
చిన్నారుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: మణిపూర్ సీఎం
మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై. ఖేమచంద్ సింగ్ తీవ్రంగా స్పందించారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఐదు లోయ జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కేంద్రంతో సమన్వయం చేస్తూ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలో ఆల్ మణిపూర్ యునైటెడ్ క్లబ్ ఆర్గనైజేషన్ (ఏఎంయూసీవో) ప్రతినిధులు, ఇతర సంఘాలతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోంమంత్రి కె. గోవిందాస్ సింగ్, పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు.
ప్రతినిధులు వ్యక్తం చేసిన ఆందోళనలపై సమావేశంలో చర్చించినట్లు సీఎం తెలిపారు. బిష్ణుపూర్ ఘటన అత్యంత దురదృష్టకరమని, శాంతి పునరుద్ధరణకు జరుగుతున్న ప్రయత్నాలకు ఇది అంతరాయం కలిగించిందని అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుందని, దాడికి పాల్పడిన వారిని గుర్తించి చట్టం ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజల భద్రతను కాపాడడం, శాంతి సాధించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని సీఎం పేర్కొన్నారు. శాంతి పునరుద్ధరణలో పౌర సమాజ సంస్థలు, ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా, బాంబు దాడిని ఖండిస్తూ ఏఎంయూసీవో ఆధ్వర్యంలో వందలాది మంది ప్రజలు ర్యాలీ నిర్వహించారు. దాడిలో మృతి చెందిన ఇద్దరు చిన్నారుల ఫోటోలు పట్టుకుని పిల్లలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. అయితే భద్రతా దళాలు ర్యాలీని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. అనంతరం ఏఎంయూసీవో ప్రతినిధులను పోలీసులు సచివాలయానికి తీసుకెళ్లి సీఎంతో సమావేశం ఏర్పాటు చేశారు.
బిష్ణుపూర్ జిల్లాలోని ట్రోంగ్లావోబీ గ్రామంలో ఒక ఇంటిపై అనుమానిత ఉగ్రవాదులు బాంబు విసరడంతో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల పసిబిడ్డ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన తర్వాత ఆగ్రహించిన సుమారు 500 మంది నిరసనకారులు గెల్మోల్ సమీపంలోని సీఆర్‌పీఎఫ్ శిబిరంపై దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరపగా ముగ్గురు నిరసనకారులు మరణించగా, 30 మంది గాయపడ్డారు. ఇదే సమయంలో ఇంఫాల్ వెస్ట్ జిల్లాలోని సమురో ప్రాంతంలో నిరసనకారులు సీఎం అధికార నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
