
చిన్నారుల ఆన్‌లైన్ భద్రతకు కఠిన నిబంధనలు తీసుకొచ్చిన యూకే
ఇంటర్నెట్ ప్రపంచంలో చిన్నారుల భద్రతకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పిల్లలకు ఎదురవుతున్న ముప్పును అరికట్టేందుకు అత్యంత కఠినమైన ఆన్‌లైన్ భద్రతా నియమాలను సోమవారం ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ టెక్ కంపెనీలను హెచ్చరిస్తూ.. చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడే ఏ సంస్థకూ ఇకపై 'ఫ్రీ పాస్' ఉండబోదని, చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఏఐ చాట్‌బాట్‌లకు కళ్లెం
ప్రస్తుతమున్న ఆన్‌లైన్ భద్రతా చట్టంలోని లొసుగులను తొలగిస్తూ ఏఐ చాట్‌బాట్ నిర్వాహకులందరూ తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నారు. ముఖ్యంగా అక్రమ కంటెంట్ బాధ్యతలను నిర్వర్తించని పక్షంలో భారీ జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఎలాన్ మాస్క్‌కు చెందిన 'ఎక్స్' ప్లాట్‌ఫారమ్‌లోని 'గ్రోక్' ఏఐ చాట్‌బాట్ ద్వారా అభ్యంతరకర చిత్రాలు షేర్ అవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం, నిబంధనలను కఠినతరం చేస్తూ ఈ చర్యలు చేపట్టింది.
వయోపరిమితిపై త్వరలో స్పష్టత
సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి కనీస వయోపరిమితిని నిర్ణయించేందుకు బ్రిటన్ ప్రభుత్వం త్వరలో ఒక సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా చిన్నారులను బానిసలుగా మార్చే 'ఇన్ఫినిట్ స్క్రోలింగ్' వంటి ఫీచర్లపై పరిమితులు విధించే అవకాశం ఉంది. "ఇద్దరు టీనేజర్ల తండ్రిగా సోషల్ మీడియా వల్ల తల్లిదండ్రులు పడుతున్న ఆందోళన నాకు తెలుసు. టెక్నాలజీ వేగంగా మారుతోంది, దానికి తగ్గట్టుగా చట్టాలు కూడా మారాలి" అని స్టార్మర్ వ్యాఖ్యానించారు.
అభ్యంతరకర కంటెంట్‌పై పోరు
చిన్నారుల అభ్యంతరకర చిత్రాల పంపిణీ ఇప్పటికే చట్టవిరుద్ధమని స్పష్టం చేసిన ప్రభుత్వం.. అటువంటి ఫోటోలు అసలు పిల్లల వద్దకు చేరకుండా టెక్ సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై చర్చించనుంది. అలాగే, భద్రతా నియమాలను పక్కదారి పట్టించేందుకు చిన్నారులు వాడే వీపీఎన్ వినియోగంపై కూడా ఆంక్షలు విధించే యోచనలో ఉంది. ఒకవేళ ఇంటర్నెట్ దుష్ప్రభావాల వల్ల ఏదైనా చిన్నారి ప్రాణాలు కోల్పోతే, ఆ కేసుకు సంబంధించిన డిజిటల్ డేటాను టెక్ సంస్థలు డిలీట్ చేయకుండా భద్రపరచాలని కొత్త నిబంధనలను చేరుస్తోంది.
తల్లిదండ్రులకు అవగాహన
కేవలం చట్టాలే కాకుండా, తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం చేసేందుకు 'యు వోంట్ నో అంటిల్ యూ ఆస్క్' (You Won’t Know until You Ask) అనే ప్రచారాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. సోషల్ మీడియాలో సెక్యూరిటీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి? చిన్నారులతో ఈ అంశాలపై ఎలా చర్చించాలి? ద్వేషపూరిత కంటెంట్ నుంచి వారిని ఎలా రక్షించాలి? అనే విషయాలపై ప్రభుత్వం ఆచరణాత్మక సలహాలను అందించనుంది. దీనికోసం వచ్చే నెలలో 'చిల్డ్రన్స్ డిజిటల్ వెల్‌బీయింగ్ కన్సల్టేషన్'ను అధికారికంగా లాంచ్ చేయనున్నారు.
గ్లోబల్ ట్రెండ్ దిశగా బ్రిటన్
గత ఏడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా దేశం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధిస్తూ ప్రపంచంలోనే మొదటిసారిగా చట్టం తెచ్చింది. బ్రిటన్‌లో కూడా అటువంటి నిషేధం విధించాలనే డిమాండ్ పెరుగుతున్న తరుణంలో.. ప్రస్తుతానికి ప్లాట్‌ఫారమ్‌లు, పరికరాలపై నియంత్రణ సాధించడం ద్వారా మరింత మెరుగైన భద్రతను అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. చిన్నారుల క్షేమం కోసమే ఈ 'చిల్డ్రన్ వెల్‌బీయింగ్ అండ్ స్కూల్స్ బిల్'ను త్వరలోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
