
చరిత్ర సృష్టించిన జమ్మూ కాశ్మీర్.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
భారత దేశ క్రికెట్ చరిత్రలో జమ్మూ కాశ్మీర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం కర్ణాటకతో జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన భారీ ఆధిక్యంతో జమ్మూ కాశ్మీర్ జట్టు తన మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 92 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో, 67 ఏళ్ల క్రితం రంజీ ట్రోఫీలో అడుగుపెట్టిన జమ్మూ కాశ్మీర్‌కు ఇది తొలి టైటిల్ కావడం విశేషం.
మొదటి ఇన్నింగ్స్‌లో జమ్మూ కాశ్మీర్ 584 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీనికి కర్ణాటక 93.3 ఓవర్లలో 293 పరుగులకే ఆలౌట్ అయింది. జమ్మూ కాశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ (5/54) తన పదునైన బౌలింగ్‌తో కర్ణాటకను కట్టడి చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్‌కు 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
ఫాలోఆన్ అమలు చేయకుండా మళ్లీ బ్యాటింగ్ ప్రారంభించిన జమ్మూ కాశ్మీర్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కమ్రాన్ ఇక్బాల్ 160 పరుగులతో నిలిచాడు. అతనితో పాటు సాహిల్ లోత్రా 101 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. ఈ జంట అద్భుత ప్రదర్శనతో జట్టు మొత్తం ఆధిక్యాన్ని 633 పరుగులకు చేర్చింది. చివరికి ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించగా, తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన జమ్మూ కాశ్మీర్ చాంపియన్‌గా ప్రకటించబడింది. 67 ఏళ్ల క్రితం రంజీ ట్రోఫీలో అడుగుపెట్టిన జమ్మూ కాశ్మీర్‌కు ఇది తొలి టైటిల్ కావడం విశేషం. ఈ విజయం ఆ ప్రాంత క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది.
జమ్మూ కాశ్మీర్ జట్టుకు ప్రధాని మోదీ అభినందనలు
రంజీ ట్రోఫీ చరిత్రలో మొట్టమొదటిసారిగా టైటిల్ గెలుచుకున్న జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. కర్ణాటకతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా జమ్మూ కాశ్మీర్ ఈ చారిత్రక విజయాన్ని అందుకుంది.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని, "జమ్మూ కాశ్మీర్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు ఈ విజయం క్రీడాకారుల అద్భుతమైన పట్టుదల, క్రమశిక్షణ, ప్రతిభకు నిదర్శనం. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గర్వకారణమైన క్షణం అని పేర్కొన్నారు. ఈ విజయం యువ అథ్లెట్లు పెద్ద కలలు కనేలా స్ఫూర్తినిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
