Let's talk: editor@tmv.in
చరిత్ర చెప్పే.. పురాతన ప్రదర్శన శాలలు

చరిత్ర చెప్పే.. పురాతన ప్రదర్శన శాలలు

Dantu Vijaya Lakshmi Prasanna
5 అక్టోబర్, 2025

ఆధునిక కాలంలో జనాభా పెరుగుదలవల్ల పట్టణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి జరిగి మారుమూల ప్రాంతాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల కొత్త కొత్త ప్రాంతాలలో చరిత్రకు సంబందించిన ఆనవాళ్ళు లభిస్తున్నాయి. ఇప్పటికే లభించిన ఆధారాలతో వాటిని పోల్చుకుంటూ మరిన్ని వాటిని వాటికి చేరుస్తూ కొత్త చరిత్ర నిర్మాణానికి ఎంతోమంది ఔత్సాహికులు అన్వేషణ జరుపుతూ ఉంటారు. ఉన్న వనరులను (మార్గాలను) ఉపయోగించుకుంటూ చరిత్ర పునర్నిర్మాణానికి చరిత్రకారులు అవలంభించే మార్గమే నేటి చరిత్ర అన్వేషణకు ఆధారము.

గతానికి, వర్తమానానికి మధ్య కాలమే మనం తెలుసుకుంటున్న చరిత్ర . శిలాయుగము - పూర్వ మానవుని జీవన విధానాన్ని తెలిపితే సింధు నాగరికత - మానవుని అభివృద్ధి పరిణామ క్రమాన్ని తెలియజేసింధి. చరిత్రకు వాస్తవాలు కావలి . అంతఃవిమర్శ, బాహ్యవిమర్శ చేసుకోవాలి. వాస్తవాన్ని బయటకు తీసుకొచ్చి చెప్పగలగాలి. వాటిని విశదీకరించి జరుగుతున్న విషయాలకు అనుసందానించుకుని కొత్త రచనను సాగించాలి. కొంత మంది చరిత్రకారులు వాళ్ళ ప్రాంత ప్రాముక్యతను పెంచడానికి కొన్ని కల్పితాలు జోడించి పుస్తకాలువ్రాస్తారు. కాబట్టి లిఖిత ఆధారాలుకన్నా పురావస్తు ఆధారాలు విశ్వసనీయంగా ఉంటాయి. కాబట్టి వీటిని మనం మ్యూజియంలలో చూడగలం.

దేశంలో ఈ పురావస్తు శాఖ నిర్వహణ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కొనసాగిస్తే స్టేట్ లో చరిత్ర పరిశోధకులు మరియు స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తారు. వీరి అన్వేషణలో ముందుగా త్రవ్వకాలు జరుపుతారు. ఇవి మూడు రకాల పద్ధతులు. ఎవరు వెళ్లలేని ప్రాంతాలలోకి ఫ్లైట్స్ హెలికాప్టర్ డ్రోన్స్ పంపి ఫొటోస్ తీసి వాటి ఆధారంగా అన్వేషణ కొనసాగించడం. సముద్రం నదులలో లంగరు వేసినప్పుడు దొరికిన వస్తువులు బొమ్మలు ఆధారంగా చేసుకుని పరిసర ప్రాంతాల్లో అన్వేషించడం దీనినే తీరప్రాంతాల అన్వేషణ అంటారు. నాగరికత ఆనవాళ్లు తీరప్రాంతాలలో ఎక్కువగా లభ్యమవుతాయి .నడిచి వెళ్తూ కొండలలో గుట్టలలో అడవులలో తిరుగుతూ అన్వేషించడం. ఈ అన్వేషణ పూర్తయ్యాక ఒక స్థలాన్ని గుర్తించి అక్కడ కొంతమంది సిబ్బందితో వెళ్లి త్రవ్వకాలు జరిపి చారిత్రక సంపదను వెలికి తీస్తారు. వీరి వెంట నిరంతరం ఒక టూల్ కిట్ ఉంటుంది .చిన్న గుణపం, పార బ్రష్ వంటివి తీసుకెళ్తూ ఉంటారు. ఈ అన్వేషణలో వారికి లభించిన ఆధారాలు కట్టడాలు శాసనాలు నాణాలు బౌద్ధ స్తూపాలు అక్కడి నుండి మ్యూజియాలకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు తరలించి అక్కడ ల్యాబ్ లో నిపుణులైన చరిత్రకారులచే పరిశీలించి వాటి వివరాలను క్రోడీకరించుకుని, లేబుల్స్ ఏర్పాటు చేసి వాటిని రికార్డ్ చేసి తరువాత ప్రభుత్వ అనుమతితో ప్రజలకు సందర్శన నిమిత్తం మ్యూజియాలకు తరలించి ఎగ్జిబిట్ చేయడమే ఈ పురావస్తు శాఖ నిర్వహణలో జరుగు పద్ధతి. వీటి వెనుక ఇంతటి కృషి దాగుండడమే కాకుండా దొరికిన విలువైన సంపదను భద్రపరచడం కూడా సవాలుతో కూడిన పనే .

వీటి నిర్వహణలో ఏమాత్రం లోపం జరిగినా చరిత్ర స్థితిగతులే మారిపోతాయి. కాబట్టి చరిత్రకారులు నిశితంగా వీటిని పరిశీలించి వాటి వివరాలను తెలిపి వాటిని భద్రపరుస్తారు. ఇలా భద్రపరచడం వల్లే వేదాలు పురాణాలు ఇతిహాసాలు, రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు, రాజ తరంగణి, హర్ష చరిత్ర, కౌటిల్యుని అర్థశాస్త్రం తాళపత్ర గ్రంధాలు ఇంకా మనం చూడగలుగుతున్నాం. మౌర్యుల కాలంనాటి నాణాలు , సింధు నాగరికత ప్రజలు వాడిన టెర్రకోట బొమ్మలు, అమ్మ తల్లి విగ్రహం, గుప్తుల కాలం నాటి గ్రంథాలు, ఢిల్లీ సుల్తాన్ల కట్టడాలు, నిర్మాణాలు కుతుబ్షాహీల ఆధునికీకరణ ఇవన్నీ పూర్వకాలపు ఇంజనీరింగ్ పద్ధతులను వారి విజ్ఞానాన్ని మనకి కొత్తగా చూపిస్తున్నాయి చరిత్రపై అభిరుచితో చారిత్రక అన్వేషణలో భాగంగా గ్రంధాలయాలు మ్యూజియంలు సందర్శించిన వారికి ఇవి సరికొత్త పాఠశాలలుగా కనిపిస్తాయి.

చరిత్ర ఆధారాలు

ప్రాచీన భారతదేశ చరిత్రను తెలుసుకొనుటకు ఆధారాలు స్థూలంగా రెండు రకాలు

పురావస్తు ఆధారాలు

లిఖిత ఆధారాలు

పురావస్తు ఆధారాలు: మన పూర్వీకులు ఉపయోగించిన ఆయుధాలు సమాధులు కట్టడాలు గృహ నిర్మాణ పద్ధతులు పట్టణ నిర్మాణము దేవాలయాలు గోడలపై చిత్రించిన బొమ్మలు విగ్రహాలు చెక్కిన శిల్పాలు మట్టి పాత్రలు ఆభరణాలు మొదలైనవి. లిఖిత ఆధారాలు: వేదములు పురాణములు ఇతిహాసాలు మహాకావ్యాలు ధర్మసూత్రాలు గ్రంధాలు తాళపత్రాలు మొదలైనవి. కానీ ప్రాచీన చరిత్రను తెలుసుకొనుటకు లిఖితపూర్వకమైన ఆధారాలపై ఎక్కువగా ఆధార పడవలసి వస్తుంది. కొంతమంది చరిత్రకారులు తమ తమ రచన పద్ధతులలో వీటిని క్రోడీకరించారు. ఈ ఆధారాలలో మార్పులకు చేర్పులకు అవకాశం ఏర్పడి కల్పితాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కానీ పురావస్తు ఆధారాలు అత్యంత ఆమోదయోగ్యములు వీటిని మార్చలేము అని ప్రముఖ చరిత్రకారులు ఆచార్య నీలకంఠ శాస్త్రి గారు పేర్కొన్నారు.

వీటి విశ్లేషణ ఆధారంగా మానవునికి రాయడం చదవడం తెలియని కాలం ( లిఖితపూర్వక ఆధారాలు లభించని కాలం) చరిత్ర పూర్వయుగమని, మానవుడు చదవడం రాయడం నేర్చుకున్న తర్వాత (లిఖితపూర్వక ఆధారాలు లభించిన తర్వాత) చారిత్రక యుగమని అంటారు. ఈ రెండు యుగములకు మధ్య యుగమే ప్రోటో హిస్టారిక్ యుగము.(ఈ యుగములో సింధు నాగరికత ప్రజలకు రాయడం తెలుసునని చిత్ర రూపంలో లభించిన ఆధారాలను బట్టి తెలిసినా ఆ లిపి కనుగొనలేకపోవడంతో ఇప్పటికి దానిని ప్రోటో హిస్టారిక్ యుగమని అంటున్నాం ) సింధు నాగరికతకు లభించిన ఆనవాళ్లు అన్ని పురావస్తు ఆధారాలే. తరువాత ఈ విధంగా చారిత్రక యుగమును తెలుసుకొనుటకు వేదకాలం నాటి రుక్కులు, చాళుక్యుని అర్థశాస్త్రము, మోగస్తనీసు, షాహియాన్ లాంటి విదేశీయాత్రికుల రచనలు తోడ్పడుతున్నాయి.

మానవుని నాగరికత పరిణామ క్రమంలో తొలిమెట్టు శిలాయుగం. ఇది క్రీస్తుకు పూర్వం 50 వేల సంవత్సరాల నుండి 5 వేల సంవత్సరాల వరకు ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. దీనిని మానవుడు ఉపయోగించిన పనిముట్ల ఆధారంగా చేసుకుని మూడు భాగాలుగా విభజించారు.

1. ప్రాచీన శిలాయుగం

2. మధ్య శిలాయుగం

3.నవీన శిలాయుగం

పురావస్తు సముదాయాలైన గుహలు, వాడిన పాత్రలు, సామాగ్రి పనిముట్లు ,మృన్మయ పాత్రలు, ఆయుధాలు, శిల్పాలు, చిత్రలేఖనం వంటివి చరిత్ర తొలి దశ వివరణకు ప్రామాణికమైన ఆధారాలు. వాటిని పురావస్తు శాఖ త్రవ్వకాలు నిర్వహించడం ద్వారా కనుగొనబడతాయి. 1906 లో లార్డ్ కర్జన్ కాలంలో ఈ పురావస్తుశాఖ ఏర్పడింది. తర్వాత సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిపిన త్రవ్వకాలు భారతదేశ చరిత్ర గతినే మలుపు తిప్పాయి. ఉదా : సింధు నాగరికత కనుగొనబడడంతో ఆర్యుల కంటే మనదేశంలో ముందుగానే నాగరికత వర్ధిల్లింది అనియు మన దేశ నాగరికత వేదాలు కంటే ముందే పట్టణ నాగరికతను తనలో ఇముడ్చుకుందని కనుగొనగలిగారు.ఇలా కనుగొనబడిన అంశాలను వస్తువులను అపురూపంగా భద్రపరిచి రికార్డు చేసి భావితరాలకు చరిత్ర గతిని పరిచయం చేయడంలో దిశా నిర్దేశాలుగా మారినవి ఈ” మ్యూజియంలు”. లిఖిత మరియు పురావస్తు ఆధారాలను భద్రపరుస్తూ వాటి నిర్వహణను కొనసాగిస్తూ వాటి ద్వారా చరిత్ర పునాదులను వెతకడానికి ఈ మ్యూజియంలో తోడ్పడుతున్నాయి అనడం అతిశయోక్తి కాదేమో…

మ్యూజియం - వాటి నిర్వాహణ

మ్యూజియం ఇది ఒక భవన సముదాయం కాదు. ఒక పాఠశాల ఒక ప్రయోగశాల అద్భుతాలను వెలికి తీసి భద్రపరిచిన పురావస్తు కర్మగారము ఇలా ఏదైనా అనుకోవచ్చు.ప్రాచీన చారిత్మక జాడలను ముందు తరాలకు తెలియ చెప్పడమే కాకుండా వాటిని శోధించి పరిశీలించి ఎన్నో వేల సంవత్సరాల చారిత్రాత్మక ప్రభావాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ అబ్బురపరుస్తున్నాయి. “మానవుని ఎదుగుదల క్రమము నుండి వారు వాడిన వస్తువులు, ఆయుధాలు, వస్త్రాలు, ఇటుకలు, మట్టి పాత్రలు కుండలు అన్ని ఆనాటి జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ ఒకే కప్పు కింద ఎన్నో చారిత్రక చిత్రవిచిత్రమైన విభాగాలు ఉన్న పురాతన వైభవమే మ్యూజియం”

ప్రతి మ్యూజియంలో అనేక విభాగాలు ఉంటాయి కొన్ని చారిత్రక కట్టడాలను వస్తువులను బొమ్మలను విగ్రహాలను తనలో దాచుకుంటే మరికొన్ని చిత్రలేఖనాన్ని శాసనాల్ని నాణాల్ని తాళపత్ర గ్రంథాల్ని భద్రపరుస్తున్నాయి. ఇవన్నీ చరిత్రకు ఆధారాలుగా నిలుస్తున్నాయి.వీటి ఆధారంగానే పురాతన చరిత్రను కొత్త కోణంలో చూడగలుగుతున్నాం . ఈ మ్యూజియంలు సాంకేతిక సాంస్కృతిక కేంద్రాలుగా ఉంటున్నాయి. చదువురాని వారు కూడా మ్యూజియంను సందర్శించినప్పుడు అక్కడ చిత్రాలను వస్తువులను చూసినప్పుడు చరిత్ర పూర్వ యుగం నుండి ప్రస్తుత కాలం వరకు జరిగిన మార్పులు స్పష్టంగా తెలిసే విధంగా ఈ మ్యూజియంల నిర్వహణ ఉంటుంది. ముఖ్యంగా ఒక వస్తువు లేదా చిత్రం లేదా శిల్పం అందరికీ స్పష్టంగా కనిపించే విధంగా ప్రత్యేకంగా తయారు చేసిన అద్దాల అరల గదులను ఏర్పాటు చేస్తారు. వెలుతురు ఆ వస్తువు యొక్క సహజసిద్ధత్వాన్ని కోల్పోనీయకుండా వస్తువు యొక్క గొప్పతనం మాత్రం కనిపించేలా ఏర్పాటు చేస్తారు. ప్రతి వస్తువు యొక్క సేకరణ వివరాలు దానికి సంబంధించిన అంశాలు లేబుల్స్ రూపంలో రాసి వస్తువు వద్ద ఉంచుతారు. చిత్రాలు లేదా వస్తువులు తాకితే వాటి సహజత్వాన్ని కోల్పోతాయి కనుక వాటిని సంరక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటారు.ప్రత్యేకమైన సిబ్బంది నైపుణ్యం కలిగిన గైడ్ అందుబాటులో ఉంటారు. పురావస్తు వస్తువులు తవ్వకాలు సేకరణ వాటి సంరక్షణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు భద్రపరిచే విధానం గురించి మీరు నిరంతరం సమీక్షిస్తుంటారు. ప్రత్యేకమైన రసాయనయాలతో కూడిన ల్యాబ్ కూడా వీరి ఆధ్వర్యంలో ఉంటుంది ఒక శిల్పం యొక్క కాలాన్ని అంచనా వేయడానికి ఇవి ఉపయోగిస్తారు. శాసనాలు చదవడానికి ప్రత్యేకమైన విభాగము నాణాలు గురించి తెలుసుకోవడానికి తాళపత్ర గ్రంధాలు రాగిరేకులు వంటి వాటిని సంరక్షించడానికి వీరు నిరంతరం జాగ్రత్తలు తీసుకుంటారు. గ్రంధాలయాలు కూడా మ్యూజియాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడతాయి వీటిలో అక్కడి వస్తువుల వివరాలు విశేషాలు తెలుసుకునే పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.

తెలంగాణలో మ్యూజియంల ప్రభావం- పాత్ర

పాతరాతి యుగంలో భారతదేశపు ఇతర ప్రదేశాలతో సమానంగా తూగగలిగిన చరిత్ర తెలంగాణకు ఉంది. దిగువ రాతియుగానికి చెందిన సాంకేతిక సాంప్రదాయక పనిముట్లు ఆవాస స్థలాలు రాష్ట్రంలోని పెద్దపల్లి తాలూకా రామగుండం, గోదావరి ఖనిలలో లభ్యమయ్యాయి.నిశితంగా పరిశీలిస్తే అన్ని జిల్లాలలో లభించిన అవశేషాల వల్ల మానవ నాగరికత ప్రగతి పదంలో ప్రధాన భూమిక వహించిన పాత, మధ్య, నవీన శిలా యుగాల సంస్కృతులకు తెలంగాణ కూడా ఒక కేంద్ర బిందువు అని చెప్పవచ్చు. తర్వాతి కాలంలో జనపదాల ఏర్పాటులో అనగా ఆరవ శతాబ్దంలో తెలంగాణ ప్రముఖ పాత్ర వహించింది.ఆనాటి ప్రముఖ జనపదాలలో “అస్మక జనపదం” నిజామాబాద్ ప్రాంతంలోని బోధన్ రాజధానిగా చేసుకుని ఉండేదని చరిత్ర స్పష్టం చేసింది.అలాగే మౌర్యుల కాలంలో దక్షిణాపద వర్తక వాణిజ్యాలు కౌటిల్యుని అర్థశాస్త్రం వివరిస్తుంది.

తెలంగాణలో కొండాపూర్ శాతవాహనుల టంకశాల నగరం వరంగల్ సమీపంలో కూడా సాధ్వవాహన పేరుతో కొన్ని నాణాలు లభ్యమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దు లో రెండవ పులికేసి శాసనంలో చాళుక్య విశేషాలు ప్రస్తావించబడ్డాయి. చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన భవభూతి 7, 8 శతాబ్దాలలో తెలంగాణలో వర్ధిల్లాడు రాష్ట్ర కూటల సామంతులు క్రీస్తు శకం 750- 953 కాలంలో బోధన్ వేములవాడను పాలించారు.నల్గొండ కొలనుపాక ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల ప్రస్తావన ఆనాటి చాళుక్యుల శాసనాల్లో విరివిగా ఉంది .కళ్యాణి చాళుక్యులు, పోలావాసి నాయకులు, కుందూరు చోళులు పాలన ,తర్వాతి కాలంలో కుతుబ్షాహీలు, అసఫ్జాహీల చరిత్ర తెలంగాణ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితుల పరిణామాలు తెలంగాణ చరిత్రకు ఉనికిని తెచ్చిపెట్టాయి. ఇవన్నీ వారు వేయించిన శాసనాలు నాణాలు వాడిన వస్తువులు వ్రాసిన గ్రంథాలు వల్ల తెలుస్తుంది. మరి వాటిని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో త్రవ్వకాలు జరిపించి పరిశీలించి, పరిశోధించి విభిన్న పద్ధతిలో వాటిని భద్రపరిచిన విభాగం మాత్రం ఈ మ్యూజియంలే అని నిష్పక్షపాతంగా చెప్పవచ్చు.

తెలంగాణ ప్రాంతంలో అందుబాటులో ఉన్న మ్యూజియంలు:

తెలంగాణ స్టేట్ మ్యూజియం, సాలార్జంగ్ మ్యూజియం, బి. ఎమ్. బిర్లా మ్యూజియం, హెరిటేజ్ మ్యూజియం, ఇవన్నీ తెలంగాణ చరిత్రతో పాటు భారతదేశ చరిత్రను ముందు తరాలకు పరిచయం చేస్తున్నాయి. తెలంగాణ స్టేట్ మ్యూజియం, హెరిటేజ్ మ్యూజియం లాంటివి స్టేట్ గవర్నమెంట్ నిర్వహిస్తుండగా సాలార్జంగ్ మ్యూజియం సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. పురావస్తు శాఖ జరుపు త్రవ్వకాలు, అక్కడ లభించిన పురాతన వస్తువులు భద్రత మధ్య రవాణా ల్యాబ్ లో వాటి పరిశీలన కాల నిర్ణయము వంటి వివరాలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుంది.కష్టతరమైన ఈ పనులన్నీ ఎంతో బాధ్యతగా నిర్వహిస్తూ పురాతన చరిత్రను భావితరాలకు అందించడానికి వారు చేసే ప్రయత్నాలు అభినందించదగినవి. ఈ అన్వేషణలో వారికి లభించిన ఆధారాలు కట్టడాలు శాసనాలు నాణాలు బౌద్ధ స్తూపాలు అక్కడి నుండి మ్యూజియంనకు తరలించి నిపుణులైన చరిత్రకారులు పరిశీలించి వాటి వివరాలతో కూడిన పుస్తకాలను రికార్డులను తయారుచేసి భావితరాలకు చరిత్రపై ఆసక్తిని కలుగజేస్తున్నారు. రోజుకో ప్రదేశంలో దొరుకుతున్న వివిధ ఆధారాల వల్ల చరిత్ర కొత్త రూపురేఖలను దిద్దుకుంటుంది. వివేకాన్ని విజ్ఞానాన్ని అందించే మ్యూజియంలు భావితరాలకు విజ్ఞాన కేంద్రాలుగా ఉపయోగపడుతున్నాయి.

ప్రస్తుత కాలంలో మ్యూజియంలో నిర్వహణ కష్టతరంగా మారి అత్యంత విలువైన సంపద మరుగున పడుతుంది . పురాతన సంపదను వెలికి తీసే ప్రయత్నాలు తగ్గుతున్నాయి. ప్రతి విషయంలోనూ హయ్యర్ అఫీషియల్ పర్మిషన్స్ తీసుకోవాల్సిన రావడంతో అనుమతుల విషయంలో జాప్యత జరిగి వస్తువుల తరలింపు భద్రత పరిశీలన విషయాలలో కూడా ఆలస్యం చోటు చేసుకుంటుంది. దీనివల్ల వస్తువులు కాల నిర్ధారణ కష్టతరమవుతుంది. స్టేట్ మ్యూజియం పురాతన భవనం కావడం వల్ల చాలా విభాగాలలో ప్రకృతి వల్ల సంభవించిన మార్పులతో మ్యూజియం నిర్వహణ కష్టతరంగా మారింది. చాలా వస్తువులు ఆరుబయట సంరక్షణ లేకుండా ఉండిపోతున్నాయి. మ్యూజియం గురించిన విషయాలు కూడా చాలామందికి తెలియదు. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులో ఉన్నందున దాన్ని వాడుకుని ఔత్సాహితులకు మరియు విద్యార్థులకు చరిత్ర పట్ల అవగాహన కల్పించేందుకు మ్యూజియం పట్ల ఆసక్తి కలిగేందుకు ప్రభుత్వం వారు తగిన ఏర్పాట్లు చేయవలసి ఉంది.

పురావస్తు మ్యూజియంలు మన పూర్వ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు. అవి మన సంస్కృతి, సంప్రదాయాలు, కళా ప్రదర్శనలు, శాస్త్రీయ ఆవిష్కరణలు వంటి ఎన్నో విలువైన అంశాలను మన ముందుకు తీసుకువస్తాయి. ప్రతి పురావస్తువు వెనుక ఒక కథ ఉంటుంది . అది మన పూర్వికుల బుద్ధి, ప్రతిభ, జీవనశైలిని తెలియజేస్తుంది. అలాంటి మ్యూజియంలను కాపాడటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు; ప్రతి పౌరుడి కర్తవ్యంగా భావించాలి. మ్యూజియంలో ఉన్న వస్తువులు కేవలం పాతవస్తువులు కావు . అవి మన “గతం”తో మన “వర్తమానం”ను కలిపే బంధం. అవి మన జాతి గుర్తింపుని నిలబెట్టే అమూల్యమైన సంపద. అందువల్ల మ్యూజియంలను పరిశుభ్రంగా ఉంచడం, వాటి వస్తువులను గౌరవంగా చూడటం, వాటి ప్రాముఖ్యతను పిల్లలకు, యువతకు తెలియజేయడం చాలా అవసరం. ఈ విధంగా మనం మన వారసత్వాన్ని రక్షించి, వచ్చే తరాలకు అందించగలం. పురావస్తు మ్యూజియంల పరిరక్షణ మన చరిత్రపై ప్రేమకు, సంస్కృతిపై గౌరవానికి ప్రతీక. గతాన్ని గౌరవించి కాపాడినప్పుడే భవిష్యత్తు మరింత వెలుగునందుతుంది. కాబట్టి పురావస్తు మ్యూజియంలను కాపాడటం మనందరి పవిత్ర బాధ్యత.

చరిత్ర చెప్పే.. పురాతన ప్రదర్శన శాలలు - Tholi Paluku