Let's talk: editor@tmv.in
చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్‌లకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్‌లకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Shaik Mohammad Shaffee
17 మార్చి, 2026

బెంగళూరు క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందింది. ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ఇతర మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చేందుకు ఎం. చిన్నస్వామి స్టేడియానికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రత, మౌలిక సదుపాయాలపై హోం మంత్రి జి. పరమేశ్వర నియమించిన నిపుణుల కమిటీ సోమవారం తుది అనుమతి మంజూరు చేసింది. గతేడాది వేడుకల సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో, స్టేడియంలో పకడ్బందీ మార్పులు చేపట్టిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గత డిసెంబర్‌లో మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ కేఎస్‌సీఏ పగ్గాలు చేపట్టిన రెండు నెలల్లోనే ఈ మరమ్మతులన్నీ పూర్తి చేశారు.

తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు..

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్‌సీబీకి లభించిన సంప్రదాయం ప్రకారం.. ఈ ఏడాది సీజన్ తొలి మ్యాచ్ (మార్చి 28న ఆర్‌సీబీ వర్సెస్ సన్‌రైజర్స్), ఒక ప్లేఆఫ్ మ్యాచ్‌తో పాటు గ్రాండ్ ఫైనల్ కూడా బెంగళూరులోనే జరగనుంది. మొత్తం ఏడు హోమ్ మ్యాచ్‌లలో ఐదు మ్యాచ్‌లు చిన్నస్వామి స్టేడియంలో జరగనుండగా, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మరో రెండు మ్యాచ్‌లు రాయ్‌పూర్‌లో నిర్వహించనున్నారు. ఏప్రిల్ 5న జరిగే చెన్నై సూపర్ కింగ్స్‌తో పోరు కూడా బెంగళూరులోనే జరగనుంది. టికెట్ల విక్రయ ప్రక్రియ ఈ వారంలోనే ప్రారంభం కానుంది.

మెట్రో ఉచితం

ప్రేక్షకుల సౌకర్యార్థం బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ జరిగే రోజుల్లో అర్ధరాత్రి 1 గంట వరకు రైళ్లను నడపడంతో పాటు, మ్యాచ్ టికెట్ ఉన్నవారికి ఉచిత ప్రయాణం కల్పించే దిశగా చర్చలు జరుపుతున్నారు. రద్దీని తగ్గించేందుకు ఆర్‌సీబీ యాజమాన్యం క్యూఆర్ కోడ్ టికెట్లను ప్రవేశపెట్టనుంది. స్టేడియంలోకి ప్రవేశించేందుకు అదనంగా ఆరు కొత్త గేట్లను నిర్మించడంతో పాటు, పాత గేట్లను వెడల్పు చేశారు. అలాగే అభిమానులు వేచి ఉండేందుకు ప్రత్యేకంగా హోల్డింగ్ ఏరియాలను సిద్ధం చేశారు. కబ్బన్ రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్‌లకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - Tholi Paluku