Let's talk: editor@tmv.in
చిన్నారులకు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్: జార్ఖండ్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

చిన్నారులకు హెచ్ఐవీ ఇన్ఫెక్షన్: జార్ఖండ్ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

Shaik Mohammad Shaffee
31 అక్టోబర్, 2025

జార్ఖండ్‌లో ఐదుగురు చిన్నారులకు రక్త మార్పిడి ద్వారా హెచ్ఐవీ సోకిన ఘటనపై హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది. రక్త మార్పిడి సమయంలో అనుసరించాల్సిన ప్రామాణిక నియమాలు పాటించలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

చీఫ్ జస్టిస్ తార్లోక్ సింగ్ చౌహాన్, జస్టిస్ రాజేష్ శంకర్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించింది. చైబాసా జిల్లాలోని ఐదుగురు తలసేమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి తర్వాత హెచ్ఐవీ సోకినట్లు వెలుగులోకి రావడంతో ఈ కేసు నమోదు అయింది. ఈ పిల్లలు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చైబాసా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రక్త మార్పిడి చేయించుకున్నారు. అయితే రక్తం కలుషితమైనదని తర్వాత గుర్తించారు.

కోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి అజయ్ కుమార్ సింగ్‌ను సాక్ష్యపత్రం సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగిన రక్తదాన శిబిరాల వివరాలు, రక్త డిమాండ్‌-సరఫరా వివరాలు సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది.

రోగికి రక్తం ఎక్కించే ముందు రక్త నాణ్యతను నిర్ధారించడానికి, హెచ్ఐవి ఉనికిని గుర్తించడానికి అత్యంత అవసరమైన న్యూక్లియక్ యాసిడ్ టెస్ట్ (ఎన్ఏటీ) నిర్వహించే అధునాతన స్క్రీనింగ్ యంత్రాలను ఆసుపత్రుల్లో ఎందుకు ఏర్పాటు చేయలేదో వివరించాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. బ్లడ్ బ్యాంకులకు లైసెన్స్‌లు ఇవ్వడంలో ఆలస్యం ఎందుకు జరుగుతోందో, రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కారణాలను కూడా కోర్టు అడిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న రక్తం సేకరణ పద్ధతి గురించి కూడా కోర్టు ప్రస్తావించింది. ఈ కేసు తలసేమియా బాలుడి తండ్రి చీఫ్ జస్టిస్‌కి రాసిన లేఖ ఆధారంగా సుమోటో పిటిషన్‌గా హైకోర్టు స్వీకరించింది. రక్త మార్పిడి తర్వాత తన కుమారుడు హెచ్ఐవీ బారిన పడ్డాడని ఆయన లేఖలో పేర్కొన్నారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో, రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 26న వెస్ట్ సింగ్‌భూం సివిల్ సర్జన్ సహా పలువురు అధికారులను సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి విచారణ కూడా ప్రారంభమైంది. విపక్ష బీజేపీ ఈ ఘటనను సిగ్గుచేటుగా పేర్కొంటూ, ఇది "ప్రభుత్వ ప్రేరేపిత పిల్లల హత్యాప్రయత్నం"గా తీవ్ర స్థాయిలో విమర్శించింది. చైబాసా జిల్లా రక్త బ్యాంక్‌ కలుషిత రక్తాన్ని ఏడేళ్ల తలసేమియా బాలుడికి మార్పిడి చేశారనే కుటుంబ ఆరోపణలతో ఈ ఘటన బయటపడింది. ఈ కేసు విచారణ కొనసాగుతున్నందున హైకోర్టు ఆదేశాల మేరకు జార్ఖండ్ ప్రభుత్వం సమర్పించే అఫిడవిట్ కీలకంగా మారనుంది.

ఏమి జరిగింది?

జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసా జిల్లాలో తలసేమియా బాధిత ఐదుగురు చిన్నారులు చికిత్సలో భాగంగా సదర్ ఆసుపత్రిలో రక్త మార్పిడి చేయించుకున్నారు. ఆ తర్వాత వారిలో హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో పరీక్షలు జరిపారు. దాంతో ఈ పిల్లలకు మార్పిడి చేసిన రక్తం కలుషితమైనది అని తేలింది.

ఎలా జరిగింది?

ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్‌లో రక్తం సేకరించినప్పుడు న్యూక్లియిక్ యాసిడ్ టెస్ట్ అనే ఆధునిక పరీక్ష చేయలేదు. ఈ పరీక్ష రక్తంలో హెచ్ఐవీ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వైరస్‌లు ఉన్నాయో లేదో ముందుగానే చెబుతుంది. అయితే రక్తాన్ని పాత పద్ధతిలో మాత్రమే పరీక్షించి, సరిగా స్క్రీన్ చేయకుండానే పిల్లలకు మార్పిడి చేశారు. రక్త దానం సమయంలో, నిల్వ సమయంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు.

దర్యాప్తులో బయటపడ్డ కీలక విషయాలు

బ్లడ్ బ్యాంక్‌కు సరైన లైసెన్స్ లేనట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం, ఏదైనా బ్లడ్ బ్యాంక్​ను నడపాలంటే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నుంచి అవసరమైన అనుమతులు పొందాలి. కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంపులు సరైన పర్యవేక్షణ లేకుండా నిర్వహించబడినట్లు నిర్ధారణ అయింది. రక్త పరీక్షకు అవసరమైన ఆధునిక యంత్రాలు చాలా ఆసుపత్రుల్లో లేవు. రక్త మార్పిడి రికార్డులు సరిగా నిర్వహించలేదని విచారణలో తేలింది.

ఇది నిజంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. పర్యవేక్షణ లోపం కారణంగా జరిగిన తీవ్రమైన వైద్య తప్పిదం. దీంతో అమాయక చిన్నారులు జీవితాంతం బాధపడే పరిస్థితి ఏర్పడింది.