
చిత్తూరు జిల్లాలో విషాదం: అడవి ఏనుగు దాడిలో రైతు మృతి
చిత్తూరు జిల్లాలో మళ్లీ అడవి ఏనుగుల సంచారం ప్రాణాంతకంగా మారింది. కుర్మనుపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున జరిగిన దుర్ఘటనలో ఓ రైతు ఏనుగు తొక్కివేయడంతో మృతి చెందాడు.
పోలీసుల సమాచారం ప్రకారం మృతుడిని కుర్మనుపల్లి గ్రామానికి చెందిన 65 ఏళ్ల కిట్టప్పగా గుర్తించారు. ప్రతిరోజు మాదిరిగా కిట్టప్ప బుధవారం రాత్రి తన వ్యవసాయ పొలంలో నిద్రించడానికి వెళ్లాడు. అర్ధరాత్రి అనంతరం సుమారు మూడు గంటల సమయంలో సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన అడవి ఏనుగు పొలంలోకి చొరబడి, చేనును నాశనం చేయడంతోపాటు అక్కడ నిద్రిస్తున్న కిట్టప్పను తొక్కివేసిందని తెలిపారు.
ఒంటరి ఏనుగు దాడి
కుప్పం డీఎస్పీ బి.పార్థసారథి మాట్లాడుతూ కుర్మనుపల్లి గ్రామంలో ఉదయం ఒక అడవి ఏనుగు రైతు కిట్టప్పపై దాడి చేసింది. జరిగిన దాడిలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఆ ఏనుగు గత కొన్ని రోజులుగా ఆ పరిసర ప్రాంతాల్లో ఒంటరిగా తిరుగుతూ ఉందని స్థానికులు తెలిపారు అని చెప్పారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏనుగు కదలికలను గుర్తించేందుకు ట్రాకింగ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా ఇటీవల చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కుప్పం, పుంగనూరు, బంగారుపాళ్యం మండలాల్లో అడవి ఏనుగుల సంచారం పెరుగుతోంది. గతంలోనూ కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనతో మరోసారి ప్రజల్లో ఆందోళన వ్యాపించింది. స్థానికులు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని, ఏనుగులను అటవీ ప్రాంతాలకే పరిమితం చేసే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
