
'చీఫ్ మినిస్టర్స్ కప్ 2025' పోస్టర్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో నిర్వహించనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ – 2వ ఎడిషన్ 2025కు సంబంధించిన పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.
ఈ క్రీడా పోటీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 8 నుంచి 17 వరకు పది రోజుల పాటు టార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఈ ర్యాలీ కొనసాగి, యువతతో పాటు క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని పెంచనుంది.
షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయి పోటీలు, 28 నుంచి 31 వరకు మండల స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు నియోజకవర్గ స్థాయి, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయి, చివరగా ఫిబ్రవరి 19 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. వాస్తవానికి ఈ క్రీడలు డిసెంబర్ నెలలో జరగాల్సి ఉండగా, వివిధ కారణాల వల్ల వాయిదా పడటంతో ఇప్పుడు సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించారు.
గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని స్థాయిల్లో మొత్తం 44 రకాల క్రీడల్లో శాట్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించనున్నారు. దీని ద్వారా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి మరింత అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం ఉంది.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేన ఐవైసీ, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, శాట్స్ ఎండీ సోనీబాల తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలో క్రీడలకు కొత్త ఊపునిస్తుందని వారు అభిప్రాయపడ్డారు.
