Let's talk: editor@tmv.in
చిరాగ్ పాశ్వాన్ తో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

చిరాగ్ పాశ్వాన్ తో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

Pinjari Chand
8 అక్టోబర్, 2025

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సీట్ల సర్దుబాటు, తదితర పార్టీల పొత్తులపై వేగంగా చర్చలు జరుగుతున్నాయి. నామినేషన్ల సమయంలోపు ఓ కొలిక్కి తీసుకురావాలని ముమ్మరంగా ఆయా పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. మంగళవారం బీజేపీ బీహార్ ఎన్నికల ఇన్‌చార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ పార్టీ బీహార్ బిజెపి ఇన్​ చార్జ్ వినోద్ తవ్డే, రాష్ట్ర మంత్రి మంగళ్ పాండే, ఇతర 18 పార్టీల నాయకులతో కలిసి ఢిల్లీలోని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌తో ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్లపంపకాలపై చర్చలు జరిగాయి. ఈసమావేశంలో 60సిట్టింగ్ స్థానాల(గెలిచిన,ఓడిన)పై చర్చలు జరిగాయి. ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరు, కొత్త అభ్యర్థుల పై చర్చలు జరిగాయి. రానున్న ఎన్నికల్లో మహిళలకు,యువతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. అక్టోబర్ 4,5 తేదీలలో కేంద్ర మంత్రి ప్రధాన్ రాబోయే ఎన్నికలకు పార్టీ సన్నాహాలను సమీక్షించడానికి పాట్నాలో నాయకులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం, బీహార్ అసెంబ్లీలో ఎల్జేపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే లేరు. 2020 ఎన్నికలలో రాజ్ కుమార్ సింగ్ పార్టీ టిక్కెట్‌పై గెలిచారు. అయితే తరువాత ఆయన జనతాదళ్ (యునైటెడ్) లో చేరారు. పాశ్వాన్ కోరుతున్నట్లు 40 సీట్లను ఎన్డీయే ఇచ్చే పరిస్థితి లేదు. మిగతా పార్టీలు కూడా సీట్లు అధికంగానే ఆశిస్తున్నాయి.

కూటమిలో ఉన్న పార్టీలు

బీహార్‌లోని శాసనసభ కూటమికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం వహిస్తున్నారు. బిజెపి, ఎల్జేపీ(రామ్ విలాస్​ పాశ్వాన్), జనతాదళ్ (యునైటెడ్) హిందుస్తాన్ అవామి మోర్చా, రాష్ట్రీయ లోక్ శక్తి పార్టీలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌లో (ఎన్డీయే) ఉన్నాయి. అంతకుముందు పాట్నాలో జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ, పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు పోతుందని చెప్పారు.

తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ కూటమి, కాంగ్రెస్, సీపీఐ (ఎంఎల్), సీపీఐ, సీపీఎం, వికాశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)లతో ఎన్డీయే తలపడనుంది. ఈసారి బీహార్‌లో ప్రశాంత్ కిషోర్ జాన్ సురాజ్ పార్టీ స్థాపించడంతో మరో పొలిటికల్ పార్టీ ఎన్నికల క్షేత్రంలోకి దూకింది. బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6,11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిసిందే.

చిరాగ్ పాశ్వాన్ తో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ - Tholi Paluku