Let's talk: editor@tmv.in
చిరువ్యాపారులపై దౌర్జన్యం తగదు: వైసీపీ నేత

చిరువ్యాపారులపై దౌర్జన్యం తగదు: వైసీపీ నేత

Panthagani Anusha
17 ఫిబ్రవరి, 2026

కష్టపడి పని చేస్తూ నిజాయితీగా జీవనం సాగిస్తున్న చిరువ్యాపారులపై కొందరు వ్యక్తులు పనిగట్టుకుని దాడులకు పాల్పడటం వారిని భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత బాధాకరమని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు హఫీజ్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఖోవా బన్స్ అమ్ముకుంటూ బతుకుదెరువు సాగిస్తున్న షైక్షా వలి, జావీద్‌లపై ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు.

సమాజంలో విభజన కోసమే వేధింపులు

సమాజంలో మతపరమైన విభేదాలు సృష్టించాలనే కుట్రతోనే ఒక యూట్యూబర్ ఈ దాడులకు పాల్పడ్డారని హఫీజ్ ఖాన్ విమర్శించారు. సదరు యూట్యూబర్ వ్యాపారులను వేధించడమే కాకుండా వారి వద్ద ఉన్న సరుకును పారబోసి బెదిరింపులకు దిగడం ఆందోళన కలిగించే విషయమన్నారు. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదని అమాయక పేదలను లక్ష్యంగా చేసుకుని చేసే ఇటువంటి చర్యలు నాగరిక సమాజంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా హఫీజ్ ఖాన్ బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. పేదరికానికి మతం ఉండదు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవడం తప్ప సామాన్యుడికి మరో ఆలోచన ఉండదు. కానీ కొందరు సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం చేస్తూ సమాజంలో విద్వేషాలు నింపుతున్నారు," అని ఆయన మండిపడ్డారు. బాధితులు ఒంటరి వారు కాదని, వారికి తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సంబంధిత అధికార యంత్రాంగం మరియు పోలీసులు వెంటనే స్పందించి, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో మానవత్వంతో స్పందించి బాధితులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.