Let's talk: editor@tmv.in
చిత్తూరులో శరవేగంగా ‘అమరజీవి జలధార’

చిత్తూరులో శరవేగంగా ‘అమరజీవి జలధార’

Pinjari Chand
8 సెప్టెంబర్, 2026

ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.2,370 కోట్లతో చేపట్టిన చిత్తూరు మల్టీ విలేజ్‌ తాగునీటి పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. ‘జల్‌ జీవన్‌ మిషన్‌–అమరజీవి జలధార’ నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా మూడు నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లో 3,163 ఆవాసాలకు తాగునీరు అందించనున్నారు. సుమారు 25 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది.

గండికోట, వెలిగల్లు జలాశయాలను నీటి వనరులుగా వినియోగించనున్నారు. గండికోట వద్ద ఇంటేక్‌ వెల్‌ నిర్మాణం పురోగతిలో ఉండగా.. నాలుగు రా వాటర్‌ సంపుల్లో మూడింటి పనులు వేగంగా జరుగుతున్నాయి. గుర్రంకొండ వద్ద రోజుకు 75 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో, వెలిగల్లు వద్ద 26 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం కొనసాగుతోంది. ఏడు నీటి సంపులు, ఐదు ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, 14 గ్రౌండ్‌ లెవల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు సహా మొత్తం 167 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటివరకు సుమారు 130 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ నిర్మాణం పూర్తయింది.

వారాల వారీగా లక్ష్యాలు

తాగునీటి ప్రాజెక్టుల పనులను వారాంతపు లక్ష్యాలతో వేగవంతం చేయాలని పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. ఏడాది చివరి నాటికి పూర్తి చేయాల్సిన పనులను నెలవారీ, వారాల వారీగా విభజించుకుని నిరంతరం సమీక్షించాలని సూచించారు. గడువులోగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. నిర్మాణంలో నాణ్యతా లోపాలకు తావులేకుండా, దీర్ఘకాలం ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని ఆదేశించారు.

జల్‌ జీవన్‌ మిషన్‌–2.0

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రాన్ని ఒప్పించి జల్‌ జీవన్‌ మిషన్‌ గడువును 2028 వరకు పొడిగించిందని ప్రభుత్వం తెలిపింది. జల్‌ జీవన్‌ మిషన్‌–2.0 కింద రాష్ట్రంలో సుమారు రూ.26 వేల కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టులను చేపడుతున్నారు. తొలి విడతలో రూ.7,910 కోట్లతో ఐదు జిల్లాల్లో ఐదు మెగా వాటర్‌ గ్రిడ్‌ పథకాలను అమలు చేస్తుండగా.. అందులో చిత్తూరు ప్రాజెక్టు కూడా ఉంది.

చిత్తూరులో శరవేగంగా ‘అమరజీవి జలధార’ - Tholi Paluku