Let's talk: editor@tmv.in
చర్చలకు కేంద్రం ముందుకు వచ్చింది:వాంగ్‌చుక్

చర్చలకు కేంద్రం ముందుకు వచ్చింది:వాంగ్‌చుక్

Pinjari Chand
18 మార్చి, 2026

జైలు నుంచి విడుదలైన తర్వాత లడఖ్ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ తొలిసారిగా స్పందించారు. తన నిర్బంధం రద్దును ‘విన్-విన్’ పరిణామంగా అభివర్ణించారు. ప్రజలతో అర్థవంతమైన చర్చలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసిందని తెలిపారు. తన భార్య, హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లడఖ్ (హెచ్‌ఐఏఎల్‌) సహ వ్యవస్థాపకురాలు గీతాంజలి జే అంగ్మోతో కలిసి మంగళవారం మీడియాతో మాట్లాడిన వాంగ్‌చుక్, లడఖ్‌లో జరుగుతున్న ఉద్యమాల ప్రధాన లక్ష్యం సార్థకమైన సంభాషణ ప్రారంభించడమేనని చెప్పారు. మేము కోర్టులో గెలుస్తామని నమ్మకం ఉంది. కానీ గెలుపు ఒక్కటే సరిపోదు. అందరికీ లాభం చేకూరే ‘విన్-విన్’ పరిణామం కావాలని కోరుకున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నమ్మకాన్ని పెంపొందించేందుకు, సానుకూల చర్చలకు మార్గం సుగమం చేసేందుకని వాంగ్‌చుక్ అభిప్రాయపడ్డారు. లడఖ్‌లోని ఉద్యమాలన్నీ చర్చల కోసం జరిగాయి. ప్రజలు ఆయుధాలు ఎత్తకుండా, ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలంటూ కోరడం అరుదైన విషయమని వ్యాఖ్యానించారు. తదుపరి చర్యలపై మాట్లాడుతూ, లడఖ్‌కు వెళ్లి లేహ్‌ అపెక్స్‌ బాడీ (ఎల్‌ఏబీ), కార్గిల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ (కేడీఏ) నాయకులతో చర్చలు జరుపుతానన్నారు. ఈ రెండు సంస్థలు గత ఐదేళ్లుగా లడఖ్‌కు రాష్ట్ర హోదా, అలాగే ఆరో షెడ్యూల్ వర్తింపునకు ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి.

మరోసారి నిరాహార దీక్షకు దిగుతారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, “నాకు నిరాహార దీక్ష చేయడం ఇష్టం లేదు. పరిస్థితులు నన్ను ఆ దిశగా నెట్టాయి. ఇప్పుడు ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడంతో మంచి ఉదాహరణ నిలుస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. 59 ఏళ్ల వాంగ్‌చుక్‌ను గత సంవత్సరం సెప్టెంబర్ 26న నేషనల్ సెక్యూరిటీ యాక్ట్‌ కింద అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనల్లో నలుగురు మరణించిన నేపథ్యంలో ఆయనను నిర్బంధించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఆయన నిర్బంధాన్ని రద్దు చేయడంతో, జోధ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి శనివారం విడుదలయ్యారు. 2019లో జమ్మూ కశ్మీర్ నుంచి లడఖ్‌ను వేరుచేసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ అమలు అంశాలు ప్రధాన డిమాండ్లుగా కొనసాగుతున్నాయి. ఇటీవల జరిగిన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో ఎల్‌ఏబీ, కేడీఏ ప్రతినిధులు చర్చలు జరిపారు. వాంగ్‌చుక్ సహా మరికొంతమందిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం కూడా ఈ సంస్థలు ర్యాలీలు, బంద్ నిర్వహిస్తూ తదుపరి చర్చల కోసం ఒత్తిడి కొనసాగించాయి.

చర్చలకు కేంద్రం ముందుకు వచ్చింది:వాంగ్‌చుక్ - Tholi Paluku