Let's talk: editor@tmv.in
చిన్నారి సాహసాలకు సలాం.. 20 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా 'బాల్ పురస్కార్’ ప్రదానం

చిన్నారి సాహసాలకు సలాం.. 20 మందికి రాష్ట్రపతి చేతుల మీదుగా 'బాల్ పురస్కార్’ ప్రదానం

Shaik Mohammad Shaffee
27 డిసెంబర్, 2025

దేశం కోసం ప్రాణాలర్పించిన చిన్నారి వీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ, నేటి తరం బాలల్లో దాగివున్న అసాధారణ ప్రతిభను గుర్తిస్తూ భారత ప్రభుత్వం శుక్రవారం ఘనంగా ‘వీర్ బాల్ దివస్’ వేడుకలు నిర్వహించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 20 మంది పిల్లలకు 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ - 2025' అవార్డులను ప్రదానం చేశారు.

వీర్ బాల్ దివస్ అంటే ఏమిటి?

సిక్కుల పదో గురువు శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కుమారులు సాహిబ్‌జాదా జోరావర్ సింగ్ (9 ఏళ్లు), సాహిబ్‌జాదా ఫతే సింగ్ (7 ఏళ్లు) మత మార్పిడికి ఒప్పుకోలేదని మొఘలులు వారిని సజీవంగా గోడలో పెట్టి చంపేశారు. వారి అసాధారణ సాహసాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకునేందుకు ప్రధాని మోడీ ప్రతి ఏటా డిసెంబర్ 26ను 'వీర్ బాల్ దివస్'గా ప్రకటించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించి పిల్లల్లో దేశభక్తిని నింపుతున్నారు.

అవార్డు పొందిన బాల కెరటాలు

ఈ ఏడాది దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల నుండి మొత్తం 20 మంది పిల్లలు ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారితో పాటు.. ప్రాణాలకు తెగించి ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారు, సమాజ సేవలో విశేష కృషి చేసిన వారు ఈ జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు.

ఎవరెవరికి ఇస్తారు?

ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని 5 నుండి 18 ఏళ్ల లోపు వయసున్న భారతీయ చిన్నారులకు అందజేస్తారు. శౌర్యం (ధైర్యసాహసాలు), సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు, సంస్కృతి, అలాగే సైన్స్ & టెక్నాలజీ వంటి రంగాలలో జాతీయ స్థాయిలో అసాధారణ ప్రతిభ కనబరిచిన, అద్భుతమైన ఆవిష్కరణలు చేసిన పిల్లలను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ పురస్కారం కింద విజేతలకు ఒక పతకం (మెడల్), ప్రశంసా పత్రం (సర్టిఫికెట్), లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేసి గౌరవిస్తారు.

ప్రధాని మోడీ సందేశం

“ నేటి బాలలే రేపటి వికసిత్ భారత్‌కు పునాది” అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. చిన్నారి వీరుల సాహస గాథలు నేటి యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయని కొనియాడారు. 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడంలో (వికసిత్ భారత్) యువత పాత్ర అత్యంత కీలకమని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.