Let's talk: editor@tmv.in
చిన్నకోడూరు రైతుల పాదయాత్రలో హరీష్‌‌రావు.. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్

చిన్నకోడూరు రైతుల పాదయాత్రలో హరీష్‌‌రావు.. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్

Gaddamidi Naveen
20 జులై, 2026

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో రైతులు నిర్వహించిన మహా పాదయాత్రలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. వేలాది మంది రైతులతో కలిసి ఆయన పాదయాత్రలో నడిచి అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఇది బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమం కాదని, చిన్నకోడూరు మండల రైతులే స్వచ్ఛందంగా చేపట్టిన పాదయాత్ర అని స్పష్టం చేశారు. అనంతగిరి, రంగనాయక సాగర్ రిజర్వాయర్లు మండల పరిధిలో ఉండటంతో సాగునీటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు తనను ఆహ్వానించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై ఒత్తిడి తీసుకురావడమే ఈ యాత్ర ఉద్దేశమని పేర్కొన్నారు. రంగనాయక సాగర్‌ను వెంటనే నింపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారని, 15 కిలోమీటర్ల పాదయాత్రను రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పూర్తి చేశారని చెప్పారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సహజ కరువు వల్ల కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏర్పడినవేనని హరీష్ రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గతంలో రంగనాయక సాగర్ నిండుగా ఉండేదని, ఇప్పుడు మోటార్లు ఆన్ చేయకపోవడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం తీవ్రంగా పడిపోయిందన్నారు. అలాగే సుమారు 70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఉంటే రంగనాయక సాగర్ నిండిపోయేదని, కానీ ప్రభుత్వం ఆ అవకాశం కోల్పోయిందని విమర్శించారు. వెంటనే కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే భవిష్యత్తులో తెలంగాణ వ్యాప్తంగా రైతుల ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని హరీష్ రావు హెచ్చరించారు.

ట్యాగ్‌లు
HarishRaoBRSSiddipetChinnakoduruRythuPadayatraTelanganaFarmersRanganayakaSagarKaleshwaramSaveFarmersWaterForFarmersTelanganaPoliticsRevanthReddyFarmerIssues
చిన్నకోడూరు రైతుల పాదయాత్రలో హరీష్‌‌రావు.. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ - Tholi Paluku