
చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం
శుక్రవారం తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వద్ద పెను విషాదం చోటుచేసుకుంది. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులోని తులసిపాకల మలుపు వద్ద విఘ్నేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అదుపు తప్పి సుమారు 20 అడుగుల లోతున్న లోయలో పడి బోల్తా కొట్టింది.
అసలేం జరిగింది?
చింతూరు ప్రాంతానికి చెందిన 35 మంది యాత్రికులు అరకు సందర్శన పూర్తి చేసుకుని, భద్రాచలంలోని శ్రీరామ ఆలయాన్ని దర్శించుకునేందుకు వెళ్తుండగా వెళ్తుండగా ఈ విషాదం జరిగింది. శుక్రవారం ఉదయం 4.30 గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచు ఆవరించిన సమయంలో డ్రైవర్ ఘాట్ రోడ్డులోని ప్రమాదకరమైన మలుపును అంచనా వేయలేకపోయాడు. బస్సు నియంత్రణ కోల్పోయి, వాహనాలు లోయలో పడకుండా నిర్మించిన 'చైనా వాల్'ను ఢీకొట్టి, కింద ఉన్న రహదారి పక్కన సుమారు 20 అడుగుల లోతులో బోల్తా పడింది. కాగా ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 9 మంది యాత్రికులు ప్రమాద ప్రాంతంలోనే దుర్మరణం చెందారు. మరో 23 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ఈ బస్సులో చిత్తూరు జిల్లాకు చెందిన కురబలకోట, పలమనేరు పరిసర మండలాలకు చెందిన మొత్తం 35 మంది యాత్రికులు ఉన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు.
ఇక సమాచారం అందుకున్న ఎస్పీ అమిత్ బర్దార్ నేతృత్వంలో పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి, తీవ్రంగా గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై మోతుగూడెం పోలీస్ స్టేషన్ బీఎన్‌ఎస్ సెక్షన్ 106 నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖుల సంతాపం
ఈ ఘోర ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. గాయపడిన వారికి కూడా రాష్ట్రం రూ. 2 లక్షలు, కేంద్రం రూ. 50,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించాయి.
