Let's talk: editor@tmv.in
చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్ : డిప్యూటీ సీఎం

చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్ : డిప్యూటీ సీఎం

Panthagani Anusha
17 డిసెంబర్, 2025

విద్యార్థులకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా రికార్డు సమయంలో అమలు చేసి చూపించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్ 2.0 సందర్భంగా ప్రకటించినట్టుగానే, తొమ్మిది రోజుల్లో చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 25 కంప్యూటర్లతో కూడిన అధునాతన స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, గ్రంథాలయాన్ని పుస్తకాలతో నింపేశారు.

ఇటీవల నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీట్‌కు హాజరైపాఠశాల వసతులను పరిశీలించిన పవన్ కళ్యాణ్ లైబ్రరీలో పుస్తకాల కొరతను గమనించి, వెంటనే గ్రంథాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడంతో పాటు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ తొమ్మిది రోజుల్లోనే పనులు పూర్తి చేయించడం విశేషం.

బహుభాషా పుస్తకాలతో గ్రంథాలయం

పాఠశాల గ్రంథాలయంలో చిన్నారుల కోసం పెద బాలశిక్ష నుంచి కాశీ మజిలీ కథల వరకు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్, హిందీతో పాటు తమిళం, కన్నడ, ఒడియా తదితర భాషల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థుల్లో పఠనాసక్తి, బహుభాషా ప్రావీణ్యం పెంపొందించేలా ఈ ఏర్పాట్లు చేశారు. మొత్తం రూ.25 లక్షల వ్యయంతో కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయ అభివృద్ధి పనులు చేపట్టారు.

సోమవారం చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పంచాయతీరాజ్–గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, కూటమి నాయకులు కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయాన్ని లాంఛనంగా ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

విద్యార్థి దశ నుంచే నైపుణ్యాభివృద్ధి, పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించాల్సిన అవసరాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి సమావేశంలోనూ చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్న వసతులపై ఆరా తీస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

ఇటీవల అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లి గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా పాఠశాలకు ఆటస్థలం లేదని తెలుసుకుని, రూ.65 లక్షల సొంత నిధులతో స్థలం కొనుగోలు చేసి అందజేయడం గమనార్హం. అదేవిధంగా కడప మున్సిపల్ స్కూల్ సందర్శన అనంతరం కలెక్టర్ సూచన మేరకు ఆధునిక మోడల్ కిచెన్‌ను ఏర్పాటు చేయించారు.

చిలకలూరిపేట శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ కి కంప్యూటర్ ల్యాబ్ : డిప్యూటీ సీఎం - Tholi Paluku