
చిత్తూరు వేదికగా ప్రపంచ రికార్డు: 5,500కుపైగా ఈ-సైకిళ్ల పంపిణీ
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం రెండో రోజు పర్యటన సరికొత్త చరిత్రకు వేదికైంది. పేదల సేవ, మహిళా సాధికారత పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా సాగిన ఈ పర్యటనలో ఒకేసారి 5,555 ఈ-సైకిళ్లను డ్వాక్రా మహిళలకు పంపిణీ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంత పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి కావడంతో గిన్నిస్ ప్రతినిధులు దీనిని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా గిన్నిస్ పత్రాన్ని జిల్లా కలెక్టర్‌కు సీఎం చేతుల మీదుగా అందజేశారు.
పేదల సేవలో ‘ఎన్టీఆర్ భరోసా’
ముందుగా గుడిపల్లె మండలం బెగిలపల్లెలో జరిగిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసి వారితో ముచ్చటించారు. అనంతరం మహిళా శక్తికి చిహ్నంగా 5,555 ఈ-సైకిళ్లను (సూపర్ సైకిల్స్) పంపిణీ చేశారు. బెగిలపల్లె నుంచి శెట్టిపల్లె వరకు వేలాది మంది మహిళలతో కలిసి సీఎం స్వయంగా ఈ-సైకిల్‌పై భారీ ర్యాలీలో పాల్గొనడం పర్యటనకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం కుప్పం ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించారు.. ఇప్పుడు అదే సైకిల్ ద్వారా మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నా అని ఆకాంక్షించారు. ఈ ‘సూపర్ సైకిల్స్’ వల్ల ప్రతి కుటుంబానికి నెలకు రూ.1,500 వరకు ఆదా అవుతుందని, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ ప్రయాణించవచ్చని తెలిపారు. ఇదే వేదికపై ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ లబ్ధిదారులతో పీ4 పథకం కింద బంగారు కుటుంబాలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు.
7 కంపెనీలతో రూ.675 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు
కుప్పం పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రూ.675 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఏడు సంస్థలతో ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూలు కుదిరాయి. ప్లాస్టిక్ ఉత్పత్తులు, గార్మెంట్స్, ఎలక్ట్రానిక్స్, చికెన్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభించనుంది అని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు
