
చిన్నకోడూరు పర్యటనలో హరీశ్‌రావు రైల్వే, సాగునీటి పనుల సమీక్ష
సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా రైల్వే లైన్ నిర్మాణం, సాగునీటి కాలువల పనుల పురోగతిని ఆయన స్వయంగా పర్యవేక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో సాగునీటి కాలువల్లో మట్టి పేరుకుపోయిందని, దీనివల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడే ప్రమాదం ఉందని హరీష్ రావు తెలిపారు. వెంటనే కాలువల్లో కూడుకుపోయిన మట్టిని తొలగించి సాగునీటి సరఫరా నిరవధికంగా సాగేలా చర్యలు తీసుకోవాలని రైల్వే, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కాలువలపై నిర్మిస్తున్న రైల్వే బ్రిడ్జ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొంటూ, ఆ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.
రైల్వే లైన్, కాలువల పనుల్లో పరస్పర సమన్వయం లేకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. అందుకే రైల్వే అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పనిచేసి వచ్చే యాసంగి సీజన్‌కు ముందే అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. రైతుల సాగుకు భంగం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
అనంతరం చిన్నకోడూరులో నిర్మించనున్న రైల్వే స్టేషన్ స్థలాన్ని హరీష్ రావు పరిశీలించారు. మండల కేంద్రంలో ఇప్పటికే మంజూరైన రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయితే ప్రాంత అభివృద్ధితో పాటు ప్రజలకు, రైతులకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తంగా రైల్వే లైన్ నిర్మాణం అభివృద్ధికి దోహదపడాలే తప్ప, సాగునీటి వ్యవస్థకు ఆటంకంగా మారకూడదని హరీష్ రావు స్పష్టం చేస్తూ, సంబంధిత శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
