
చారిత్రక వైభవాన్ని దాచుకున్న తెలంగాణ స్టేట్ మ్యూజియం
భారతదేశపు ఇతర ప్రదేశాలతో సమానంగా తూగ గలిగిన చరిత్ర తెలంగాణకు ఉంది. దిగువ రాతియుగానికి చెందిన సాంకేతిక సాంప్రదాయక పనిముట్లు, ఆవాస స్థలాలు రాష్ట్రంలోని పెద్దపల్లి తాలూకా రామగుండం, గోదావరి ఖనిలలో లభ్యమయ్యాయి.నిశితంగా పరిశీలిస్తే అన్ని జిల్లాలలో లభించిన అవశేషాల వల్ల మానవ నాగరికత ప్రగతి ప లో ప్రధాన భూమిక వహించిన పాత, మధ్య, నవీన శిలా యుగాల సంస్కృతులకు తెలంగాణ కూడా ఒక కేంద్ర బిందువు అని చెప్పవచ్చు. తర్వాత కాలంలో జనపదాల ఏర్పాటులో అనగా ఆరవ శతాబ్దంలో తెలంగాణ ప్రముఖ పాత్ర వహించింది.ఆనాటి ప్రముఖ జనపదాలలో “అస్మక జనపదం” నిజామాబాద్ ప్రాంతంలోని బోధన్ రాజధానిగా చేసుకుని ఉండేదని చరిత్ర స్పష్టం చేసింది.అలాగే మౌర్యుల కాలంలో దక్షిణాపద వర్తక వాణిజ్యాలు కౌటిల్యుని అర్థశాస్త్రం వివరిస్తుంది.
తెలంగాణలో కొండాపూర్ శాతవాహనుల టంకశాల నగరం- ఇక్కడ అనేక నాణాలు లభించాయి . వరంగల్ సమీపంలో కూడా సాధ్వవాహన పేరుతో కొన్ని నాణాలు లభ్యమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు లో రెండవ పులికేశి వేయించిన శాసనంలో చాళుక్య విశేషాలు ప్రస్తావించబడ్డాయి. చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన భవభూతి 7, 8 శతాబ్దాలలో తెలంగాణలో వర్ధిల్లాడు. రాష్ట్ర కూటల సామంతులు క్రీస్తు శకం 750- 953 కాలంలో బోధన్ లోని వేములవాడను పాలించారు. నల్గొండ కొలనుపాక ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల ప్రస్తావన ఆనాటి చాళుక్యుల శాసనాల్లో విరివిగా ఉంది .కళ్యాణి చాళుక్యులు, పోలావాసి నాయకులు, కుందూరు చోళులు పాలన ,తర్వాతి కాలంలో కుతుబ్ షా హీలు, అసఫ్ జాహీల చరిత్ర తెలంగాణ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితుల పరిణామాలు తెలంగాణ చరిత్రకు ఉనికిని తెచ్చిపెట్టాయి. ఇవన్నీ వారు వేయించిన శాసనాలు , నాణాలు. వాడిన వస్తువులు, వ్రాసిన గ్రంథాల వల్ల తెలుస్తుంది. మరి వాటిని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరిపించి పరిశీలించి, పరిశోధించి విభిన్న పద్ధతిలో వాటిని భద్రపరిచిన విభాగం మాత్రం ఈ మ్యూజియంలే అని నిష్పక్షపాతంగా చెప్పవచ్చు.
తెలంగాణ ప్రాంతంలో అందుబాటులో ఉన్న మ్యూజియంలు:
• తెలంగాణ స్టేట్ మ్యూజియం
• సాలార్జంగ్ మ్యూజియం
• బి. ఎమ్. బిర్లా మ్యూజియం
• హెరిటేజ్ మ్యూజియం
ఇవన్నీ తెలంగాణ చరిత్రతో పాటు భారతదేశ చరిత్రను ముందు తరాలకు పరిచయం చేస్తున్నాయి.తెలంగాణ స్టేట్ మ్యూజియం, హెరిటేజ్ మ్యూజియం లాంటివి స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుండగా సాలార్జంగ్ మ్యూజియం సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది.
తెలంగాణ స్టేట్ మ్యూజియం నిర్మాణం -చరిత్ర
1928 లో నిజాO VII మీరు ఉస్మాన్ అలీ ఖాన్ తన మనవరాలు కోసం దీని నిర్మించారని చరిత్రకారుల అభిప్రాయం.
• ఈ మ్యూజియం నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియం గా కొనసాగుతూ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది.
• దీన్ని సందర్శించడానికి నిరంతరం ఔత్సాహికులు విద్యార్థులు పర్యాటకులు వస్తుంటారు.
• మ్యూజియం ఆవరణలో ప్రత్యేక ఆకర్షణలు గా పచ్చని ప్రకృతి రమణీయతతో పాటు
అందమైన కొలను, పార్క్, వాకింగ్ వే ఆహ్లాదకరమైన వాతావరణంలో దీని పరిసరాలు సందర్శకులకు ఉత్తేజాన్ని కలగజేస్తాయి.
• ఈ మ్యూజియం చాళుక్య అజంతా శిల్ప శైలితో మరియు అరబిక్ శైలితో నిర్మించారు.
• మ్యూజియం ప్రాంగణంలో 11వ శతాబ్దానికి చెందిన కాకతీయ తోరణాలు నాలుగు స్తంభాలతో కూడిన మండపం ఉంది. ఆ మండపంలో శిల్పకళ చూపూరులను ఆకట్టుకుంటుంది. మండపం లోపల విష్ణు బ్రహ్మ శిల్పాలు మదనికా శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి.
• బయట ఆవరణలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి రధమును కూడా చూడవచ్చు. ఇది పూర్తిగా దారువుతో చేసిన గొప్ప శిలాకృతులు కలిగిన రధము.
• మ్యూజియం భవనం చుట్టూ హుయాసాలుల కాలంనాటి శిల్పాలు మొత్తం నగలు అలంకరణతో కనిపిస్తాయి. వీరికి సమకాలీనులుగా ఉన్న కాకతీయుల కాలంనాటి శిల్పాలు, స్తంభాలు, కట్టడాలు, ఆలయాలపై కూడా స్త్రీమూర్తులు దేవతామూర్తులు విగ్రహాలు ఆభరణాల అలంకరణతో కనిపిస్తాయి. కాకతీయుల మండపంపై చతుర్ముఖ బ్రహ్మ విష్ణు యొక్క శిల్పాలు స్తంభాలపై మదనికల శిల్పాలు రమణీయంగా కనిపిస్తాయి. శిల్పాలపై చెక్కబడిన మకుటాలను బట్టి కాకతీయుల కాలంనాటి శిల్పాలను పోల్చవచ్చు.
ప్రతిమ లక్షణం: అనగా ఐక్నోగ్రఫీ. దీన్ని బట్టి కూడా శిల్పాలను వాటి కాలాలను అంచనా వేయవచ్చు. మ్యూజియం చుట్టూ ఉన్న ప్రాంగణంలో వీరగల్లుల చిత్రాలు ఉన్నాయి. ఇవి రాష్ట్ర నలుమూలల నుండి సేకరించబడ్డాయి. వీటిని (హీరో స్టోన్స్) వీరగల్లులు అని అంటారు. వీర గల్లులు అనగా రాజు కోసం రాజ్యం కోసం ప్రాణాలు ఇచ్చే వారట. ఉదాహరణకి ఏదైనా ఉత్సవాల్లో రథం కదలక పోతే ఒక వీరుడు తన శిరస్సును ఖండించుకుని దేవునికి బలిదానంగా తనని తాను సమర్పించుకుంటే వీరిని వీర గల్లులుగా కీర్తిస్తారు. అలాగే రాజ్య రక్షణలో వీరు ముందుండేవారు. అలాంటి నిజాయితీ గల రాజ భక్తులే చరిత్రలో వీర గల్లులుగా శాసనాలలో నిలిచిపోయారని చరిత్రకారుల అభిప్రాయం
వీరగల్లులు (హీరో స్టోన్స్)
వీరు శైవ భక్తులు వీరు అలంకరణ ప్రత్యేకంగా వుంటుంది.
• మెడలో రుద్రాక్షలు ధరిస్తారు. కుచ్చిళ్ళు కలిగిన వస్త్రధారణతో ఉదర బంధనం, తలపై శివలింగాకృతి తలకట్టుతో కనిపిస్తారు. వీటిని బట్టి ఈ వీర గల్లులను పోల్చుకోవచ్చు. వీరు స్వర్గానికి చేరుకున్నారు అనేందుకు గుర్తుగా పైన సూర్య చంద్రులు, స్త్రీ మూర్తి శిల్పం ఆ శాసనం పై చెక్కబడి ఉంటాయి . వీరి త్యాగాన్ని గుర్తించి ఈ శిలలను ఊరు శివారులలో ఊరి నడిబొడ్డున నెలకొల్పేవారట. ఇప్పటికీ పలు ప్రాంతాలలో ఈ వీరగల్లుల శిల్పాలు రాతిపై చెక్కబడి దర్శనమిస్తాయి.
• ఈ ప్రాంగణంలోనే విష్ణువు, చతుర్ముఖ బ్రహ్మ, నరసింహమూర్తి ,లక్ష్మీదేవి మహిషాసుర మర్దిని శిల్పాలు (13 వ శతాబ్దానికి చెందినవి) ఉన్నవి. దుర్గాదేవి విగ్రహం కుచబంధంగా( కూర్చున్న ఆసనం) మరియు నాగబంధం లాంటి కిరీటం కలిగి ఉంటుంది. వీటన్నింటిని వాటి వాటి శైలిని బట్టి ఆకృతులను బట్టి గుర్తించవచ్చు.
• ప్రతి ఒక్కరూ వీటిని గురించి తెలుసుకోవడానికి వీలుగా ఈ శిల్ప ప్రతిమల పక్కన చిత్రానికి సంబంధించిన సమాచారము ఏర్పాటు చేశారు. మ్యూజియం వెనక భాగమున నిజాం ఆలీ ఖాన్ నాటి కంచు ఫిరంగులు ఒకేచోట చేర్చబడి ఉన్నాయి. ఇవి బ్రిటిష్ వారి కాలంలో కోట గోడలను బద్దలు కొట్టడానికి ఉపయోగించేవారు.
శాసనాలు:
మ్యూజియంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అరబిక్ భాషలోనూ, ఉర్దూ భాషలోనూ, తెలుగు భాషలోనూ అనేక శాసనాలను భద్రపరిచారు. వీటి ఆధారంగా కందూరు చోళుల భాషకు చెందిన శాసనాలు, చాళుక్యుల శాసనాలు వారి భాష అభివృద్ధి ఆ కాలంనాటి రాజకీయ సాంఘిక విశేషాలు వారు చేసిన యుద్ధాలు దానాలు తెలుస్తాయి. కుతుబ్షాహీలు,అసఫ్జాహీల అరబ్బు,ఉర్దూ శాసనాలను కూడా ఇక్కడ చూడవచ్చు. మ్యూజియంలో కళ్యాణి చాళుక్యులు శాసనాలు గుర్తించడానికి వీలుగా శాసనాల మొదటి భాగంలో అర్థచంద్రాకారంలో చందమామ శివుడు నంది బొమ్మలు ఉంటాయి . వీటి ఆధారంగా నాటి భాష లిపి యొక్క పరిణితిని తెలుసుకోవచ్చు రెండు విభాగాలుగా ఈ శాసనాలను ప్రదర్శనకు ఉంచారు.
బౌద్ధ స్తూపం:
• విశాఖలోని భావికొండ వద్ద జరిగిన త్రవ్వకాల్లో లభించిన బుద్ధుని అస్థికలు ఇక్కడ భద్రపరిచారు. ఆ కాలంనాటి వజ్రము, బంగారం, వెండి వస్తువులు , మట్టి పాత్రలు ఇక్కడ చూడవచ్చు.
• ఈ అస్థికలు ఉంచిన ప్రదేశం చుట్టూ స్తూప నిర్మాణాన్ని అనుసరించి అద్దంతో నిర్మించిన కట్టడము స్థూప దర్శనాన్ని కలిగిస్తుంది. బుద్ధుని చరిత్రకు సంబంధించిన మరియు బుద్ధుని శిల్పాలు అవశేషాలు లభించిన ప్రాంతాలతో కూడిన అంశాలను ఈ ప్రదేశంలోని గోడలపై అందరూ తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు.
• శారీరక స్తూపం, ఉద్దేశక స్తూపం, పారబోగిక స్తూపం యొక్క వివరణ ఇక్కడ గోడలపై చక్కగా వివరించి ఉంటుంది. శ్రీకాకుళం జిల్లా, ప్రకాశం జిల్లా, ఉప్పుగూడూరు, అమరావతిలో లభించిన వస్తువుల విషయాలతో కూడిన పట్టికలు ఇక్కడ అమర్చారు.
• అమరావతిలో శాతవాహనులు వారి రాష్ట్ర చిహ్నంగా ఏర్పాటు చేసుకున్న పూర్ణకుంభం ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం ఈ పూర్ణకుంభం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చిహ్నంగా ఉంది.ఇక్కడ పూర్ణకుంభం యొక్క దారు శిల్పం.
• మహాయానం,వజ్రయానం గురించిన విశ్లేషణ ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రకాశం జిల్లాలో లైమ్ స్టోన్ లభిస్తుందని విషయం ఇక్కడ ఉన్న ఆధారాలను బట్టి తెలుసుకోవచ్చు. ప్రకాశం జిల్లా చిదంబరంలో లభించిన ద్వారం కి సంబందించిన పైకప్పు ,ఉప్పుకొందూరులో లభించినపై కప్పు కు సంబంధించిన నిర్మాణ శైలి ఇక్కడ మొదటి గదిలో చూడవచ్చు. మరోపక్క గాంధార శిల్పకళకు సంబంధించిన శిల్పాలు, బుద్ధుని శిల్పాలు, తోరణాలు ఇక్కడ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.
అజంతా శిల్పాల చిత్రమాలికల గ్యాలరీ:
• నిజాం రాజు కోరిక మేరకు ఖాన్ బహదూర్ సయ్యద్ అహ్మద్ మహమ్మద్ జలాలుద్దీన్ అజంతా శిల్పాలను పెయింటింగ్స్ ను ఉన్నది ఉన్నట్లుగా వెయ్యిoచాలని లండన్ లో ఉన్న ఫేమస్ ఆర్టిస్ట్ హేరింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఈ చిత్రాలను వేశారు.
• అజంతా చిత్రాలలో శిరోజాలంకరణ ప్రత్యేక ఆకర్షణ వీటితోపాటు పర్షియన్ టోపీలు ఈ చిత్రంలో చూడవచ్చు. మొదటి అంతస్తులో ఉన్న గ్యాలరీ చూపురులను కళా ప్రేమికులను ఆకర్షిస్తుంది. బుద్ధిని జాతక కధలతో కూడిన ఈ చిత్రాలు అత్యంత అద్భుతమని చెప్పవచ్చు.
• మహామాయ ఒకటవ గుహలో ఉన్న శిల్పం ప్రధాన ఆకర్షణ గల చిత్రం. ముఖ్య జాతక కథల చిత్రాలైన ఒకటవ గృహలో ని విధుల పండిత జాతకము,మహాజనక జాతకము చాంపేయ జాతకముఇక్కడ ప్రత్యేక ఆకర్షణలు.
• 17వ గుహలోని మాతృ పోషక జాతకము,మృగజాతకము, హంసజాతకము ధర్మ చక్ర ప్రవచనముద్ర, గాలిలో తేలుతున్న గంధర్వుడు, సింహ కళా వదన జాతకము, ఆకాశంలో విహరించిన అప్సరసలు, అద్దంలో చూసుకుంటున్న అప్సరసలు, 18వ గుహలోని ఇంద్రావతారం, 10వ గుహలోని బోధివృక్ష ఆరాధన ముఖ్యమైన జాతకధలు ఇక్కడ మ్యూజియమ్ లో చూడవచ్చు.
• బుద్ధుడు తన భార్య యశోద కొరకు భిక్షాటన కొరకు వచ్చిన చిత్రం 17వ గుహలో ఉంది.
• మూర్చ పోయిన సుందరి( ఏనుగుల గుంపు దంతాలు తీసుకుని సైనికులు వస్తే వాటిని చూసి మహారాణి మూర్చ పోయినట్లు ఉన్న చిత్రం) ఇక్కడ ఉన్న చిత్రాలలో అత్యద్భుతమైనది.
• ఇవన్నీ వాకాటుకుల కాలంలో నిర్మించిన గుహలలోని శిల్పాలు వీటిని అత్యంత రమణీయంగా చిత్రమాలికలుగా కళ్ళకు కట్టినట్లు తమ చిత్రలేఖ నైపుణ్యంతో చిత్రకారులు వేసినవి. వీటన్నింటిలో బోధిసత్వని పద్మపాణి చిత్రం అత్యంత రమణీయం. ఈ బోధిసత్వని పద్మపాణి చిత్రం భారతదేశం ప్రధాన నగరాలలో ముఖ్యమైన ప్రాంతాలలో చూడవచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా ఈ చిత్రాన్ని చూడవచ్చు.
ఇస్లామిక్ యూరోపియన్ పెయింటింగ్స్ గ్యాలరీ
అబ్దుల్ రెహమాన్ 1899 -1975 మధ్య వేసిన ప్రెస్టీజియస్ పెయింటింగ్స్ ఇవి వాష్ టెక్నిక్స్ ఉపయోగించి వేసినవి ఇందులో ద్రౌపతి పాండవుల చిత్రం కూడా ఉంది. ఈ చిత్రాలన్నిటిని ప్రముఖ కళా కారుడు చుంగ్ థాయి వేశారని ఇవి ఒకదానికొకటి పోటీ పడతాయని అవి చూశాక అర్థమవుతుంది.
లఘు చిత్రాలు
• దక్కన్ పెయింటింగ్స్ ఒరిజినల్ మోడల్స్ ఇక్కడ చూడవచ్చు. ఈ పెయింటింగ్స్ లక్షణాలను ఈ చిత్రాలను చూసి తెలుసుకోవచ్చు. చిన్న చిన్న పెయింటింగ్స్ లో చిత్రకారులు అందంగా పొందికగా ఆకర్షణీయమైన రంగులతో ప్రతిభాగము కనిపించే విధంగా తీర్చిదిద్దారు.
• రాగరాగిని చిత్రాలు ఇందులో హీరో- హీరోయిన్ లక్షణాలు కనిపిస్తాయి. ( మ్యూజిక్ )సంగీతం కు సంబందించిన పెయింటింగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయని చూశాక తెలుస్తుంది . ఉదాహరణకు- మేఘరాగిణి, భైరవరాగిణి, సోహిని రాగిణి, తోడి రాగిణి, మాలకేశరాగిణి లాంటి చిత్రాలు అపురూప చిత్రమాలికలుగా ఉన్నాయి. ఇలాంటివి సాలార్జంగ్ మ్యూజియంలో కూడా చూడవచ్చు. అక్కడ కూడా వీటి కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయబడింది .దక్కన్ స్కూల్లో వేసిన వివిధ చిత్రాలు ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు.
• మహబూబ్ నగర్, వనపర్తి సంస్థానాల యొక్క పెయింటింగ్స్ ఇక్కడ చూడవచ్చు. వీటితోపాటు ఖురాన్ ప్రతులు ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం జరిగింది. స్వహస్తాలతో రాసినవి, మినీ ఖురాన్ ప్రతులు, బంగారు అక్షరాలతో రాసినవి ఇక్కడ చూడవచ్చు. పైన పేర్కొన్న పెయింటింగ్స్ మరియు ఖురాన్ ప్రతులు సందర్శకులు తాకితే వాటి సహజత్వాన్ని కోల్పోతాయి కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తలు తీసుకుంటూ వీటిని పరిరక్షిస్తున్నారు. పురాతన సంస్కృతి సంపద ముందు తరాలకు అందిస్తుండడం మెచ్చుకోదగ్గ విషయం.
• విలాస వంతమైన పాత్రల తో కూడిన బీదర్ రాజులు వాడిన వస్తువులు అలంకరణ సామాగ్రి ,టెర్రకోట వస్తువులు, స్ట్రక్కో శిల్పాలు, దంతపు సామాన్లు, టెక్స్టైల్స్ ,గ్లాస్ ఐటమ్స్, నేపాల్ తార శిల్పాలు, ఫోర్సులిన్, చైనీస్ ఆర్టికల్స్, పింగాణి వస్తువులు ఈ గ్యాలరీలో చూడవచ్చు.
• శ్రీకృష్ణదేవరాయల కాలంనాటి శిల్పాలు బొమ్మలు, మోటుపల్లిలో లభించిన అత్యంత విలువైన నటరాజ విగ్రహం, గంట ఆకారపు వస్తువులు (కంచుగంటలు) వివిధ ఆకృతిలో ఉన్న లోహపు విగ్రహాలు వస్తువులు ఇక్కడ విభాగంలో కనువిందు చేస్తున్నాయి.
నటరాజ విగ్రహం
ఒకవైపు గంగాదేవి చంద్రవంక విగ్రహం చుట్టూ ప్రభామండలం చేతిలో డమరుకంతో ఉన్న ఈ విగ్రహం అత్యంత విలువైన విగ్రహాలలో ఒకటి. శ్రీకృష్ణదేవరాలకు సంబంధించిన విశేషాలతో కూడిన క్యాలెండర్స్ పెయింటింగ్స్ ఇక్కడ చూడవచ్చు. విజయనగర సామ్రాజ్య వంశవృక్షం ఇక్కడ గోడపై కనిపిస్తుంది. బంగారు జడలు, లోహపు వస్తువులు, దంతపు వస్తువులు ఇంకా ఎన్నో రకాల ప్రాచీన వస్తువులు చారిత్రక సాక్షాలుగా ఇక్కడ నిలిచాయి.
ఈజిప్ట్ మమ్మీ:
ఈజిప్ట్ నుండి తీసుకురాబడిన మమ్మీలు మన భారత దేశంలో ప్రస్తుతం లక్నో జైపూర్ హైదరాబాద్ ఢిల్లీ మ్యూజియంలో కనిపిస్తాయి. ఈ మమ్మీ లను జాగ్రత్తపరచడానికి సోడియం బై కార్బోనేట్ ద్రావణంలో 70 రోజులు మృతదేహాన్ని ఉంచి , తర్వాత ఒక రకమైన బట్టతో డ్రాపింగ్ చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న ఈ మమ్మీని 1000 పౌండ్స్ కి నిజం రాజు 1920లో కొనుగోలు చేశారు. ఈజిప్టు రాజవంశాల వారు చనిపోయిన తర్వాత వారి పూర్వీకుల మృతదేహాలను ఇలా మమ్మీల రూపంలో భద్రపరుస్తారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న మమ్మీ యువరాణి నీశుశికి సంబంధించినది. 1920లో ఆరవ మీర్ నిజాం మెహబూబ్ అలీ ఖాన్ చేత పొందబడింది. దానిని చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మ్యూజియంకు విరాళంగా ఇవ్వడంతో 1930 నుండి ఇక్కడ మ్యూజియంలో ఉంచడం జరిగింది.2008లో ఇక్కడ మ్యూజియంలో ఒక కత్తి నిజాం కాలం నాటిది చోరీకి గురైందట అప్పటినుండి పటిష్టమైన భద్రతతో ఈ మ్యూజియంను నిర్వహిస్తున్నారు .
పురావస్తు మ్యూజియంలు మన పూర్వ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు. అవి మన సంస్కృతి, సంప్రదాయాలు, కళా ప్రదర్శనలు, శాస్త్రీయ ఆవిష్కరణలు వంటి ఎన్నో విలువైన అంశాలను మన ముందుకు తీసుకువస్తాయి. ప్రతి పురావస్తువు వెనుక ఒక కథ ఉంటుంది. అది మన పూర్వికుల బుద్ధి, ప్రతిభ, జీవనశైలిని తెలియజేస్తుంది. అలాంటి మ్యూజియంలను కాపాడటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ప్రతి పౌరుడి కర్తవ్యంగా భావించాలి. మ్యూజియంలో ఉన్న వస్తువులు కేవలం పాతవస్తువులు కావు అవి మన “గతం”తో మన “వర్తమానం”ను కలిపే బంధం. అవి మన జాతి గుర్తింపుని నిలబెట్టే అమూల్యమైన సంపద. అందువల్ల మ్యూజియంలను పరిశుభ్రంగా ఉంచడం, వాటి వస్తువులను గౌరవంగా చూడటం, వాటి ప్రాముఖ్యతను పిల్లలకు, యువతకు తెలియజేయడం చాలా అవసరం. ఈ విధంగా సూచనలు మనం మన వారసత్వాన్ని రక్షించి, వచ్చే తరాలకు అందించగలం. విద్యార్దులకు మంచి విజ్ఞానాన్నిఅందిచే ఈ మ్యూజియంలో కి వెళ్ళడానికి విద్యార్దులకు ఎలాంటి ప్రవేశారుసుము లేదు. కాబట్టి ప్రతీ స్కూల్ వాళ్ళు తమ విద్యార్దులకు ఈ చారిత్రక క్షేత్ర పర్యటన ద్వారా చారిత్రక ఘట్టాలను వివారిచవచ్చు . మరి ఈ మ్యూజియం ని మీ విద్యార్దులకు పరిచయం చెయ్యండి.
పురావస్తు మ్యూజియంల పరిరక్షణ మన చరిత్రపై ప్రేమకు, సంస్కృతిపై గౌరవానికి ప్రతీక. గతాన్ని గౌరవించి కాపాడినప్పుడే భవిష్యత్తు మరింత వెలుగునందుతుంది.
కాబట్టి పురావస్తు మ్యూజియంలను కాపాడటం మనందరి పవిత్ర బాధ్యత.
