
చిన్న వ్యాపారులపై బీజేపీ విధానాలు భారమే : రాహుల్‌గాంధీ
బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు చిన్న, మధ్యతరహా వ్యాపారాలను కుదేలు చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా వ్యాపార రంగానికి వెన్నెముకగా నిలిచిన వైశ్య (వ్యాపారి) వర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. వైశ్య సమాజానికి తాను పూర్తి మద్దతుగా నిలుస్తానని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ, ఇది బీజేపీ ప్రభుత్వంలోని సామంత మనస్తత్వం (ఫ్యూడల్ మైండ్‌సెట్)పై పోరాటమని వ్యాఖ్యానించారు. చిన్న వ్యాపారుల ఆవేదన దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాద సూచికగా మారిందని హెచ్చరించారు. మా వ్యాపారం పూర్తిగా కూలిపోయే స్థితిలో ఉంది అనే వైశ్య సమాజపు వేదన మనసును కదిలించింది. దేశ ఆర్థికాభివృద్ధికి చారిత్రకంగా కీలక పాత్ర పోషించిన ఈ వర్గం నేడు తీవ్ర నిరాశలో ఉంది. ఇది రాబోయే ప్రమాదానికి హెచ్చరిక అని బుధవారం రాహుల్ గాంధీ ఎక్స్ లో తెలిపారు. ఇటీవల చిన్న వ్యాపారులతో లోక్ సభ ప్రతిపక్ష నేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయనకు తమ సమస్యలను తెలుపుకున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని వాపోయారు.
ప్రభుత్వం మోనోపోలీలకు అండగా ఉంది
ప్రభుత్వం మోనోపోలీలకు స్వేచ్ఛనిచ్చి, చిన్న-మధ్య తరహా వ్యాపారులను బ్యూరోక్రసీ సంకెళ్లలో బంధించిందని, తప్పుదారి పట్టిన జీఎస్టీ వంటి విధానాలతో వారిపై భారాన్ని మోపిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది కేవలం విధాన వైఫల్యం మాత్రమే కాదు. ఉత్పత్తి, ఉపాధి, భారత భవిష్యత్తుపై నేరుగా దాడి చేసినట్లే అని ఆయన అన్నారు. ఈ పోరాటంలో దేశ వాణిజ్యానికి పునాదిగా నిలిచిన వైశ్య సమాజం పక్కనే తాను సంపూర్ణ శక్తితో నిలుస్తానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా వికసిత్ భారత్ – ఉపాధి, జీవనోపాధి మిషన్ (గ్రామీణ) బిల్లు–2025 (వీబీ–జీ రాం–జీ బిల్లు)పై పార్లమెంట్‌లో చర్చ జరగకపోవడాన్ని కూడా రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ బిల్లు అభివృద్ధి కోసం కాదని, విధ్వంసానికి దారితీసేదిగా ఉందని ఆరోపించారు. దీని ప్రభావంతో కోట్లాది మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజా చర్చ లేదు, పార్లమెంట్‌లో చర్చ లేదు, రాష్ట్రాల సమ్మతి లేదు. మోడీ ప్రభుత్వం ఎంఎన్‌ఆర్‌ఈజీఏతో పాటు ప్రజాస్వామ్యంపైనా బుల్డోజర్ నడిపింది. ఇది అభివృద్ధి కాదు, విధ్వంసం అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ రాసిన వ్యాసాన్ని చదవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
