Let's talk: editor@tmv.in
చార్మినార్ రాజసానికి నిలువుటద్దం

చార్మినార్ రాజసానికి నిలువుటద్దం

Dantu Vijaya Lakshmi Prasanna
10 జనవరి, 2026

హైదరాబాద్ నగరానికే తలమానికం, చారిత్రక వారసత్వానికి చిహ్నం చార్మినార్. 1591లో నిర్మించబడిన ఈ అద్భుత కట్టడం, కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. నిజాం కాలం నాటి సంస్కృతికి, రాజసానికి నిలువుటద్దం. నగరం నడిబొడ్డున నాలుగు భవ్యమైన మినార్లతో అలరారుతున్న ఈ కట్టడం, అటు వాస్తుశిల్ప ప్రేమికులను, ఇటు చరిత్ర జిజ్ఞాసువులను ఎంతో ఆకట్టుకుంటుంది. చార్మినార్ చుట్టూ ఉండే కిటకిటలాడే మార్కెట్లు, నోరూరించే బిర్యానీ సువాసనలు, ముత్యాల హారాల సందడి పర్యాటకులకు ఒక విలక్షణమైన అనుభూతిని అందిస్తాయి.

చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతం హైదరాబాద్ సంస్కృతికి, చరిత్రకు అసలైన చిరునామా. చార్మినార్ సందర్శించినప్పుడు తప్పకుండా చూడవలసిన ఇతర ముఖ్యమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఒక్కరోజు పర్యటనగా చార్మినార్ సందర్శించాలనుకునేవారికి మక్కా మసీదు, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం, పాతబస్తీ రుచులు ఆహ్వానం పలుకుతాయి.

చార్మినార్‌ చరిత్ర

చార్మినార్‌ను 1591లో సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. నాలుగు స్తంభాలు అద్భుతమైన చెక్కడాలతో కూడిన ఈ చదరపు ఆకారపు కట్టడాన్ని ఆయన తన భార్య భాగమతి గౌరవార్థం నిర్మించారని చెబుతారు. అయితే, దీని నిర్మాణానికి గల అసలు కారణంపై భిన్నమైన కథనాలు ఉన్నాయి.

ప్లేగు వ్యాధి నిర్మూలన:

అత్యంత ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం, ఆ సమయంలో నగరాన్ని వణికించిన ప్లేగు వ్యాధి అంతమైనందుకు గుర్తుగా దీనిని నిర్మించారు. ప్రజల కష్టాలు తీరాలని సుల్తాన్ చేసిన ప్రార్థనలు ఫలించడంతో, అల్లాకు కృతజ్ఞతగా ఆయన చార్మినార్‌ను నిర్మించారని నమ్ముతారు. ఇందులోని నాలుగు స్తంభాలు ఇస్లాంలోని మొదటి నలుగురు ఖలీఫాలకు అంకితం చేయబడ్డాయని అంటారు.

షీయా తాజియా నమూనా:

ఇది కర్బలా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ప్రవక్త ముహమ్మద్ అల్లుడి జ్ఞాపకార్థం షీయా 'తాజియా' ఆకృతిలో నిర్మించబడిందని కొందరు అంటారు. మరికొందరు, సుల్తాన్ తన ప్రేయసి భాగమతిని మొదటిసారి ఇక్కడే చూశారని నమ్ముతారు.

17వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచ్ యాత్రికుడు జీన్ డి థెవెనోట్, పర్షియన్ గ్రంథాల ప్రకారం, రెండవ ఇస్లామిక్ సహస్రాబ్ది ప్రారంభాన్ని పురస్కరించుకుని దీనిని నిర్మించారు.

నగర స్థాపన:

దీని పునాది రాయిపై ఉన్న శాసనం ప్రకారం, "నదిని చేపలతో నింపినట్లుగా, నా ఈ నగరాన్ని ప్రజలతో నింపు స్వామి" అని ఉంది. అంటే నగరాన్ని నిర్మించే క్రమంలో దీనిని ఒక కేంద్ర బిందువుగా చరిత్రకారుడు మహమ్మద్ సఫీవుల్లా పేర్కొన్నారు.

నిర్మాణం మరమ్మతులు

దీని నిర్మాణం 1589లో ప్రారంభమై రెండు ఏళ్లలో పూర్తయింది. అప్పట్లో దీనికి 9 లక్షల రూపాయలు (సుమారు 2 లక్షల హున్లు/బంగారు నాణేలు) ఖర్చయ్యాయి. ఇది సుమారు 14,000 టన్నుల బరువుతో, 30 అడుగుల లోతైన పునాదిని కలిగి ఉంది.

1670లో పిడుగు పడటం వల్ల ఒక మినార్ కూలిపోగా, దానిని 58,000 రూపాయలతో బాగు చేశారు. 1820లో సికిందర్ జా 2 లక్షల రూపాయలతో దీనికి మరమ్మతులు చేయించారు. చార్మినార్ నుండి గోల్కొండ కోట వరకు ఒక రహస్య సొరంగం ఉందని, రాజకుటుంబీకులు అత్యవసర సమయాల్లో తప్పించుకోవడానికి దీనిని నిర్మించారని ఒక కథనం ఉంది. అయితే ఇప్పటి వరకు అలాంటి సొరంగం ఏదీ లభించలేదు.

చార్మినార్ వాస్తుశిల్పం

హైదరాబాద్‌లో స్థిరపడిన ఇరానియన్ వాస్తుశిల్పి మీర్ మోమిన్ అస్త్రావాడి చార్మినార్‌ను డిజైన్ చేశారు. కాలపరీక్షకు నిలబడి ఈ కట్టడం నేటికీ గంభీరంగా కనిపిస్తుంది.

ఇది గ్రానైట్, సున్నపు మిశ్రమంతో నిర్మించబడింది. దీని వైశాల్యం ప్రతి వైపు 20 మీటర్లు ఉంటుంది. చార్మినార్‌లోని నాలుగు స్తంభాల ఎత్తు 48.7 మీటర్లు. ఇవి నాలుగు అంతస్తులుగా విభజించబడి, అద్భుతమైన చెక్కడాలతో కూడిన వలయాలను కలిగి ఉంటాయి. పై అంతస్తుకు చేరుకోవడానికి 149 మెట్లు ఉంటాయి. పై అంతస్తులో పశ్చిమ దిశలో ఒక మసీదు ఉంది, ఇది హైదరాబాద్‌లోనే అత్యంత పాత మసీదుగాపేరుగాంచింది. . ఇక్కడ 45 ప్రార్థనా స్థలాలు (ముసల్లా) ఉన్నాయి. మధ్యలో ప్రార్థనకు ముందు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి (వజు) ఒక చిన్న నీటి కుండీ, ఫౌంటెన్ ఉన్నాయి. స్తంభాల నిర్మాణం తామర ఆకు ఆకృతిని పోలి ఉంటుంది, ఇది కుతుబ్ షాహీ వాస్తుశిల్ప శైలికి నిదర్శనం. 1889లో దీని నాలుగు వైపులా గడియారాలను అమర్చారు.

మక్కా మసీదు

చార్మినార్‌కు అతి సమీపంలో ఉన్న ఈ మసీదు ప్రపంచంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి. దీని నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలను మక్కా నుండి తెచ్చిన మట్టితో తయారు చేశారని చెబుతారు, అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. దీని విశాలమైన ప్రాంగణం అద్భుతమైన ఆర్చ్‌లు ఆశ్చర్యపరుస్తాయి. దీని నిర్మాణాన్ని 1617లో గోల్కొండ ఐదవ సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రారంభించారు. అయితే, దీని నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 77 ఏళ్లు పట్టింది. 1694లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో ఈ మసీదు నిర్మాణం పూర్తయింది. ఇస్లాం మత పవిత్ర స్థలమైన 'మక్కా' నుండి తెచ్చిన మట్టితో ఈ మసీదులోని మధ్య ఆర్చ్ ఇటుకలను తయారు చేశారు. అందుకే దీనికి 'మక్కా మసీదు' అని పేరు వచ్చింది.

మక్కా మసీదు పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడింది. దీని నిర్మాణ శైలి సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తుంది. మసీదు ప్రధాన హాల్ 75 అడుగుల ఎత్తు, 220 అడుగుల వెడల్పు, 180 అడుగుల పొడవు ఉంటుంది. ఇందులో ఒకేసారి సుమారు 10,000 మంది నమాజ్ చేసుకోవచ్చు. ప్రధాన ప్రార్థనా మందిరంలో ఐదు వైపులా అద్భుతమైన ఆర్చ్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఏకశిలా గ్రానైట్ స్తంభాలపై ఆధారపడి ఉన్నాయి. మసీదు గోడలపై ఆర్చ్‌ల పైభాగంలో ఖురాన్ వాక్యాలను అత్యంత అందంగా చెక్కారు.

ఆసిఫ్ జాహీ వంశీయుల సమాధులు

మసీదు ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున ఒక పెద్ద ప్రాంగణం ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్‌ను పాలించిన నిజాం ప్రభువుల (ఆసిఫ్ జాహీ వంశీయుల) సమాధులు ఉన్నాయి. ఒకే వరుసలో ఉన్న ఈ పాలరాతి సమాధులు చారిత్రక ప్రాధాన్యత కలిగినవి. మసీదు ముందు భాగంలో ఒక పెద్ద నీటి కుండీ ఉంటుంది. ప్రార్థనకు ముందు భక్తులు ఇక్కడ శుద్ధి చేసుకుంటారు. మక్కా మసీదు ప్రాంగణంలో రెండు నల్లటి రాతి బెంచీలు ఉంటాయి. వీటిపై కూర్చున్న వారు మళ్లీ తప్పకుండా హైదరాబాద్‌కు వస్తారని ఒక స్థానిక నమ్మకం ఉంది.

సందర్శకులకు సూచనలు:

ప్రతిరోజూ ఉదయం 4:00 నుండి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటుంది (ప్రార్థనా సమయాల్లో పర్యాటకులకు అనుమతి పరిమితంగా ఉంటుంది). ఇది పవిత్రమైన మతపరమైన స్థలం కాబట్టి, సందర్శకులు సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించాలి (మహిళలు తలపై స్కార్ఫ్ లేదా చున్నీ ధరించడం మంచిది). ప్రవేశం ఉచితం.

లాడ్ బజార్

దీనినే 'చుడీ బజార్' అని కూడా పిలుస్తారు. చార్మినార్‌కు పశ్చిమ దిశలో ఉన్న లాడ్ బజార్, దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైన, రంగులమయమైన మార్కెట్. ఈ బజార్ ప్రపంచవ్యాప్తంగా తన అద్భుతమైన లాక్ గాజులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రాళ్లతో పొదిగిన గాజులు స్థానిక కళాకారుల నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలుస్తాయి. నిజాంల కాలం నుండి కొనసాగుతున్న ఈ మార్కెట్‌లో గాజులతో పాటు ముత్యాలు, జరీ పనులు చేసిన వస్త్రాలు, అత్తరు, సాంప్రదాయ ఆభరణాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ కాంతుల మధ్య మెరిసిపోయే ఈ వీధులు, పాతబస్తీ సంస్కృతిని, సందడిని ప్రతిబింబిస్తూ షాపింగ్ ప్రియులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.

చౌమహల్లా ప్యాలెస్

చార్మినార్ నుండి సుమారు 10-15 నిమిషాల నడక దూరంలో ఉన్న ఈ ప్యాలెస్ నిజాం ప్రభువుల నివాసం. పర్షియన్, రాజస్థానీ శైలిలో నిర్మించబడిన ఈ రాజభవనం, అందమైన తోటలు, విలాసవంతమైన దర్బార్ హాల్, పాతకాలపు కార్ల ప్రదర్శనతో పర్యాటకులను రాజ కాలానికి తీసుకెళ్తుంది.

దీని నిర్మాణం 1750లో ఆసిఫ్ జా II కాలంలో ప్రారంభమైంది, కానీ 1857 నుండి 1869 మధ్య కాలంలో ఐదవ ఆసిఫ్ జా (అఫ్జల్-ఉద్-దౌలా) హయాంలో పూర్తయింది. ఉర్దూ, పర్షియన్ భాషలలో 'చౌ' అంటే నాలుగు, 'మహల్లా' అంటే రాజభవనాలు అని అర్థం. అంటే నాలుగు రాజభవనాల సమూహం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ ప్యాలెస్ పర్షియన్, ఇండో-సార్సెనిక్, రాజస్థానీ, యూరోపియన్ నిర్మాణ శైలుల అద్భుతమైన కలయికతో ఉంటుంది. ఇక్కడి అఫ్జల్ మహల్, మహ్తాబ్ మహల్, తహ్నియత్ మహల్ అఫ్తాబ్ మహల్ అనే నాలుగు భవనాలు ప్రధాన ఆకర్షణలు.

ఖిల్వత్ ముబారక్ (దర్బార్ హాల్):

ఇది ఈ ప్యాలెస్‌లోనే అత్యంత ప్రధానమైన భాగం. నిజాం ప్రభువుల పట్టాభిషేకాలు అధికారిక వేడుకలు ఇక్కడే జరిగేవి. ఇక్కడి భారీ బెల్జియం గ్లాస్ షాండ్లియర్లు, పాలరాతి వేదిక రాజసానికి చిహ్నాలు.

ప్యాలెస్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న గడియారం దాదాపు 250 ఏళ్ల నుంచి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ప్రస్తుతం ఇది ఒక మ్యూజియంగా మార్చబడింది. ఇందులో నిజాంలు వాడిన విలాసవంతమైన వింటేజ్ కార్లు (ముఖ్యంగా రోల్స్ రాయిస్), ఆయుధాలు, వస్త్రాలు, నాణేలు, అరుదైన పెయింటింగ్స్‌ను సందర్శకులు చూడవచ్చు. ఈ ప్యాలెస్ యొక్క పునరుద్ధరణ మరియు సంరక్షణకు గాను 2010లోయూనెస్కో ఆసియా-పసిఫిక్ హెరిటేజ్ మెరిట్ అవార్డు లభించింది. ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి సాయంత్రం 5:00 వరకు (శుక్రవారం సెలవు).

సాలార్ జంగ్ మ్యూజియం ఇది మూసీ నది ఒడ్డున ఉంది. ఒకే వ్యక్తి సేకరించిన ప్రపంచంలోని అతిపెద్ద కళాఖండాల సేకరణగా ఇది గుర్తింపు పొందింది. ఇక్కడి 'మ్యూజికల్ క్లాక్' 'వెయిల్డ్ రెబెక్కా' (ముసుగు వేసుకున్న మార్బుల్ విగ్రహం) పర్యాటకులు మిస్ అవ్వకూడని అద్భుతాలు.

నిజాం మ్యూజియం

పురానీ హవేలీలో ఉన్న ఈ మ్యూజియంలో చివరి నిజాంకు అందిన బహుమతులు, ఆయన వాడిన అతిపెద్ద వార్డ్‌రోబ్ (బట్టల అలమర) మరియు వెండితో చేసిన హైదరాబాద్ నగర నమూనా వంటివి చూడవచ్చు.

పాతబస్తీ రుచులు

చార్మినార్ పర్యటన ఇరానీ చాయ్ మరియు ఉస్మానియా బిస్కెట్లతో మొదలై, అక్కడి ప్రసిద్ధ హైదరాబాదీ బిర్యానీ లేదా నిమ్రా కేఫ్ లో చాయ్‌తో ముగిస్తేనే సంపూర్ణమవుతుంది. చార్మినార్ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయి, కాబట్టి ఉదయం వేళల్లో సందర్శించడం ఉత్తమం.