Let's talk: editor@tmv.in
చివరి వ్యక్తి స్వరం ప్రభుత్వానికి చేర్చే వేదిక శాసన సభే: ఓం బిర్లా

చివరి వ్యక్తి స్వరం ప్రభుత్వానికి చేర్చే వేదిక శాసన సభే: ఓం బిర్లా

Pinjari Chand
22 జనవరి, 2026

ప్రజలు తమ సమస్యలు, ఇబ్బందులు, సవాళ్లను శాసనసభల్లో తమ ప్రతినిధులు లేవనెత్తి పరిష్కారం చూపుతారన్న విశ్వాసంతోనే ఓటు హక్కును వినియోగించుకుంటారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. లక్నోలో జరిగిన 86వ అఖిల భారత ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సు, 62వ శాసనసభా కార్యదర్శుల సదస్సు ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభలే చివరి వ్యక్తి స్వరం ప్రభుత్వానికి చేరే ప్రధాన వేదిక అని బిర్లా అన్నారు. ఒక పౌరుడు ఓటు వేస్తున్నప్పుడు, వచ్చే ఐదేళ్ల పాటు తన సమస్యలను శాసనసభలో తన ప్రతినిధి ప్రస్తావిస్తాడన్న నమ్మకంతోనే వేస్తాడు. ఆ చర్చల ద్వారా పరిష్కారాలు వెలువడతాయని ఆశిస్తాడు అని స్పీకర్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసంతోనే శాసనసభలపైనా నమ్మకం ఉందని, సానుకూల దృక్పథంతో, నిర్మాణాత్మకంగా చర్చలు జరిగితే శాసనసభల ద్వారా ఫలితాలు తప్పక వస్తాయని ఆయన అన్నారు.

ప్రజాస్వామ్య సంస్థలను మరింత బలోపేతం చేయడంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, శాసనసభా కార్యదర్శుల సదస్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయని బిర్లా చెప్పారు. శాసనసభా సమావేశాల వ్యవధి తగ్గుతున్న అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రాష్ట్ర శాసనసభలు కనీసం సంవత్సరానికి 30 రోజులైనా సమావేశమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు మరింత చేరువగా ప్రజాస్వామ్య సంస్థలు పనిచేయాలంటే నిరంతర సంభాషణ, నూతన, సంస్కరణలు అవసరమని స్పీకర్ తెలిపారు. అభివృద్ధి చెందిన భారత లక్ష్యానికి అనుగుణంగా శాసనసభల పని తీరు ఉండాలని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, విధానసభ స్పీకర్ సతీష్ మహానా సమక్షంలో మాట్లాడిన బిర్లా, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో ఉత్తరప్రదేశ్ తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. శాసనసభల్లో నిరంతర చర్చలు, సంభాషణలు రాష్ట్రాల అభివృద్ధి, సుపరిపాలనకు దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.