
చికున్‌గున్యా డేంజర్ బెల్స్
ఇండియాపై మళ్లీ ఒక కొత్త భయం కమ్ముకుంటోంది. దోమల రక్తంలో ఒక ప్రమాదం దాగుంది. దాని పేరు చికున్‌గున్యా. చిన్న దోమ కాటే కానీ.. దీని ప్రభావం చాలా పెద్దది. ఒకసారి తాకితే శరీరమంతా నొప్పి వస్తుంది. ఎముకలలో మంట పుడుతుంది. చివరకు జ్వరం కూడా వస్తుంది. అయితే ఈ భయం ఇక్కడితో ఆగదు. కొత్త అధ్యయనాల ప్రకారం ఇండియా మరింత డేంజర్‌లో ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ కాలం దీర్ఘ ప్రభావం ఎదుర్కొబోయే దేశంగా భారత్ మారిందని అధ్యయనాలు చెబుతున్నాయ్. సగటున ప్రతి సంవత్సరం 50లక్షల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందని తేలింది.
దీని వల్ల మన ఆరోగ్య వ్యవస్థపై పెద్ద భారం పడనుంది. ఆస్పత్రులు, వైద్యులు, మందులు సరిపోకపోవచ్చు. పరిశోధకులు చేసిన విశ్లేషణ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఒక కోటి 44లక్షల మంది ఈ వ్యాధి బారిన పడే ప్రమాదంలో ఉన్నారు. వారిలో 51 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు. ఇది ఇంతటితో ఆగదని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి మరింత ప్రాంతాలకు విస్తరిస్తే ఈ సంఖ్య మూడు కోట్ల 49 లక్షలకు పెరగవచ్చు. అందులో భారత్‌లోనే ఒక కోటి 21లక్షల వరకు చేరవచ్చని అంచనా. ఇది చిన్న జ్వరం కాదు. ఇది శరీరాన్ని కదలకుండా చేసే వ్యాధి. మొదట జ్వరం వస్తుంది. వెంటనే చేతులు కాళ్లు కదలడం కష్టమవుతుంది. కొంతమంది కొన్ని వారాల్లో కోలుకుంటారు. కానీ చాలా మందికి ఆ నొప్పి నెలల పాటు కొనసాగుతుంది. కొందరికి జీవితాంతం ఉంటుంది. అర్ధరాత్రి కాళ్లు మండిపోతాయి. ఉదయం వేళ నడక కష్టమవుతుంది. ఇది మానసికంగా కూడా కుంగ తీస్తుంది.
ఇది వ్యాపించేది మనిషి నుంచి కాదు, దోమ నుంచి. ఆ దోమ పేరు ఎడిస్ ఏజిప్టి. ఇది చికున్‌గున్యా వైరస్‌ను మోసుకెళ్తుంది. వర్షాకాలం, నిల్వ నీరు, మురికి గుంటలు వీటికి ఇష్టమైన స్థలాలు. ఒక చుక్క నీటిలోనే ఇవి జన్మిస్తాయి. మన ఇంటి కుండీలు, బాటిల్లు, టైర్లలో నిల్వ నీరు ఉంటే చాలు, కొత్త దోమలు పుడతాయి. అందుకే ప్రతి ఇల్లు జాగ్రత్తగా ఉండాలి. వైరస్ బారిన పడిన వారిలో సగానికి పైగా దీర్ఘకాలిక బాధలో ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. మోకాళ్లు, వెన్ను..ఇలా ప్రతి చోట గుచ్చినట్టుగా నొప్పి ఉంటుంది. ప్రాణాపాయం తక్కువ ఉన్నా, దీని బాధ భరించడం అంత సులభం కాదు. దోమల నియంత్రణ లేకపోతే ఇది దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలోని పెద్ద పరిశోధన సంస్థలు కలిసి ఒక మెషీన్ మోడల్ తయారు చేశాయి. దానిలో వాతావరణం, దోమల సంఖ్య, ఉష్ణోగ్రతలు, వర్షపాతం, ఆర్థిక స్థితి లాంటివి కలిపి లెక్కించారు. అందులో ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా ప్రమాద దేశాలుగా కనిపించాయి. ఈ మూడు దేశాలు కలిపి ప్రపంచ మొత్తం చికున్‌గున్యా భారంలో దాదాపు సగం భాగం కలిగి ఉన్నాయి.
ఇక చికున్‌గున్యాకు ఇప్పటివరకు ప్రత్యేకమైన మందు లేదు. వైరస్‌ను చంపే మందు లేదు. ఉన్నది కేవలం సహాయక చికిత్స మాత్రమే. జ్వరం తగ్గించడం, విశ్రాంతి ఇవ్వడం, నీరు ఎక్కువగా తాగడం, పోషకాహారం తీసుకోవడం మాత్రమే చేయాలి. కొన్ని దేశాల్లో టీకాలు ప్రారంభమైనా ఇంకా పెద్ద స్థాయిలో అందుబాటులో లేవు. ఇండియాలో అవగాహన, నివారణ చర్యలు, ప్రజల జాగ్రత్తలే ప్రధాన ఆయుధాలు. ఈ వ్యాధి భయం కేవలం ఉష్ణమండల దేశాలకు మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు దోమలకు కొత్త ప్రాంతాలు ఇస్తున్నాయి. చల్లని దేశాల్లో కూడా ఇప్పుడు ఇవి విస్తరిస్తున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి. దోమల పెంపకానికి అవకాశం ఇవ్వకూడదు. వర్షం వచ్చిన రోజుల్లో ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రత పాటించేలా చూసుకోవాలి. శరీరంలో జ్వరం, నొప్పి, వణుకు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ఇలా ప్రతి మనిషి ఒక చిన్న మార్పు చేస్తే పెద్ద వ్యాధి తగ్గిపోతుంది. లేదంటే మీరు కూడా డేంజర్ పడినట్టే..!
