప్రభుత్వం వలస వ్యవస్థ సమగ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, భారత విద్యార్థులు కెనడాలో కొనసాగాలని కోరుకుంటుందని రాయిటర్స్‌కి తెలిపారు.

కెనడియన్ యూనివర్సిటీల్లో ఆందోళన

కెనడాలోని అతిపెద్ద ఇంజనీరింగ్ విద్యాసంస్థ యూనివర్సిటీ ఆఫ్ వాటర్‌లూ, గత 3-4 సంవత్సరాల్లో భారతీయ విద్యార్థుల ప్రవేశాలు మూడింట రెండొంతులు తగ్గాయని తెలిపింది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఇయాన్ వాండర్‌బర్గ్ మాట్లాడుతూ, ఇది ప్రభుత్వ వీసా పరిమితుల ఫలితమని చెప్పారు. ఇతర విశ్వవిద్యాలయాలు రెజీనా, సస్కాచెవాన్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

ఇంటర్నేషనల్ సిఖ్ స్టూడెంట్స్ అసోసియేషన్ స్థాపకుడు జస్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ “అప్పుడు ప్రభుత్వం ‘చదువు, పని చేయు, ఇక్కడే ఉండి భవిష్యత్తు నిర్మించు’ అని ప్రోత్సహించేది. కానీ ఆ సానుకూల భావన ఇప్పుడు తగ్గిపోయింది” అని అన్నారు.

కెనడా ప్రభుత్వం మోసాలను అరికట్టేందుకు ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్‌లకు సంబంధించిన మోసాల దృష్ట్యా, సామూహికంగా తాత్కాలిక వీసాలను రద్దు చేసేందుకు కొత్త అధికారాలను కోరుతోంది. బోర్డర్ చట్టంలో భాగమైన బిల్ సీ-12 ద్వారా ఈ కొత్త అధికారాలను ప్రభుత్వం పొందాలని చూస్తోంది.

అయితే ఈ ప్రతిపాదన 300కు పైగా పౌరసమాజ సంస్థలను ఆందోళనకు గురి చేసింది. వీరు “ఇది భారీ స్థాయిలో వీసా రద్దులు, తుది దశలో డిపోర్టేషన్లకు దారి తీసే ప్రమాదం ఉంది” అని హెచ్చరించారు. అంతర్గత నివేదికల ప్రకారం, భారత్ నుంచి వచ్చే తాత్కాలిక నివాస వీసా దరఖాస్తుల పరిశీలన సమయం 30 రోజుల నుంచి 54 రోజులకు పెరిగింది.

దౌత్య సంబంధాల పునరుద్ధరణ ప్రయత్నాలు

ఒకవైపు వీసా నిబంధనలు కఠినతరం అవుతున్నప్పటికీ, కెనడా భారత్‌తో దౌత్య సంబంధాలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోంది. జూన్ 2025 జీ7 సమ్మిట్ సందర్భంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కెనడాలో పర్యటించారు. ఇది రెండు దేశాల మధ్య సానుకూల సంకేతంగా పరిగణించబడింది. ఆగస్టులో రెండు దేశాలు పరస్పరం కొత్త హైకమిషనర్లను నియమించాయి.

ప్రత్యామ్నాయాల వైపు భారతీయ విద్యార్థుల చూపు

కఠిన నిబంధనల వల్ల కెనడాలో చదువుకోవాలనే భారతీయ విద్యార్థుల కల సాకారం కావడం సవాలుగా మారుతోంది. వారు ప్రత్యామ్నాయ గమ్యాల వైపు చూసే అవకాశం ఉంది. విద్యా నిపుణుల ప్రకారం, ప్రస్తుతం భారత విద్యార్థులలో ఎక్కువ మంది ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్, జర్మనీ, అమెరికా వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిలో ఆస్ట్రేలియా అత్యంత ఆకర్షణీయంగా మారింది. ఎందుకంటే వీసా ఆమోదం సులభం, చదువు పూర్తయ్యాక పని చేసే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి.

యుకే కూడా తన “గ్రాడ్యుయేట్ రూట్ వీసా” విధానం ద్వారా విద్యార్థులకు చదువు తర్వాత రెండు సంవత్సరాల ఉద్యోగ అవకాశాన్ని అందిస్తోంది. తక్కువ ట్యూషన్ ఫీజులు, ఇంజనీరింగ్, రీసెర్చ్ రంగాలలో ప్రతిష్ఠ కారణంగా జర్మనీ కూడా ప్రధాన గమ్యస్థానంగా మారుతోంది.